‘ఉమ్మడి భద్రత’ ఇబ్బందే

‘ఉమ్మడి భద్రత’ ఇబ్బందే

  •      వేధిస్తున్న సిబ్బంది కొరత

  •      30 శాతం ఖాళీలు భర్తీ చేయాలి

  •      అనిల్ గోస్వామికి వివరించిన సిటీ పోలీసులు

  •      అది రాష్ట్ర పరిధిలోని అంశమన్న కేంద్ర ప్రతినిధి

  •      ఎన్నికల తర్వాత గవర్నర్‌కు నివేదించాలని నిర్ణయం

  •  సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా విభజన ప్రక్రియ పురోగతిని సమీక్షించడానికి వచ్చిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి పర్యటనపై నగర పోలీసులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఉమ్మడి రాజధానిలో తమపై పడే భారాన్ని ఆయనకు వివరించిన అధికారులు ఖాళీల భర్తీ, సిబ్బంది సంఖ్య పెంపు అంశాలను ప్రస్తావించారు. మొత్తం సావధానంగా విన్న గోస్వామి ఆ అంశాలు రాష్ట్ర పరిధిలోవని, మీరే తేల్చుకోవాలంటూ స్పష్టం చేశారు. దీంతో వాస్తవ పరిస్థితుల్ని వివరిస్తూ ఎన్నికల అనంతరం గవర్నర్‌కు కీలక ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.

     

    రెట్టింపు కానున్న బందోబస్తులు

     

    రాష్ట్ర విభజన తరవాత కూడా హైదరాబాద్ నగరం గరిష్టంగా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. దీంతో సీఎం క్యాంప్ కార్యాలయం, సచివాలయం, మంత్రుల, ఎమ్మెల్యేల నివాస సముదాయాలు రెండేసి కానున్నాయి. రోడ్లపై ప్రముఖుల కదలికలు దాదాపు రెట్టింపు అవుతాయి. తమకున్న సమస్యలపై నిరసనలు తెలపడానికి రెండు రాష్ట్రాలకూ చెందిన నిరసనకారులు ఇక్కడే ధర్నాలు వంటిని కొనసాగిస్తారు.



    వీటికి తోడు తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ సమావేశాలు సైతం ఇక్కడే జరుగుతాయి. ప్రస్తుతం ఏడాదిలో మూడు దఫాలుగా జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలే గరిష్టంగా 45 రోజుల పాటు సాగుతున్నాయి. ‘ఉమ్మడి’ నేతృత్వంలో ఈ కాలం కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన కీలకాంశాలే.

     

    తీసికట్టుగా నగర పోలీసు సిబ్బంది



     దాదాపు 24 ఏళ్ల క్రితం అప్పటి సిటీ జనాభాను పరిగణలోకి తీసుకున్న పోలీసు విభాగం.. నగర పోలీసు విభాగానికి పోస్టుల్ని కేటాయించింది. కమిషనర్ నుంచి కానిస్టేబుల్ వరకు మొత్తం 12,401 పోస్టులు ఎలాట్ చేసింది. నాటి నుంచి నేటి వరకు ఇవి నూరు శాతం భర్తీ చేసిన దాఖలాలు లేవు. దీంతో ప్రస్తుతం సిటీ పోలీసు విభాగంలో 8,698 మంది సిబ్బందే అందుబాటులో ఉండగా దాదాపు 30 శాతం (3,703) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.



    క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన, దర్యాప్తు అధికారి హోదా కలిగిన ఎస్సై స్థాయితో పాటు బందోబస్తు, భద్రతా విధుల్లో కీలక పాత్ర పోషించే కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ పోసుల్లో అనేకం ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి రాజధాని నేపథ్యంలో జంట కమిషనరేట్లను కలిపేసినా సిబ్బంది కొరత తీరదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం 3500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సైబరాబాద్‌లో సైతం అందుబాటులో ఉన్న సిబ్బంది 5,155 మందే.

     

    కేంద్రం పరిధి కాదన్న గోస్వామి



    ఈ విషయాలను అనిల్ గోస్వామి దృష్టికి తీసుకువెళ్లిన నగర పోలీసులు ‘ఉమ్మడి భద్రత’ను చేపట్టాలంటే నగర కమిషనరేట్ పరిధిలో ఉన్న ఖాళీలను పూరించడంతో పాటు అదనంగా మరో నాలుగు వేల పోస్టుల్ని మంజూరు చేయాలని కోరారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించే విషయాన్ని పరిశీలించమని కోరారు.



    ఈ అంశంపై స్పందించిన అనిల్ గోస్వామి హైదరాబాద్ పోలీసు సిబ్బంది అనేది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశమని, దీనికి పరిష్కారం ఇక్కడే చూసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం నగర పోలీసులు తమ ఆశలన్నీ గవర్నర్ పైనే పెట్టుకున్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల అంశం గవర్నర్ చేతిలో ఉంటుంది. బందోబస్తు సమస్యలు శాంతిభద్రతల నిర్వహణ కిందికే వస్తుంది కనుక పోస్టుల భర్తీపై గవర్నరే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. దీంతో ఆయనకు కీలక ప్రతిపాదనలు పంపాలని సిటీ పోలీసులు నిర్ణయించారు.



    ఇందులో సిటీ పోలీసుల రిక్రూట్‌మెంట్ కోసం ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టడానికి అనుమతించడంతో పాటు నిధుల్ని మంజూరు చేయాల్సిందిగా కోరాలని భావిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో ప్రస్తుతం కోడ్ అమలులో ఉండటంతో.. ఈ ఘట్టం పూర్తయిన తరవాత గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top