నేరాల నియంత్రణకే కార్డన్‌ సెర్చ్‌

DCP Nagaraju Clarify About Cardon Search - Sakshi

పట్టుబడిన ద్విచక్ర వాహనాలు 

మద్యం బాటిళ్లు స్వాధీనం 

ఇన్‌చార్జ్‌ డీసీపీ నాగరాజు వెల్లడి

ఆలేరు : నేరాల నియంత్రణకే కార్డన్‌ సెర్చ్‌ చేపడుతున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్‌చార్జ్‌ డీసీపీ కె.నాగరాజు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆలేరు  పట్టణంలోని సుభాష్‌నగర్, ఆదర్శనగర్‌లలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలతో పాటు ఒక రౌడీషీటర్‌ను, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్న ఇరువురిపై ఎక్సైజ్‌ కేసు నమోదు చేశామని, 3 గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అంతే కాకుండా ద్విచక్ర వాహనాలను నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. వాహనాలు నడిపే వారు విధిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని, వాహనాలకు ఇన్సూరెన్స్‌ చేయించాలని కోరారు.  రాత్రి 2గంటల నుంచి ఉదయం 6గంటల వరకు సోదాలు కొనసాగాయి. ఏసీపీ శ్రీనివాసాచార్యులు, 8 మంది సీఐలు, 10మంది ఎస్‌ఐలు, 17 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 51 మంది సివిల్‌ పోలీసులు, 13 మంది మహిళ పోలీసులు, హోంగార్డులు, 34 మంది ఎఆర్, సీసీఎస్, క్లూస్‌టీం, ఎస్‌ఓటీలు పాల్గొన్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top