నేడు మల్కాపూర్‌కు సీఎం కేసీఆర్‌

CM KCR To Malkapur - Sakshi

‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం

ముఖ్యమంత్రి రాకకు సర్వం సిద్ధం

సీఎంకు 800 మంది నేత్రదాన అంగీకార పత్రాల బహుమానం

భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీసులు

సాక్షి, మెదక్‌ :  ప్రతిష్టాత్మకమైన ‘కంటి వెలుగు’ పథకం ప్రారంభానికి మెతుకుసీమ వేదిక కానుంది. ప్రజలందరికీ ఉచిత కంటి వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని బుధవారం  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున  ఆయన ఆదర్శ గ్రామమైన మల్కాపూర్‌ రానుండటంపై గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

సీఎం రాకకోసం మల్కాపూర్‌ గ్రామస్తులు, యువకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రికి కానుకగా మల్కాపూర్‌ గ్రామానికి చెందిన 800 మంది నేత్రదానానికి అంగీకరించారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాలను బుధవారం సీఎంతో జరిగే కార్యక్రమంలో అధికారులకు అందజేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

బుధవారం నాటి కార్యక్రమంలో నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు  పాల్గొనున్నారు. సీఎం పర్యటకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందనదీప్తి పర్యవేక్షించారు.  ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం పర్యటనకు పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది.  

సీఎం కార్యక్రమం ఇలా!

ముఖ్యమంత్రి బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మల్కాపూర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా గ్రామంలోని రాక్‌ గార్డెన్‌ చేరుకుని అక్కడ హరితహారంలో భాగంగా మొక్కను నాటుతారు. అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాలను సందర్శించి అక్కడ అమలువుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుంటారు. ఆ తర్వాత గ్రామంలోని దుర్గమ్మ ఆలయం చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అక్కడి నుంచి నేరుగా కంటి వెలుగు శిబిరం వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి  పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కంటివైద్య నిపుణులు కంటి పరీక్షలు చేస్తారు. అనంతరం 972 మంది గ్రామస్తులతో ముఖాముఖి సమావేశమై మాట్లాడతారు.

ముఖాముఖికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ముఖాముఖి అనంతరం సీఎం కేసీఆర్‌ గ్రామస్తులనుద్ధేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా మల్కాపూర్‌ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ వరాలు కురిపించనున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ సాయంత్రం 4 గంటలకు తిరిగి  హైదరాబాద్‌ వెళ్తారు. 

20 వైద్య బృందాల ఏర్పాటు

సీఎం చేతుల మీదుగా జిల్లాలో పథకం ప్రారం భం కానుండటంతో అధికారులు జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు.  జిల్లాలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు 20 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. వైద్య బృందంలో కంటి వైద్యుడు, ఏఎన్‌ఎం, సూపర్‌వైజర్, ఆశవర్కర్లు ఉంటారు.

జిల్లాలో 19 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఆయా పీహెచ్‌సీల్లో ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేందుకు 19 బృందాలను ఏర్పాటు చేశారు.    జిల్లాలో లక్షల మందికిపైగా కంటి సమస్యల ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అంచనా. కంటివెలుగులో భాగంగా 86 వేల మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేయనున్నారు.

డిటెక్టర్‌ సైరన్‌తో కలకలం

సీఎం హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ కోసం గ్రామం సమీపంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ఈ హెలీప్యాడ్‌ను మధ్యాహ్నం బాంబు స్క్వాడ్‌ మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలో డిటెక్టర్లు బీప్‌.. బీప్‌ అంటూ సైరన్‌ ఇవ్వటం ప్రారంభించాయి. దీంతో సిబ్బందికి, భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టాయి. సౌండ్‌ వచ్చిన ప్రాంతంలో బాంబుస్క్వాడ్‌ అధికారులు తవ్వించగా భూమిలో నుంచి ఇనుపచువ్వలు వెలువడ్డాయి. దీంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top