ఎండలో బండి జాగ్రత్త 

Beware the bike in summer - Sakshi

భానుడి ప్రతాపానికి ఇంధనం ఆవిరి

జాగ్రత్తలు పాటించకపోతే జేబుకు చిల్లు

మద్నూర్‌(జుక్కల్‌): భానుడు నిప్పులు కక్కుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి జనం బెంబేలుత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 7గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక మిట్టమధ్యాహ్నం వేళనయితే చెప్పాల్సిన అవసరమే లేదు.

జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఎండలో కాలు పెడితే చాలు ఒంట్లోని సత్తువంతా ఆవిరైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎండలో ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌ చేస్తే పెట్రోల్‌ భానుడి భగభగలకు హాంఫట్‌ అయిపోతోంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాల వాడకంలో కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందామా.. 
గరిష్ట ఉష్ణోగ్రతలు.. 
జిల్లాలో రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. సుమారు 40 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల బారినుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తున్నారు. అయితే వాహనాల విషయంలోనూ శ్రద్ధ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే వాహనం మొరాయించడం తప్పదని అంటున్నారు. వాహనాలను ఎండలో పార్కింగ్‌ చేస్తే.. మనకు తెలియకుండానే జేబులకు చిల్లులు ఖాయం. ముఖ్యంగా జిల్లాలోని పలు  కార్యాలయాల వద్ద పార్కింగ్‌ స్థలాలు లేవు. దీంతో ఎండలోనే వాహనాలు పార్కింగ్‌ చేయాల్సిన పరిస్థితి. అలాగే వ్యాపారులు, ఇతరులు వివిధ పనుల కోసం వెళ్లినప్పుడు బైక్‌లను ఎండలో పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో ఎండ వేడిమికి పెట్రోల్‌ ఆవిరవుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెట్రోల్‌ ఆదా చేయవచ్చు.  
జాగ్రత్తలివే.. 
∙ వాహనాల పెట్రోల్‌ ట్యాంకుపై మందపాటి కవర్‌ ఉండేటట్లు చూసుకోవడం వల్ల కొంతమేర పెట్రోల్‌ ఆవిరికాకుండా చూడవచ్చు. 
∙ ఎండల వేడికి ఇంజిన్‌ ఆయిల్‌ త్వరగా పల్చబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజిన్‌ ఆయిల్‌ మార్చుకోవడం మంచిది. 
∙ సీటు కవర్లు సైతం సాధారణమైనవి అయితే త్వరగా వేడెక్కి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వేడెక్కకుండా ఉండేందుకు వెల్‌వెట్, పోస్టు క్లాత్‌ సీట్‌ కవర్లు వాడాలి. 
∙ వేసవిలో ఇంజిన్‌ గార్డులు తొలగించడం ఎంతో మంచిది. దూర ప్రయాణాలు చేసేవారు మధ్యమధ్యలో బండి ఆపి విశ్రాంతి తీసుకోవడం అవసరం. 
∙ వేసవి కాలంలో పెట్రోల్‌ ట్యాంకులో గ్యాస్‌ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇందుకోసం రాత్రి సమయంలో బైక్‌ను పార్క్‌ చేసేటప్పుడు ఒకసారి ట్యాంక్‌ మూతను తెరచి మూయాలి. 
∙ ఎండాకాలంలో వాహనాలను నీడలోనే పార్కింగ్‌ చేయాలి. వేసవిలో ఇంజిన్‌కు సరిపడా ఆయిల్‌ ఉండేట్లు చూసుకోవాలి. టైర్లు, ట్యూబ్లు కూడా మంచిగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.  –

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top