18వ శతాబ్దంలోనే గొలుసుకట్టు చెరువులు

Chain Ponds In The 18th Century In The Period Of Wanaparthi Province - Sakshi

సంస్థానాధీశుల హయాంలో సప్తసముద్రాల పేరిట చెరువుల నిర్మాణం 

కాలానుగుణంగా రిజర్వాయర్లుగా మారిన వైనం 

పచ్చని పంట పొలాలతో విరాజిల్లిన వనపర్తి సంస్థానం 

నేటికీ వ్యవసాయ ఆధారిత జిల్లాగానే ప్రసిద్ధి 

అంతర్జాతీయ మార్కెట్‌లో ఇక్కడి వేరుశనగకు ప్రత్యేక గుర్తింపు

సాక్షి, వనపర్తి(మహబూబ్‌నగర్‌) : సంస్థానాల కాలం నుంచే.. వనపర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. వనపర్తి సంస్థానాన్ని సుమారు నాలుగు వందల ఏళ్లు పాలించిన రెడ్డిరాజులు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ప్రస్తుత పెబ్బేరు మండలంలోని సూగూరు కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేసుకుని రాయలసీమకు చెందిన వీరకృష్ణారెడ్డి క్రీ.శ.1510లో పరిపాలన ప్రారంభించినట్లు చరిత్రకాలు వెల్లడిస్తున్నారు. కాలానుగుణంగా శ్రీరంగాపురం, వనపర్తి ప్రాంతాలకు రాజధానిని మార్చి పాలన చేశారు. మొదటి రాజారామేశ్వర్‌రావు తదనంతరం 18వ శతాబ్దంలో ఎక్కువ కాలం రాణిశంకరమ్మ వనపర్తి రాజధానిగా సంస్థానాన్ని పరిపాలించారు. సంస్థానానికి వచ్చిన ఆదాయంలో సగభాగం నిజాం ప్రభుత్వానికి కప్పం కడుతూ.. రాజ్యపాలన చేసేవారు. రాణి శంకరమ్మ అదే పద్ధతిని అనుసరించి పాలన చేశారు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో ఉన్న రాజమహల్, రాణిమహల్‌ భవనాలు రాణి శంకరమ్మ హయాంలో నిర్మాణం చేసినవిగా ప్రచారంలో ఉంది. 

రాణిశంకరమ్మ హయాంలో బీజం
వనపర్తి సంస్థానాన్ని ఎక్కువకాలం పాలించిన రాణిగా శంకరమ్మకు చరిత్రలో పదిలమైన స్థానం ఉంది. 18వ శతాబ్దంలో రాణి శంకరమ్మ రాజ్యంలో కరువుఛాయలు కనిపించకుండా.. కురిసిన ప్రతి వర్షం చుక్కను ఒడిసి పట్టి నిల్వ చేసేందుకు ప్రణాళిక రచించారు. పురాణాల్లో ఉన్న సప్తసముద్రాల మాదిరిగా.. తన సంస్థానంలో ఏడు పెద్ద చెరువులను నిర్మించి వాటికి సప్త సముద్రాలుగా ఏడు వేర్వేరు పేర్లను పెట్టి భవిష్యత్‌ తరాలకు తరగని సంపదగా ఇవ్వాలని బృహత్తరమైన కార్యానికి పూనుకుని తన హయాంలోనే.. నాటి వనపర్తి సంస్థానంలో రెండు తాలుకాలు కొత్తకోట, పెబ్బేరుల పరిధిలో ఏడు చెరువులను నిర్మించారు. ఈ చెరువులకు వర్షం నాటి పాటుతో పాటు ఆయా ప్రాంతాల్లోని చెరువులు అలుగు బారినప్పుడు సప్త సముద్రాల్లోకి చేరేలా.. గొలుసుకట్టు విధానానికి రూపకల్పన చేశారు. సుమారు రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఏడు చెరువులు (సప్త సముద్రాలు) జిల్లా ప్రజలకు ఇప్పటికీ కల్పతరువులుగానే.. ఉపయోగపడుతున్నాయి.

