బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించాలి

collector suggests to political parties to recruit polling booth agents - Sakshi

11న ప్రత్యేక ఓటరు సవరణ సద్వినియోగం చేసుకోవాలి

రాజకీయ పార్టీలతో కలెక్టర్‌ సమావేశం

జిల్లా ఓటరు జాబితా పరిశీలకుడిగా ఐఏఎస్‌ జగదీశ్వర్‌

కరీంనగర్‌సిటీ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి పోలింగ్‌ కేంద్రానికి సంబంధించి బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించాలని కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సూచించారు. ఓటర్ల జాబితా సవరణ, నమోదు అంశాలు, పోలింగ్‌ కేంద్రాల అంశాలపై వివిధ రాజకీయ పార్టీలతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గత నెల 23న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరిగిందని, ఆ జాబితాలో మార్పులు, చేర్పులుంటే బూత్‌స్థాయి అధికారిని సంప్రదించొచ్చని సూచించారు.

ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 14 వరకు అవకాశముందని తెలిపారు. ఓటరు జాబితాలో పేరు లేకుంటే బూత్‌స్థాయి, సహాయ ఓటరు నమోదు అధికారిని సంప్రదించొచ్చని, లేదా ఆన్‌లైన్, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మార్పులు, చేర్పుల దరఖాస్తులకు ఈనెల 11న ప్రత్యేక సవరణ తేదీని వినియోగించుకోవాలని, ఆ రోజు సంబంధింత బూత్‌స్థాయి అధికారులు పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. జనవరి 1, 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. తుది ఓటరు జాబితా మార్చి 24న ప్రకటిస్తారని తెలిపారు. భారత ఎన్నికల సంఘం జిల్లా ఓటరు జాబితా పరిశీలకుడిగా మహిళా శిశు, వికలాంగ వయోవృద్ధుల శాఖ రాష్ట్ర సెక్రటరీ ఐఏఎస్‌ జగదీశ్వర్‌ను నియమించామన్నారు. బీఎస్‌పీ ప్రతినిధి మల్లయ్య, బీజేపీ నుంచి వేణుగోపాల్, సీపీఐ నుంచి రాజు, ఐఎస్‌సీ నుంచి రెమహత్, ఎంఐఎం నుంచి ఇబ్రహీం, టీడీపీ నుంచి ఆగయ్య, కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్‌ తహసీల్దార్లు శ్రీనివాస్, రాజయ్య, మహేందర్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top