కంటోన్మెంట్‌ బోర్డు త్వరలో రద్దు!

Cantonment boards will be canceled - Sakshi

ప్రత్యేక మిలటరీ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం

జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్న కంటోన్మెంట్‌

సెక్రటేరియట్‌ ఏర్పాటుకు సులువైన మార్గం

ఎంపీ అసదుద్దీన్‌కు స్పష్టం చేసిన కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: త్వరలోనే కంటోన్మెంట్‌ బోర్డులు రద్దు కానున్నాయి. దేశవ్యాప్తంగా మిలటరీ స్టేషన్లలో అంతర్భాగంగా కొనసాగుతున్న జననివాస ప్రాంతాలను తప్పించనున్నారు. అనంతరం ఆయా కంటోన్మెంట్లు ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా కొనసాగనున్నాయి. సంబంధిత ప్రక్రియపై అధ్యయనం చేసేందుకు గతేడాది ఆగస్టులోనే నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రక్షణ శాఖ సహాయమంత్రి డాక్టర్‌ సుభాష్‌ బమ్రే స్పష్టం చేశారు. కంటోన్మెంట్లను ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా మార్చనున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 62 కంటోన్మెంట్ల పరిధిలో 1,86,730.39 ఎకరాల భూమి ఉన్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ల పనితీరుపై అధ్యయనం కోసం 2018 ఆగస్టు 31న ఏర్పాటైన నిపుణుల కమిటీ ప్రత్యేక నివేదికను సమర్పించనుందని తెలిపారు. 

జీహెచ్‌ఎంసీలో కలిసే అవకాశం
కంటోన్మెంట్లను ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా మారిస్తే ప్రస్తుతం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో కొనసాగుతున్న జన నివాస ప్రాంతాలు జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యే అవకాశముంది. 9,926 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో ఆరు వేల ఎకరాలు పూర్తిగా మిలటరీ అధీనంలో ఉన్నాయి. 5 వందల ఎకరాలు విమానయాన, రైల్వే మంత్రిత్వ శాఖల అధీనంలో ఉన్నాయి. డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ యాజమాన్య పరిధిలోని మరో 450 ఎకరాలు గ్రాంటుల రూపంలో (ఓల్డ్‌ గ్రాంట్‌ బంగళాలు) ఉన్నాయి. మిగిలిన 3,500 ఎకరాల్లో 700 ఎకరాలు (బైసన్‌ పోలో, జింఖానా సహా) కంటోన్మెంట్‌ బోర్డు యాజమాన్య పరిధిలో ఉన్నాయి. మిగిలిన 2,800 ఎకరాల్లోనే సాధారణ పౌరులకు సంబంధించిన 350 కాలనీలు, బస్తీలు ఉన్నాయి. 

సెక్రటేరియట్‌కు మార్గం సుగమం!
కంటోన్మెంట్‌ బోర్డులను ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా మారిస్తే బైసన్‌ పోలో, జింఖానా సహా ప్రతిపాదిత స్కైవేల నిర్మాణానికి అవసర మయ్యే భూబదలాయింపు ప్రక్రియ ప్రభుత్వానికి మరింత సర ళతరం కానుంది. ప్రస్తుతం భూబదలాయింపునకు ప్రధాన అడ్డంకిగా ఉన్న సర్వీసు చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించే 156 ఎకరాల్లో సుమారు 120 ఎకరాలు కంటోన్మెంట్‌ బోర్డుకు సంబంధిం చినవే. ఈ స్థలాలను అప్పగించడం వల్ల కోల్పోయే ఆదాయానికి బదులుగా కంటోన్మెంట్‌ బోర్డు సర్వీసు చార్జీలు చెల్లించాలని ప్రతిపాదించింది. కంటోన్మెం ట్‌ బోర్డు పరిధిలోని ప్రాంతాలు జీహెచ్‌ఎంసీలో కలిస్తే కేవలం 30 ఎకరాల మిలటరీ స్థలం మాత్రమే బదలాయింపు పరిధిలోకి వస్తుం ది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సర్వీసు చార్జీలు చెల్లించకుండానే బైసన్‌పోలో, జింఖా నా మైదానాలు సహా, ప్యాట్నీ– హకీంపేట, ప్యారడైజ్‌– సుచిత్ర మార్గాల్లోని స్కైవేలకు భూములను సేకరించే వెసులుబాటు కలుగుతుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top