మేడారానికి రూ. 200 కోట్లు

cm chandrasekhar rao announces Rs 200 crore for medaram jatara - Sakshi

శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తాం: సీఎం కేసీఆర్‌

ఎంత స్థలం అవసరమున్నా సేకరించాలి

సమైక్య రాష్ట్రంలో మేడారం నిర్లక్ష్యానికి గురైంది

జాతరకు జాతీయ హోదాపై ప్రధానితో మాట్లాడతా

ఉత్తరాదిన కుంభమేళా.. దక్షిణాదిన మేడారం

ప్రాజెక్టులు పూర్తి కావాలని సమ్మక్క–సారక్కలకు మొక్కుకున్నట్లు వెల్లడి

కుటుంబసభ్యులతో కలసి వన దేవతలను దర్శించుకున్న ముఖ్యమంత్రి

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: భవిష్యత్‌లో మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామని, ఇందులో భాగంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టేందుకు బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించబోతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మేడారానికి జాతీయ హోదా కల్పించాల్సిన అవసరం ఉందని, దీనిపై తానే స్వయంగా ప్రధాని మోదీతో మాట్లాడతానని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో అనేక అంశాలతో పాటు మేడారం జాతర కూడా నిర్లక్ష్యానికి గురైందని, అందువల్లే ఇక్కడ సరైన సౌకర్యాలు లేవన్నారు. శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మ వన దేవతలను దర్శించుకున్నారు. 

అనంతరం మీడియాతో మాట్లాడారు. కోట్లాది మంది భక్తులు వచ్చే మేడారంలో భక్తులకు కనీస సౌకర్యాలు లేవన్నారు. గతంలో రెండేళ్లకోసారి జాతర జరిగేదని, ప్రస్తుతం ప్రతీరోజు భక్తులు వస్తున్నందున సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈరోజు సమ్మక్క తనను ఇక్కడకు రప్పించుని ఈ మాటలు చెప్పిస్తోందంటూ.. ‘‘మేడారంలో శాశ్వత ప్రతిపాదికన ఏర్పాట్లు చేసేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తాం. ఈ బడ్జెట్‌లోనే ఈ నిధులు మంజూరు చేస్తాం. 

జాతరకు సంబంధించి తగిన ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖకు ఇక్కడ తగినంత స్థలం అందుబాటు లేదు. జాతర ఏర్పాట్ల కోసం కనీసం 200 నుంచి 300 ఎకరాల స్థలం కావాలి. ఎంత ఖర్చయినా ఇక్కడ భూమిని సేకరించాలని అధికారులకు చెబుతాను. జాతర ముగిసిన తర్వాత పదిహేను రోజుల్లో మరోసారి మేడారం వచ్చి అధికారులతో మాట్లాడతా..’’ అని అన్నారు. జంపన్నవాగులో ఎప్పుడూ పరిశుభ్రమైన నీరు ఉండేలా డ్యామ్‌ నిర్మిస్తామని చెప్పారు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే గత జాతరకు రాలేకపోయానని పేర్కొన్నారు. వీర వనితల పోరాటానికి ప్రతీక మేడారం జాతర అని అన్నారు.

జాతీయ హోదా ఇవ్వాల్సిందే
తెలంగాణతోపాటు ఏడు రాష్ట్రాలకు చెందిన భక్తులు మేడారం వస్తున్నారని, నిన్ననే ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ మేడారం జాతరకు వచ్చి వెళ్లారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎంపీలు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన రాలేదన్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చే మేడారం జాతర దక్షిణ భారతదేశానికి కుంభమేళా వంటిందని, ఉత్తరాదిన కుంభమేళాకు చేస్తున్న ఏర్పాట్ల తరహాలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. మేడారానికి జాతీయ హోదా కల్పించే విషయంలో ప్రధాని మోదీతో తానే స్వయంగా మాట్లాడతానని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి
గతంలో ఉద్యమం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం రావాలని సమ్మక్కకు మొక్కుకోగా.. అది తీరిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈసారి తెలంగాణను సుభిక్షం చేసేందుకు తాము నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాలని సమ్మక్కకు మొక్కుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రాజెక్టులకు అడ్డం పడే దుర్మార్గులకు బుద్ధి చెప్పాలని మొక్కుకున్నానని చెప్పారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసిన మంత్రులు, అధికారులను సీఎం అభినందించారు. జాతర నిర్వహణలో పోలీసులు–మీడియా మధ్య సమన్వయ లోపం వల్ల ఇబ్బంది వచ్చిందని, అందుకు చింతిస్తున్నానని అన్నారు.


- వన దేవతలకు సమర్పించేందుకు బంగారం(బెల్లం)తో వస్తున్న సీఎం కేసీఆర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top