
ఆర్థిక పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ వ్యాఖ్యల్లో వాస్తవమున్నప్పటికీ ఆయన కూడా తన రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాటే పట్టారేమో అనిపిస్తుంది. ఎన్నికల ముందు ఆకాశం మీ చేతుల్లోకి తెచ్చేస్తానన్న రీతిలో హామీలివ్వడం.. తీరా అధికారం చేపట్టిన తరువాత ఖజానా చూస్తే హామీల అమలుపై భయమేస్తోందని సన్నాయి నొక్కులు నొక్కడంలో చంద్రబాబు ఆరితేరిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేవంత్ కూడా అదే మాదిరిగా.. అప్పులు కూడా పుట్టడం లేదని చెబుతున్నట్లు అనిపిస్తోంది.
నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇంత బహిరంగంగా మాట్లాడడం సరికాకపోవచ్చు. వాస్తవాలు చెబుతున్న కారణంగా అంతా సర్దుకు పోతారని ఆయన భావన కావచ్చు. కాని దీనివల్ల రాష్ట్రం పరపతి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు అప్పులు నిజంగానే పుట్టడం లేదా అంటే ఆంధ్రప్రదేశ్‌లో పదకుండు నెలల్లోనే రూ.1.5లక్షల కోట్ల అప్పు చేస్తే, తెలంగాణలో రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేశారు. అదనంగా అప్పులకు వెళితే ఇస్తున్నట్లు లేరు. దేనికైనా పరిమితులు ఉంటాయి. తోచినట్లు వాగ్దానాలు చేసి,అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అప్పులు పుట్టడం లేదని, బ్యాంకులు తమను దొంగల్లా చూస్తున్నాయని అంటే ప్రజలు ఏమని అనుకుంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులకు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని, తీరు చూస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతారేమో అన్నట్లుగా పరిస్థితి దేశం ముందట ఉందని రేవంత్ అన్నారు.
ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. దీనికంతటికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని రేవంత్ చెప్పవచ్చు. కాని అది పరిష్కారం కాదు. సరైన జవాబు కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే రాష్ట్ర అప్పులపై రేవంత్ కాని, ఇతర కాంగ్రెస్ నేతలు కాని అనేక విమర్శలు చేశారు. అయినా అధికారం రాబట్టుకోవడం కోసం ఎన్ని అసాధ్యమైన హామీలు ఇచ్చారో గుర్తులేదా? ఆరు గ్యారంటీలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియకుండానే వాగ్దానం చేశారా? అలా చేస్తే అది బాధ్యతారాహిత్యం కాదా? అదేమంటే రేవంత్ ఇచ్చిన సమాధానం చూడండి. ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మూడు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి ఇదెంత సంసారం. చక్కదిద్దవచ్చని అనుకున్నానని ఆయన చెప్పారు. తీరా చూస్తే మూడు లక్షల కోట్ల ఆదాయం లేదు.. రెండు లక్షల కోట్లే ఆదాయం, అప్పు ఎనిమిది లక్షల కోట్లు ఉంది అని ఆయన వివరిస్తున్నారు.
సరిగ్గా చంద్రబాబు కూడా ఏపీలో ఇలాగే మాట్లాడారు. తనకు ఎన్నికల ముందు అన్నీ ఇవ్వవచ్చని అనుకున్నానని, కాని లోపలికి వెళ్లి చూస్తే ఏమీ లేదని, ఖజానా ఖాళీగా కనబడస్తా ఉందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేసిన చంద్రబాబు తీరా బడ్జెట్‌లో రూ. ఆరున్నర లక్షల కోట్లే ఉందని అంగీకరించారు. అయినా హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టడానికి ఈ కబుర్లు చెబుతున్నారన్న సంగతి ఏపీ ప్రజలకు అర్థమైంది. అదే ధోరణిలో రేవంత్ కూడా ఎన్నికలకు ముందు వంద రోజులలో అన్ని హామీలు చేసి చూపిస్తామని, రైతులకు రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఎవరైనా అప్పు చేయకపోతే బ్యాంకులకు వెళ్లి అప్పు తీసుకోండని చెప్పారా? లేదా? అది బాధ్యతారాహిత్యం కాదా? ఇప్పుడేమో తాను 18 గంటలు కష్టపడుతున్నానని, ఒక్క రోజైనా, ఒక్క గంట సెలవైనా తీసుకోలేదని సానుభూతి కోసం మాట్లాడుతున్నారు. నిజానికి ఏ సీఎం అయినా 18 గంటలు పనిచేస్తున్నానని చెబితే ఆ ప్రభుత్వం పద్దతిగా లేదని అర్థం.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. మిగిలినవారిని పని చేయనివ్వకుండా తానే పని చేస్తున్నానని చెప్పుకోవడానికి ఇలాంటి మాటలు పనికి వస్తాయి తప్ప జనానికి ఏమి ఉపయోగం? ఇది కూడా చంద్రబాబు తరహా మాటే.ఆయన కూడా తాను ఎంతలా కష్టపడుతున్నది పదే, పదే జనానికి చెబుతుంటారు. రేవంత్ కొత్తగా సీఎం అయి ఉండవచ్చు.ఆయన కొన్ని వాగ్దానాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయకపోలేదు. అయినా అన్నిటిని అమలు చేయడం కష్టం కనుక ఈ కొత్తరాగం ఎత్తుకున్నారు. అప్పులు, వాయిదాలకే రూ.7500 కోట్లు అవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటివారు రేవంత్‌కు మద్దతుగా మాట్లాడుతున్నా, అవి అంత కన్విన్సింగా కనిపించవు. ఏ ప్రభుత్వం ఉన్నా, రుణాలు చెల్లించవలసిందే కదా! ఒక్కసారి గతానికి వెళితే చంద్రబాబు నాయడు 1996 లోక్ సభ ఎన్నికలకు ముందు టీడీపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలిస్తేనే కిలో రెండు రూపాయల బియ్యం, మద్య నిషేధం, మొదలైనవి కొనసాగుతాయని ప్రచారం చేశారు.
