పకడ్బందీగా.. ప్రశాంతంగా..

For Clear Election - Sakshi

నిఘా నీడలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు

జిల్లాలో అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

సమస్యాత్మక కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు

అదనపు పోలీసు బలగాల వినియోగం

ప్రతీ కదలిక వీడియోలో చిత్రీకరణ

అసాంఘికశక్తుల కట్టడికి అధికారయంత్రాంగం వ్యూహం 

సిరిసిల్లక్రైం: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార యంత్రాంగం తనకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పూర్తిపారదర్శకంగా, అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ముందుచూపుతో వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు సహా ప్రధాన రహదారుల వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు అదనపు పోలీసు బలగాలను వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

60 సమస్యాత్మకం.. 9 అత్యంత సమస్యాత్మకం..
జిల్లాలో 492 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 60 సమస్యాత్మక, 9 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని పోలీసు, రెవెన్యూ అధికారులు గుర్తించారు. గతంలో జరిగిన అల్లర్లు, వివాదాలను ఆధారంగా చేసుకుని వీటిని విభజించారు. గతంలో నక్సల్స్‌ ప్రభావం ఉన్నగ్రామాలు, ఒకేచోట అధికంగా పోలింగ్‌స్టేషన్లు, ఓటర్ల రద్దీ అధికంగా ఉండే పోలింగ్‌ కేంద్రాలను సైతం సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు సమాచారం. ఆయా కేంద్రాల్లో అదనపు పోలీస్‌ భద్రతను ఏర్పాటు చేస్తారు. జిల్లాలో ఇప్పటికే అవసరమైన పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
నేరాలను నియంత్రించేందుకు సిరిసిల్లతోపాటు వేములవాడలో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే సరిచేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట, జనసమ్మర్థం ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఫుటేజీల్లో స్పష్టత వచ్చేలా పోలీసులు అధికారులు నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం ఆయా మండలాల పోలీసు అధికారులు.. తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేపనిలో ఉన్నారు. ప్రధాన పట్టణాలే కాదు.. ప్రతీ గ్రామంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదేవిషయంపై ఎస్పీ రాహుల్‌హెగ్డే తరచూ సమీక్ష సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేయబోయే సీసీ కెమెరాలు.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు తోడ్పడతాయని అదికారులు భావిస్తున్నారు.

ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు..
జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించారు. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు సమన్వయంతో వీటిని గుర్తించి అక్కడ పూర్తిస్థాయిలో వీడియో చిత్రీకరించేందుకు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన సీసీ కెమెరాలు సమకూర్చేందుకు  కాంట్రాక్టర్లతో చర్చిస్తున్నారు. దీనికితోడు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అడిషనల్‌ డీజీపీ జితేందర్‌ ఇటీవల జిల్లా పోలీస్‌ అధికారులను అదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ యాస్మిన్‌బాషా సీసీ కెమెరాల ఏర్పాటు విషయాన్ని పోలీస్‌ అధికారులతో చర్చించారు. పోలింగ్‌ నాటికి సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top