సాగునీటి ప్రాజెక్టులకు ఎస్కలేషన్ గ్రహణం వీడడంలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినా కాంట్రాక్టర్లు మాత్రం పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు.
నేడు సీఈలు, ఏజెన్సీలతో ప్రభుత్వం సమావేశం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు ఎస్కలేషన్ గ్రహణం వీడడంలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినా కాంట్రాక్టర్లు మాత్రం పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. మరిన్ని పనులకు ఎస్కలేషన్ వర్తింజేయాలని ఒకసారి, ఇన్సూరెన్స్, డిపాజిట్లు విడుదల చేయాలని మరోసారి డిమాండ్లను ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో ఇప్పటికే నత్తనడకన సాగుతున్న రూ.9 వేల కోట్ల పనులు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బుధవారం సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, ఏజెన్సీలతో నీటిపారుదల శాఖ సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి సైతం హాజరుకానున్నారు. ఏజెన్సీలకు డెడ్‌లైన్ పెట్టి ప్రతిపాదనలు తీసుకోవాలని, అప్పటికీ ముందుకు రాని సంస్థలపై ప్రభుత్వ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నీటి పారుదల శాఖ భావిస్తోంది.