చేయూతనిస్తే నిర్మాణానికి ఊతం!

Cheruku Ramachandra Reddy Comments With Sakshi

నిర్మాణరంగానికీ కేంద్రం రాయితీలు ఇవ్వాలి

కరోనా సంక్షోభం నుంచి త్వరలోనే గట్టెక్కుతాం

నిర్మాణరంగంలో యంత్రాల వినియోగంతో మేలు

‘సాక్షి’తో క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు చెరుకు రామచంద్రారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘మునుముందు నిర్మాణ రంగంలో ‘సెమీ మెకనైజ్డ్‌ విధానం’ అనుసరించడం ద్వారా కార్మికుల కొరతను అధిగమించవచ్చు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితి మరో 3 – 4 నెలల్లో సమసిపోతుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కంటే ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పూర్తిపై నిర్మాణ సంస్థలు దృష్టిపెట్టాలి. పారిశ్రామిక రంగం తరహాలో ఈ రంగానికీ ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి కరోనా సంక్షోభంలోనూ మంచి భవిష్యత్తు ఉంది’ అని క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు చెరుకు రామచంద్రారెడ్డి అన్నారు. నిర్మాణరంగం స్థితిగతులపై ‘సాక్షి’తో ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు.

కూలీల కొరత సమస్య కాదు..
కరోనాకు ముందు తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో నిర్మాణ రంగం మార్కెటింగ్‌పరంగా మంచి స్థితిలో ఉంది. లాక్‌డౌన్‌తో ఏర్పడిన అనిశ్చితికి తోడు కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు కొంత ఆలస్యం కావచ్చు. నిర్మాణ రంగంలో యంత్రాల వినియోగం పెంచడం ద్వారా కూలీల కొరత పెద్ద సమస్య కాబోదు. దుబాయ్, అబుదాబి వంటి దేశాల్లో నిర్మాణరంగంలో ‘సెమి మెకనైజ్డ్‌ సిస్టమ్‌’ వినియోగిస్తున్నారు. నిజానికి హైదరాబాద్‌ నిర్మాణ రంగంలోనూ 2013 తర్వాత నుంచి ఈ విధానం క్రమంగా పెరుగుతోంది. అంటే టవర్‌ క్రేన్లు, హీస్ట్, ప్లాస్టరింగ్‌ మెషీన్ల వినియోగం పెరిగింది. కాబట్టి ఈ రంగం కార్మికుల కొరతను తట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే, ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలను రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా వర్తింపచేస్తే మేలు జరుగుతుంది.

ఇలాచేస్తే ఉత్తమం..
ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం కంటే ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడంపైనే దృష్టిపెట్టాలి. సాధారణంగా పెద్ద వెంచర్లు రెండున్నర నుంచి నాలుగైదేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటాయి. ప్రస్తుతం 3–4 నెలల సమయం వృథా కావడం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యే పరిస్థితి లేకపోవడంతో ఫ్లాట్స్‌ లభ్యత తగ్గితే మార్కెట్‌ కూడా స్థిరీకరణ చెందుతుంది. నెలన్నర పాటు పని లేకున్నా కార్మికులకు వేతనాలివ్వడం, ఇతర సౌకర్యాల కల్పనతో నిర్మాణ సంస్థల వద్ద ఉన్న నగదు నిల్వలు ఆవిరైపోయాయి. మరోవైపు కొనుగోలుదారులకు వేతనాల్లో కోత, ఉద్యోగ భద్రత వంటి అంశాలు కొత్త బుకింగ్‌లపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక రంగం తరహాలో నిర్మాణరంగానికి కూడా ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

పెట్టుబడులకు మరింత అవకాశం
హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలకు నిర్మాణరంగం విస్తరిస్తోంది. భూమి లభ్యత తగ్గడంతో డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం, సానుకూల విధానాలతో ఫార్మా, ఐటీ, పారిశ్రామిక రంగాల్లోకి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. మరోవైపు చైనా పై అమెరికా, యూరోప్‌ దేశాలకు ఉన్న అపనమ్మకం కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులకు అనుకూలంగా మారుతుంది. కరోనా మూలంగా అమెరికా ఎదుర్కొన్న సంక్షోభంతో ఔట్‌సోర్సింగ్‌ విధానం మనకు అనుకూలించే అంశం. వివిధ రంగా ల్లో ఉద్యోగాల కల్పన పెరగడం ద్వారా నిర్మాణ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. ఇక, ఈ రం గంలో ధరల విషయానికొస్తే పొరుగునున్న చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలతో పోలిస్తే మన దగ్గర ఫ్లాట్లు, విల్లాలు, ఇళ్ల ధరలు తక్కువే.

సడలింపులిస్తే మంచిది
పురోగతిలో ఉన్న ప్రాజెక్టులకు అదనంగా 20 శాతం రుణాన్ని తక్షణమే అందుబాటులోకి వచ్చేలా చూడాలి. రుణాలు, కిస్తీలపై మారటోరియంను విడతలు గా కాకుండా ఒకేసారి ఏడాది పాటు పొడిగిస్తే ప్ర యోజనం. నిరర్ధక ఆస్తుల నిబంధనలను సడలించి రుణాలు పొందేందుకు మార్గం సుగమం చేయాలి. బ్యాంకు రుణాల చెల్లింపు వాయిదా గడువు పెంపు, ఆస్తిపన్ను, విద్యుత్‌ బిల్లులు, జీఎస్టీలో సడలింపులిస్తే కొనుగోలుదారులు ముందుకొస్తారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలను కూడా ప్రస్తుతమున్న ఆరు శాతం నుంచి తొలి మాసంలో రెండు శాతం, తర్వాతి నెలకు మూడు నుంచి మూడున్నర శాతం మేర తగ్గిస్తే కొనుగోలుదారులకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా జరిగే లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో 30 శాతానికిపైగా ఆదాయం సమకూరుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top