19 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం


బాసర (ముథోల్‌) : బాసర (ట్రిపుల్‌ఐటీ)రాజీవ్‌గాంధీ నాలెడ్జ్‌ టెక్నాలజీ యూనివర్సిటీలో 2017–18 సంవత్సరానికి గాను ప్రవేశం కోసం ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇన్‌చార్జి వీసీ డాక్టర్‌ ఎ.అశోక్‌కుమార్, డైరెక్టర్‌ సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆరెళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుకు మొత్తం 19,071 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వారు 6,619 మంది, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన వారు 9,241 మంది, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి 3,211 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 15 మంది దరఖాస్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎస్టీ విద్యార్థులు 3,696, ఎస్సీ విద్యార్థులు 2,303, బీసీ విద్యార్థులు 10,917, ఓసీ విద్యార్థులు 2155 మంది ఉన్నారు.కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌..

ఎంపికైన విద్యార్థులకు ఈనెల 19నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. తొలిరోజున మొదటి 500 మంది విద్యార్థులకు, మరుసటి రోజు (ఈనెల 20న) 436 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఉంటుందని ఇన్‌చార్జి వీసీ పేర్కొన్నారు. వికలాంగుల, ఎన్‌సీసీ కోటా కౌన్సెలింగ్‌ 22న, స్పోర్ట్స్‌ కోటా కౌన్సెలింగ్‌ 24న, ఎన్నారై, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు 27న కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపారు. ఆయా తేదీలలో కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి తిరిగి 29న నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు రాకుంటే వారి స్థానంలో మిగతా వారిని (ఆన్‌లైన్‌ సీరియల్‌ పద్ధతి ప్రకారం) ఎంపిక చేసి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. 30న విద్యార్థులకు కళాశాల గదులు కేటాయింపు ఉంటుందని, జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.నిజామాబాద్‌ జిల్లాకు అత్యధిక సీట్లు..

జోగులాంబ గద్వాల్‌కు అత్యల్పం

బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ప్రవేశానికి గాను ఈ సారి పోటీ తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లా విద్యార్థులు అత్యధికంగా 118 సీట్లు సాధించారు. రెండో స్థానంలో కరీంనగర్‌ (76), మూడో స్థానంలో సిద్దిపేట (62), నాలుగో స్థానంలో జగిత్యాల (57), తదుపరి స్థానాల్లో వరంగల్‌అర్బన్‌ (54), నల్గొండ (44), నిర్మల్‌ (9), చివరిస్థానంలో జోగులాంబ గద్వాల్‌ జిల్లా (2)నిలిచినట్లు అధ్యాపకులు పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top