రిటైర్మెంట్‌ రోజే బెనిఫిట్స్‌ | Benefits for Retirement on same day | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ రోజే బెనిఫిట్స్‌

Jul 4 2019 2:29 AM | Updated on Jul 4 2019 10:01 AM

Benefits for Retirement on same day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో రిటైౖరైన ఉద్యోగికి ఎటువంటి జాప్యం లేకుండా చివరి రోజే టర్మినల్‌ బెనిఫిట్స్‌ అందజేయాల్సి ఉందని, ఈ విషయంలో ఇంకా స్పష్టమైన ఆదేశాలిస్తామని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పేర్కొన్నారు. సంస్థ పరిధిలోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు 30 మంది స్పెషలిస్టు వైద్యులను ఇటీవల నియమించామని చెప్పారు. హైదరాబాద్‌లోని సింగరేణిభవన్‌లో బుధవారం గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, అధికారుల సంఘంతో జరిగిన 36వ జాయింట్‌ కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, అధికారుల సంఘాల సూచనలపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఖాళీల భర్తీలో అర్హులైన సింగరేణి ఉద్యోగులకు 60 శాతం అవకాశం కల్పించడం, కొత్త బూట్లు, ఆర్వో మంచినీటి ప్లాంట్ల ఏర్పాటు వంటి అనేక సమస్యలపై వారంలోగా డైరెక్టర్ల స్థాయిలో చర్చించి సానుకూలంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

ఐదేళ్లలో అద్భుత ప్రగతి 
ఈ ఏడాది లాభాల బోనస్‌ చెల్లింపుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఐదేళ్లుగా లాభాల బోనస్‌ ప్రకటించిన మాదిరిగానే ఈ సారి కూడా మెరుగైన స్థాయిలో ప్రకటించబడుతుందని శ్రీధర్‌ స్పష్టం చేశారు. దేశంలో మరే ఇతర ప్రభుత్వ సంస్థల్లో కూడా సింగరేణి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగడం లేదని, ఇవి ఇలాగే కొనసాగించాలంటే సంస్థను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా భూగర్భ గనుల్లో నష్టాలు భారీగా తగ్గించాలని, ఓసీ గనుల్లో యంత్రాల వినియోగం, పనిగంటలు పెరగాలని సూచించారు. దీనికి కార్మిక సంఘాలు కూడా తమ వంతు బాధ్యతగా కార్మికులకు అవగాహన కలిగించాలని కోరారు. సంస్థ గత ఐదేళ్లలో అద్భుత ప్రగతిని సాధించిందనీ, రానున్న కాలంలో కూడా లక్ష్యాల మేర కంపెనీని అభివృద్ధి చేస్తే రెట్టింపు సంక్షేమ ఫలాలు అందుకోగలమని, దీనికి కార్మిక సంఘాలు, అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషిచేస్తూ, సహకరించాలని కోరారు. సింగరేణి భవిష్యత్తు ప్రణాళికలను ఈ సందర్భంగా ఆయన కార్మిక నేతలకు వివరించారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకులు చేపట్టి లాభదాయక మైనింగ్‌ ద్వారా లాభాలను ఆర్జించడానికి పథకాలు రూపొందిస్తున్నామని చెప్పారు.  

రూ.50 వేల కోట్ల టర్నోవర్‌..
5 వేల కోట్ల లాభాలు 
రానున్న ఐదారేళ్ల కాలంలో 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2,500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని సాధించడానికి, తద్వారా 50 వేల కోట్ల టర్నోవర్, 5 వేల కోట్ల లాభాలను ఆర్జించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, తద్వారా మహారత్న హోదా కూడా లభించి మరిన్ని మెరుగైన అభివృద్ధి అవకాశాలు పొందనున్నామని శ్రీధర్‌ వివరించారు. గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ప్రాతినిధ్య సంఘం అధ్యక్షుడు వై.గట్టయ్య, కార్యదర్శి ఎం.రంగయ్య, అధికారుల సంఘం అధ్యక్షుడు రమేశ్, కార్యదర్శి ఎన్‌.వి.రాజశేఖర్‌లు పలు అంశాలను సీఎండీ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఎస్‌.శంకర్, ఎస్‌.చంద్రశేఖర్, భాస్కర్‌రావు, బలరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement