కేసీఆర్‌ అహంభావంతో మాట్లాడుతున్నారు: లక్ష్మణ్‌ 

BJP state president K Lakshman criticized CM KCR with ego - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రినన్న విషయాన్ని మరిచిపోయి అమర్యాద, అహంభావంతో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. తెలుగు వారి మర్యాద, ప్రతిష్టను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం కేసీఆర్‌లు దిగజారుస్తున్నారన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు వీరిద్దరూ చంద్రగ్రహణంలా మారారని దుయ్యబట్టారు. బీజేపీ కార్యాలయంలో ఆదివారం లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని సీఏం కేసీఆర్‌ పదేపదే మాట్లాడుతున్నారని, కానీ టీఆర్‌ఎస్‌ మంత్రులు కూడా నలుగురు ఓడిపోయారని, కొన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, తాము గెలిచినా ఓడినా ప్రజల పక్షమేనన్నారు. దళితుడిని సీఎం చేస్తానని దగా చేసిన కేసీఆర్‌ ఇపుడు బీసీలను కూడా మోసం చేస్తున్నారన్నారు. బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా ఐదేళ్లలో బీసీ జనాభా గణన ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. బీసీ ప్రధానిగా బీసీ జాతీయ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించింది మోదీనేనన్నారు. రాజకీయంగా బీసీలను అణగదొక్కేలా కేసీఆర్‌ చర్యలు ఉన్నాయని, 34% బీసీ రిజర్వేషన్లు వచ్చే వరకు ఇతర బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top