వర్క్‌ ఫ్రం హోంకే జై!

Cerestra company Estimated Work From Home Extend One Year - Sakshi

బహుళ జాతి, చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలదీ ఇదే దారి

సరళమైన పనివేళలతో ఉద్యోగుల్లోనూ సంతృప్తి

ఆఫీస్‌ లీజ్‌ను 10–20 శాతం కుదించుకుంటున్న పలు కంపెనీలు

మరో ఏడాది పాటు ఇదే ట్రెండ్‌ కొనసాగుతుందని సెరెస్ట్రా సంస్థ అంచనా

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ ఎఫెక్ట్‌తో వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానాన్ని అనుసరిస్తున్న పలు ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీలు ఇప్పుడు ఇదే విధానాన్ని మరో ఏడాదిపాటు కొనసాగించాలని భావిస్తున్నాయి. ఈ విధానంపై అటు సంస్థలు..ఇటు ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని పలు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. నయా పని విధానాలతో ఒకవైపు ఉద్యోగులకు సరళమైన పనివేళలు లభించడమే కాకుండా రాకపోకల జంఝాటం తప్పింది. మరోవైపు ఇప్పటికే నగరంలో కార్యకలాపాలు సాగిస్తున్న వెయ్యికి పైగా బహుళజాతి, మధ్య తరహా, చిన్న ఐటీ కంపెనీలు సైతం తమ కార్యాలయాల విస్తరణ ప్రణాళికలకు అవసరమైన ఆఫీస్‌ స్పేస్‌ లీజును కుదించుకుంటున్నట్లు తెలుస్తోంది. నగరంలో పలు కంపెనీలు ఇప్పుడు సుమారు పది నుంచి 20 శాతం లీజు స్పేస్‌ భారాన్ని తగ్గించుకుంటుండడం గమనార్హం. మరోవైపు అధిక అద్దెల నుంచి కంపెనీలకు సైతం విముక్తి లభిస్తుండడం విశేషం. ఈ విశేషాలను తాజాగా సెరెస్ట్రా ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ పలు ఐటీ, బీపీఓ, కెపిఓ కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వెల్లడించింది.

లీజుల భారం తగ్గించుకుంటున్నారిలా..
ఐటీకి కేంద్ర బిందువుగా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో వెయ్యికి పైగా ఉన్న ఐటీ,  బీపీఓ కంపెనీల నుంచి ఏటా రూ.లక్ష కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయి. గతేడాది(2019)లో సుమారు పది లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ కావాలని పలు బహుళజాతి, చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలు నగరానికి వెల్లువలా తరలివచ్చా యి. మరో ఏడాదిపాటు ఈ డిమాండ్‌ ఐదు లక్షల చదరపు అడుగులకు తగ్గే అవకాశాలున్నట్లు సెరెస్ట్రా సంస్థ అంచనా వేస్తోంది. మరోవైపు ఇప్పటికే నగరంలో కొనసాగుతున్న సుమారు 250కి పైగా చిన్న, మధ్య తరహా కంపెనీలు ఇప్పటికే తమ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్న ప్రాంగణాల్లో కార్యాలయాలను కుదించుకునే క్రమంలో భాగంగా లీజు స్థలాన్ని తగ్గించుకుంటున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. 

ఉద్యోగుల్లోనూ సంతృప్తి..
వృత్తి, ఉద్యోగాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాల్లోని ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం కల్చర్‌ను బాగా ఇష్టపడుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. మహానగరం పరిధిలో సుమారు 6 లక్షల మందికి పైగా ఈ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం కోవిడ్‌ కలకలం కారణంగా సుమారు 75 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. గతంలో గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా, మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలకు లక్షలాది మంది ఉద్యోగులు నగర శివార్ల నుంచి సుమారు 20–25 కి.మీ దూరం నుంచి చేరుకునేవారు. వారి వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించి కార్యాలయానికి చేరుకునేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో సుమారు 3–4 గంటల సమయం ప్రయాణానికే సరిపోయేది. భారీ వర్షం కురిసినపుడు..ట్రాఫిక్‌ జాంఝాటంలో చిక్కుకుంటే దీనికి రెట్టింపు సమయం పట్టేది..ప్రయాణ అవస్థలు, ట్రాఫిక్‌ చిక్కుల కారణంగా పలు శారీరక, మానసిక, ఉద్యోగ పరమైన సమస్యలను ఎదుర్కొనేవారు. ఈ అవస్థలకు తాజా పని విధానంతో చెక్‌ పడిందని ఈ అధ్యయనం విశ్లేషించింది. మరోవైపు బస్సులు, మెట్రో రైలు సర్వీసులు నిలిచిపోవడంతో వర్క్‌ఫ్రం హోంకే ఇటు కంపెనీలు, అటు ఉద్యోగులు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని తెలిపింది.

ఉత్పాదకతలో మార్పు లేదు..
వర్క్‌ ఫ్రం హోం కారణంగా ఆయా కంపెనీల్లో ఉద్యోగుల పనితీరు, ఉత్పాదక, గడువులోగా నిర్ణీత ప్రాజెక్టు వర్క్‌లను పూర్తిచేయడం వంటి విషయాల్లో ఎలాంటి తేడాలు లేవని హైసియా అధ్యక్షులు భరణి అభిప్రాయపడ్డారు. సరళమైన పనివేళలు, ప్రయాణ అవస్థలు తప్పడంతో ఉద్యోగులు సంతృప్తిగా పనిచేస్తున్నారన్నారు. అవసరాన్ని బట్టి పలు అత్యవసర సమావేశాలు, ప్రాజెక్టు వర్క్‌లకు సంబంధించిన చర్చలకు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నామన్నారు. ఐటీ కారిడార్‌లో కోవిడ్‌ నిబంధనలు, పోలీసుల అనుమతితోనే కార్యకలాపాలు సాగిస్తున్నామని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top