‘బోధన్‌ స్కాం’ దర్యాప్తు ముగిసినట్లే!

     లబ్ధిపొందిన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఊరట

     దర్యాప్తు ముగించి చార్జిషీట్‌ దాఖలుకు సీఐడీ నిర్ణయం!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సర్కారు ఖజానాకు రూ.300 కోట్లు గండి కొట్టిన బోధన్‌ స్కాంలో సీఐడీ దర్యాప్తు ముగిసినట్లేనని తెలుస్తోంది. ఈ స్కాంలో ప్రధాన సూత్రధారి శివరాజు, అతడి కుమారుడితో పాటు 9 మంది కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులను సీఐడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కాం రెండో దశ దర్యాప్తులో భాగంగా మరో 16 మంది కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులతో పాటు 250 మందికి పైగా ఉన్న లబ్ధిదారులను విచారిం చాలని భావించింది. కానీ కొద్ది రోజులుగా బోధన్‌ స్కాంలో ఎలాంటి పురోగతి కనిపించక పోవడంతో దర్యాప్తు అధికారులు చార్జిషీట్‌ దాఖలుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 

డీలర్లు, డిస్టిబ్యూటర్లకు ఊరటేనా?
ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన చలాన్ల సొమ్మును శివరాజు తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఒకే చలాన్‌పై ఇద్దరు, ముగ్గురు వ్యాపారుల పన్ను చెల్లించినట్లు చూపించి నకిలీ చలాన్ల నంబర్లతో కమర్షియల్‌ ట్యాక్స్‌ వెబ్‌సైట్‌లో లెక్కలు సృష్టించడంతో రూ.300 కోట్ల మేర వాణిజ్య పన్నుల శాఖకు నష్టం వాటిల్లినట్లు సీఐడీ గుర్తించింది. అయితే స్కాంలో పాలుపంచుకున్న నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్‌ తదితర ప్రాంతాల్లోని వ్యాపారులను విచారించాలని సీఐడీ తొలుత భావించినా అది సాధ్యపడలేదని సమాచారం.

2010 నుంచి 2016 వరకు జరిగిన ఈ కుంభకోణంలో డిప్యూటీ కమిషనర్లతో పాటు ఆపై స్థాయి అధికారులు కూడా పాత్రధారులేనని, వారిని కూడా విచారించాలని వాణిజ్య పన్నుల శాఖకు లేఖ రాసినా ఆ విభాగం పట్టించుకోలేదు. స్కాంతో సంబంధం ఉన్న అధికారుల వివరాలు, వారు నిజామాబాద్‌లో పనిచేసిన వివరాలు కావాలని సీఐడీ కోరినా పట్టించుకోలేదు. ఇక చేసేదేమీ లేక సీఐడీ అధి కారులు చార్జిషీట్‌ దాఖలు చేసే పనిలో పడ్డట్లు తెలు స్తోంది. దీంతో అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఇటు అధికారు లకు ఊరట లభించినట్లేనన్న వాదన వినిపిస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top