ఓటర్ల జాబితాను సరిదిద్దండి!

CEC OP Rawat Guidelines To Telangana Election Officers - Sakshi

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం  

నామినేషన్ల ప్రక్రియ నాటికి సవరించాలని సూచన 

తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశం 

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సుదీర్ఘంగా ఈసీ బృందం సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: తప్పులతడకగా మారిన ఓటర్ల జాబితాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. నామినేషన్ల ప్రక్రియ ముగింపునకు 10 రోజుల ముందునాటికి తప్పులను సరిదిద్దాలని అధికారులకు సూచించింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలన కోసం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్‌ నేతృత్వంలోని బృందం రెండోరోజు మంగళవారం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడి ఓ హోటల్‌లో 31 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించింది. ఎన్నికల ఏర్పాట్ల తీరుపై స్థూలంగా సంతృప్తి వ్యక్తం చేసింది. వికలాంగ, వయో వృద్ధ, మారుమూల ప్రాంతాల, మురికివాడల ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఎన్నికల ఏర్పాట్లపై నిరంతరం సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, రోజూ పర్యవేక్షించాలని పేర్కొంది. లెక్కలు లేని నగదు జప్తుపై దృష్టి సారించాలని, నిష్పక్షపాతంగా ఎన్నికల కోడ్‌ అమలు చేయాలని కోరింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులని, ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే బాధ్యత వారిదేనని స్పష్టం చేసింది. సమీక్షలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు సునీల్‌ అరోరా, అశోక్‌ లావస, బృందంలోని ఇతర అధికారులు ఉమేష్‌ సిన్హా, సందీప్‌ సక్సేనా, సందీప్‌ జైన్, చంద్రభూషణ్‌కుమార్, దిలీప్‌శర్మ, ధీరేంద్ర ఓజా, సుందర్‌ భయిల్‌ శర్మ, ఎస్‌కె రుడోలాతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ పాల్గొన్నారు. 

జిల్లాలవారీగా పరిశీలన  
కేంద్ర ఎన్నికల బృందం జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలతో ఏర్పాట్లను సమీక్షించింది. ప్రధానంగా ఓటర్ల నమోదులో వచ్చిన సాంకేతిక లోపాలు, ఈఆర్వో నెట్‌ వెబ్‌సైట్‌ మొరాయించడం, కొత్తగా ఏర్పాటు చేసిన మొబైల్‌ యాప్‌లు పని చేయకపోవడం, సరైన సమన్వయం లేకపోవడంపై జిల్లాల అధికారులు కేంద్ర ఈసీ బృందానికి నివేదించినట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సీఈవో రజత్‌కుమార్‌పై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తొలిసారిగా వినియోగిస్తున్న వీవీ ప్యాట్లపై అవగాహన సదస్సులు పూర్తి చేశారా? అన్ని జిల్లాలకు సరిపడ సంఖ్యలో వీవీ ప్యాట్లు వచ్చాయా? వాటికి ప్రాథమిక స్థాయి పరీక్షలు పూర్తి చేశారా ? వాటిని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారా ? అనే విషయాలను కేంద్ర బృందం ఆరా తీసింది. ఏర్పాట్లను సమీక్షించేందుకు మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తామని తెలిపింది.

సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తం 
సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్‌ స్టేషన్లలో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల సంఘం బృందం సూచించింది. ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఈ ప్రాంతాలలో పోలీస్‌ బలగాలను మోహరించి ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండాముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. డబ్బు, మద్యం సరఫరాలపై నిఘా పెట్టి నిరోధించాలని ఆదేశించింది. చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని, ఎయిర్‌పోర్టు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్ల వద్ద, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై కూడా నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల పనులను వేగవంతం చేయాలని ఆదేశించింది. డిసెంబర్‌ 7 న జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే పనిలోఅధికారులు నిమగ్నమై ఉండాలని సూచించింది.

అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలు దాటొద్దు
అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలకు మించరాదని, ప్రచారంలో అభ్యర్థి తరపున చేసే ప్రతీ ఖర్చుకు లెక్కలు అప్పగించాలని కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఆదేశించింది. అభ్యర్థుల ఖర్చుల లెక్కలు రోజువారీగా సమర్పించాలని, మీడియాలో ఇచ్చే ప్రకటనలపై కూడా నిఘా ఏర్పాటు చేసి దానిపై కూడా లెక్కలు వేయాలని సూచించింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి మీడియా టారిఫ్‌లను తెప్పించుకుని, వాటిని సరిపోల్చి లెక్కలను పకడ్బందీగా చూడాలని కోరింది. రాజకీయ పార్టీల ఎన్నికలు మేనిఫెస్టోను కూడా నిశితంగా పరిశీలించాలని సూచించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top