భూ పంపిణీ కింద జిల్లాలోని దళితులకు వెయ్యి ఎకరాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని, అయితే లక్ష్యాన్ని మించి పంపిణీ చేసి భూపంపిణీలో...
సంగారెడ్డి అర్బన్: భూ పంపిణీ కింద జిల్లాలోని దళితులకు వెయ్యి ఎకరాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని, అయితే లక్ష్యాన్ని మించి పంపిణీ చేసి భూపంపిణీలో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతామని షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పిడమర్తి రవి వెల్లడించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.
జిల్లాలో దళితులకు మంజూరు చేస్తున్న పింఛన్లు, భూపంపిణీ కార్యక్రమాలపై పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, దళితులకు భూపంపిణీ చేసేందుకు జిల్లాకు రూ.110 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జిల్లాలో వెయ్యి ఎకరాల భూమిని దళితులకు పంపిణీ చేసే లక్ష్యాన్ని అధిగమించాలని ఆయన సూచించారు. భూపంపిణీకి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు.
జిల్లాలో అవసరమైనంత భూమి అందుబాటులో ఉందని, ధరలు కూడా తక్కువగానే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జియాలజిస్ట్‌లు, సర్వేయర్ల కొరత వల్ల భూపంపిణీ కార్యక్రమం కొంత మందకొడిగా సాగిందన్నారు. రానున్న రోజులలో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామన్నారు. ఇప్పటికే ఆసరా పథకం పనులు పూర్తయినందున అధికారులు భూపంపిణీ పథకంపై దృష్టి సారించాలన్నారు. త్వరలోనే దళితులకు కొత్త రుణాలు అందజేయనున్నట్లు తెలిపారు.
21 నుంచి 50 సంవత్సరాల వయసు గల దళితులకు ఉపాధి కోసం ఇచ్చే రుణాలను రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పిడమర్తి రవి వెల్లడించారు. అనంతరం డీఆర్‌ఓ దయానంద్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలులో జిల్లా రెండవ స్థానంలో ఉందని, త్వరలోనే తొలిస్థానానికి తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. జిల్లాలో దళితుల సంక్షేమానికి స్వయం ఉపాధికి తీసుకుంటున్న చర్యలను డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి ఈ సందర్భంగా వివరించారు.
అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్ మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో రూ. 7.15 కోట్లతో 67 మంది నిరుపేద దళితులకు 172 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేశామని, పంపిణీ చేసేందుకు మరో వందఎకరాల భూమి సిద్ధం చేశామన్నారు. ఇదే కాకుండా భూపంపిణీ కోసం మొత్తం 2 వేల ఎకరాలను గుర్తించామన్నారు.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డీడీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కల్యాణలక్ష్మీ పథకం కింద జిల్లాకు కోటి రూపాయలు మంజూరయ్యాయని, ఇప్పటి వరకు ఈ పథకం కింద వంద దరఖాస్తులు అందాయన్నారు. ఈ సమీక్షలో ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, ఎల్‌డీఎం రమణా రెడ్డి, వివిధ శాఖల అధికారులు, షెడ్యూల్డ్ కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.