ఎన్నికలు అయ్యాక మాత్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, మార్పులు చేయాలని, బియ్యం రేట్లు పెంచాలని, మద్య నిషేధం ఎత్తివేయాలంటూ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు సాగించారు. ప్రతి ఎన్నికకు ముందు ఇదే తతంగం ఆయన సాగిస్తుంటారు. 2014లో రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని, బ్యాంకులలో తనఖాలో ఉన్న రైతుల భార్యల బంగారం కూడా విడిపిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఏదో అరకొర చేసి చేతులెత్తేశారు. 2024లో కూడా సూపర్ సిక్స్ అంటూ మరోసారి జనాన్ని మభ్య పెట్టడానికి వెనుకాడలేదు. ఈ రకంగా గురు, శిష్యులైన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకే బాటలో పయనించడం విశేషం.
ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా అంత సహేతుకంగా అనిపించవు. తమ డిమాండ్లు నెరవేర్చాలన్న ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి ఎవరిపై మీ సమరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ఏమి ప్రయోజనం? తెలంగాణ రాష్ట్రం దివాళా తీయడానికి ఉద్యోగులు బాధ్యులు అవుతారా? లేక పాలన చేస్తున్న నేతలా?‘‘నన్ను కోసినా రూపాయి రాదు..ప్రభుత్వం అంటే నేను ఒక్కడినే కాదు..ప్రజా ప్రతినిధులు,, ప్రభుత్వ ఉద్యోగులు అంతా కలిస్తేనే ప్రభుత్వం’’ అంటూ సూత్రాలు చెబితే ఏమి లాభం. రేవంత్ ఒక్కసారి కాంగ్రెస్ మానిఫెస్టోని తిరిగి చదువుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని రకాల హామీలు ఇచ్చింది మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ చదివి వినిపించారు. వాటన్నిటిని ఏ బాధ్యతతో చేశారు? ఇప్పుడు వాటిని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అడిగితే ‘‘ఎవరిపై మీ సమరం?’’ అంటే వారేమి జవాబు ఇస్తారు! ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, తదితర వాగ్దానాలు చేశారా? లేదా? రేవంత్ తాను అన్ని నిజాలే చెప్పినట్లు అనుకోవచ్చు.
కాని అది చెప్పిన తీరు బాగోలేదు. ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని అంతరంగికంగా చర్చలు జరిపి వారికి నచ్చ చెప్పి ఉండవచ్చు. ఫలానా సమయానికి తాను హామీలు అమలు చేయగలుగుతామని చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా ఇంత బహిరంగంగా వేరే కార్యక్రమంలో ఉద్యోగులను బెదిరించే రీతిలో మాట్లాడడం వల్ల ఆయనకే నష్టం. రేవంత్ తీరువల్ల రాష్ట్ర పరువు పోయిందని బీఆర్‌ఎస్, బీజేపీలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ముఖ్యమంత్రి పై మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ తాను నిజాలే మాట్లాడుతున్నానులే అనుకుని సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ సీఎంకు చేతకావడం లేదని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్‌లో కూడా దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి.
కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెళతాయి. కుల గణన ద్వారా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయిందని ప్రచారం చేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ దివాళా తీసిందని చెప్పడం ద్వారా దేశానికి ఏమి సంకేతం ఇచ్చినట్లయింది? అసలే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో రేటింగ్ తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డే దానిని మరింత తగ్గించుకున్నట్లుగా ఉంది. ఎన్నికలకు ముందు పొలిటికల్ సైన్స్, ఎన్నికల తర్వాత ఎకనామిక్స్ చెబితే జనం నమ్ముతారా!
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.