ఇక్కడే గొలుసుకట్టు చెరువులు 
వనపర్తి సంస్థానాధీశుల కాలంలోనే సప్త సముద్రాల పేరిట చెరువుల నిర్మాణంతోపాటు అన్ని చెరువులు, కుంటలకు వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని వ్యవసాయానికి ఉపయోగించే విధంగా అన్ని చెరువులకు గుట్టల ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాల నుంచి వర్షం వరద నీరు చెరువుల్లోకి చేరేలా పాటు కాల్వల నిర్మాణం చేశారు. చెరువులు నిండిన తర్వాత అలుగు పారే నీటిని మరో చెరువులోకి వెళ్లేలా వాగులను నిర్మించారు. చెరువులన్నీ నిండిన తర్వాత చివరగా సప్త సముద్రాల చెరువుల్లోకి వర్షం నీరు చేలా పాటు కాల్వలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో అప్పట్లో వ్యవసాయం పండగలా విరాజిల్లినట్లు ప్రచారంలో ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి 
జిల్లాలో పండించే వేరుశనగ పంటల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు నుంచి చెన్నై, కోల్‌కత్తా, ముంబయి ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి పల్లిని కొనుగోలు చేసి అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నారు. పల్లి ధరల విషయానికి వస్తే.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ల కంటే వనపర్తిలో మార్కెట్‌లో ఏటా వేరుశనగ పంట ఉత్పత్తులకు ఎక్కువ ధరలు పలుకుతాయి. ఎక్కువగా జిల్లా రైతులు వేరుశనగను యాసంగి పంటగా సాగు చేస్తారు. వేరుశనగ పంట ఉత్పత్తులు వచ్చే సమయంలో జిల్లాకేంద్రంలోని మార్కెట్‌ పల్లి రాశులతో కళకళలాడుతుంది. కాలు మోపెందుకు స్థలం లేనంతగా వేరుశనగ రాశులతో నిండిపోతోంది.  

2 లక్షల ఎకరాల్లో సాగు.. 
సంస్థానాధీశుల కాలం నుంచే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు సంతరించుకున్నది వనపర్తి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడి పాలకుల కృషి ఫలితంగా కొత్త రిజర్వాయర్లు, ప్రాజెక్టుల నిర్మాణం, పంట కాల్వల నిర్మాణాలను చేపట్టడంతో ప్రస్తుతం జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో మెట్ట, తరి పొలాల్లో సుమారు 2 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వరిసాగు చేస్తారు. ప్రతి ఖరీఫ్‌లో సుమారు 70 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తూ రాష్ట్రంలోనే.. అత్యధికంగా వరిధాన్యం పండిస్తూ రికార్డు స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు లక్ష్యంకు మించి ధాన్యం విక్రయిస్తున్నారు.

మా తాతముత్తాల నుంచే.. 
సప్తసముద్రాల్లో ఒకటైన శంకరసముద్రం మా గ్రామ సమీపంలో ఉండటం సంతోషంగా ఉంది. మా తాత, ముత్తాల కాలం నుంచి ఈ శంకరసముద్రం కింద మేం వ్యవసాయం చేస్తున్నాం. వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం ఈ చెరువు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డి 2007లో పనులు ప్రారంభించారు. శంకరసముద్రంలో మా గ్రామం ముంపునకు గురైంది. ఏళ్లు గడుస్తున్న నేటికీ పనులు పూర్తి కాకపోవడంతో గ్రామస్తులందరం నిరాశతో ఉన్నాం. 
– బాలయ్య, రైతు, కానాయపల్లి 
 
సాగు, తాగునీరు అందిస్తోంది 
పెబ్బేరు శివారులో ఉన్న మహాభూపాల్‌ చెరువును రాజుల కాలంలో నిర్మించారు. ప్రతి సంవత్సరం ఈ చెరువు వర్షాలతోనే నిండదంలో పశువులకు, గ్రామ ప్రజలకు తాగునీరు, అవసరాలకు వాడుకోవడంతోపాటు చెరువు కింద రైతులు 2 వేల ఎకరాల్లో వరిసాగు చేసి నీళ్లను వాడుకుంటున్నారు. ఆ రోజుల్లో చెరువు చూడాల్సిన వారు రైతు కమిటీ సభ్యులను నీరేంటులుగా నియమించడంతో నీటి వృథా చేయకుండా వాడుకునేవారు. ప్రస్తుతం జూరాల కాల్వ చెరువు పక్కల ఆనుకొని పోవడంతో పుష్కలంగా నీళ్లు వచ్చాయి. దీంతో చెరువులను చూసుకునే దిక్కులేకుండా పోయింది. 
– బాల్‌రాం, రైతు, పెబ్బేరు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top