నిరంతరాయంగా.. నిత్యావసరాల సరఫరా 

Coronavirus: Non-stop supplies of essentials in Telangana - Sakshi

డీజీపీ కార్యాలయంలో కమోడిటీస్‌ కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షణ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారిని తరిమేయడానికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను సజావుగా సాగేలా చూస్తూనే.. మరోవైపు నిత్యావసరాల కొరత, సరఫరాకు ఇబ్బంది రాకుండా చూస్తున్నారు తెలంగాణ పోలీసులు. సరఫరాలో ఎలాంటి అవాంతరం ఎదురైనా క్షణాల్లో పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. సరుకులను ఉత్పత్తి దారుడి నుంచి వినియోగదారుడికి ఎలాంటి ఆటంకం లేకుండా చేరేలా చూడటమే ఈ రూం ప్రధాన లక్ష్యం. ఆహారపుగొలుసు తెగితే అది శాంతి భద్రతలకు, ప్రజల ప్రశాంత జీవనానికి భంగం వాటిల్లజేస్తుంది. ఫలితంగా లాక్‌డౌన్‌ ఉద్దేశం నెరవేరకపోగా, విపరీత పరిణామాలకు దారి తీసే ప్రమాదముంది.అందుకే, జీవో నం.45లో పేర్కొన్న విధంగా నిత్యావసరాల నిరంతరాయ సరఫరాకు పోలీసుశాఖ పెద్దపీట వేసింది. ఇందుకు సంబంధిత శాఖలతో కలిసి పనిచేస్తోంది. 

కంట్రోల్‌ రూమ్‌ నేపథ్యమిదీ.. 
లాక్‌డౌన్‌ నేపథ్యంలో జనసంచారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షల నేపథ్యంలో రెండోరోజే కూరగాయలు, నిత్యావసరాల ధరలు అమాంతంగా పెంచారు వ్యాపారులు. ఒక్కరోజు లాక్‌డౌన్‌కే ధరలు పదింతలు పెరగడాన్ని ప్రభుత్వం, పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది. తరువాత ధరలు పెంచకపోయినా.. నిత్యావసరాల రవాణాకు పలుచోట్ల ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి కమోడిటీస్‌ కంట్రోల్‌ రూంను డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. సీఐడీ ఏడీజీ గోవింద్‌ సింగ్, విమెన్‌సేఫ్టీ వింగ్‌ ఐజీ స్వాతి లక్రా, విమెన్‌సేఫ్టీ వింగ్‌ డీఐజీ సుమతిలకు ఈ కంట్రోల్‌ రూం బాధ్యతలు అప్పగించారు. ఆహారం, మందులు, నూనె, బియ్యం, కూరగాయలు, పౌల్ట్రీ, పండ్లు, మాంసం తదితర నిత్యావసరాల రవాణాకు సజావుగా సాగేలా చూస్తారు 

ఎలా పనిచేస్తుందంటే..? 
ఇందుకోసం జీవో నెం.45లో పేర్కొన్న విధంగా ఆరోగ్య, సివిల్‌సప్లయ్, వైద్య, వ్య వసాయ, పౌల్ట్రీ, మార్కెటింగ్, సూపర్‌మార్కెట్, రైస్‌మిల్లర్ల వ్యాపారులు– అధికారులతో కలిసి ప్రత్యేక వాట్సాప్‌గ్రూప్‌ ఏ ర్పాటు చేశారు. ప్రతీ జిల్లాకు ఒక డీఎస్పీ ర్యాంకు అధికారిని నోడల్‌ అధికారులుగా నియమించారు. రాష్ట్రంలో ఎక్కడ నిత్యావసరాలు సరఫరా చేసే వాహనం ఆగినా.. సదరు వ్యాపారులు కమోడిటీస్‌ కంట్రోల్‌రూమ్‌కు సమాచారమిస్తారు. వారు సదరు జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ను అప్రమత్తం చేస్తా రు. సదరు అధికారి స్థానిక పోలీసులతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించి.. వాహనం సాఫీగా వెళ్లేలా చూస్తారు. ము ఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల మధ్య నిత్యావసరాల రవాణాకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ప్రతీరోజూ సాయంత్రం నోడల్‌ అధికారులతో టెలికాన్ఫ రెన్స్‌ నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను తెలుసుకుని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top