మూసీ పరీవాహకంలో అరటిసాగు?

Banana Garden Crops Near Musi River in Yadadri - Sakshi

సమగ్ర విధానంపై కసరత్తు

భూసారాన్ని బట్టి పండే పంటల గుర్తింపు

రైతులు, వివిధ వర్గాలనుంచి అభిప్రాయాల సేకరణ

నేడు హైదరాబాద్‌లో సీఎం సమీక్ష సమావేశం

నివేదిక అందజేయనున్న జిల్లా అధికారులు

మూసీ పరీవాహకంలో కలుషిత నీటితో పండించే పంటలు తినడం వల్ల కేన్సర్‌ వంటి భయానక వ్యాధులు సంభవిస్తుండడంతో ప్రత్యామ్నాయంగా అరటి తోటల సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది.  విషతుల్యమైన మూసీ నీటి ప్రభావం.. అరటి పండ్లలో ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తుండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. రైతులు, వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి గురువారం జరిగే సీఎం సమావేశానికి సిద్ధమైంది. కంది, పత్తికి సైతం ప్రాధా న్యమివ్వనుండడంతో వరి సాగు తగ్గే అవకాశముంది.

సాక్షి, యాదాద్రి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సమగ్ర రైతు విధానంపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి సమక్షంలో జరగనున్న సమీక్ష కోసం సిద్ధమవుతోంది. శాస్త్రవేత్తల అభిప్రాయాల మేరకు భూసారాన్ని బట్టి పండే పంటలను గుర్తిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పండించే వరికి బదులుగా కంది, పత్తి ఎక్కువగా సాగయ్యేలా చూడాలని, మూసీ పరీవాహకంలో అరటితోటలు వేయించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రైతులు, వివిధ వర్గాల నుంచి అధికారులు అభిప్రాయాలు సేకరించారు. జిల్లా కలెక్టర్‌తోపాటు ఉన్నతస్థాయి యంత్రాంగం  సీఎం సమీక్ష సమావేశానికి హాజరై ప్రతిపాదనల నివేదిక అందజేయనున్నారు.

ఎందుకంటే..
హైదరాబాద్‌ జంటనగరాలతో పాటు జిల్లా పరిధిలో రసాయన పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థ రసాయనాల వల్ల మూసీ జలాలు కలుషితమవుతున్నాయి. కలుషిత జలాల కారణంగా భూసారం కోల్పోవడమే కాకుండా పంట ఉత్పత్తులను తినడం వల్ల కేన్సర్‌ వంటి భయానక రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే పలు సందర్భాల్లో హెచ్చరించారు. జిల్లాలో 1.30లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయగా ఇందులో 95వేల ఎకరాలు దొడ్డురకం, 35ఎకరాల్లో సన్న రకాలను పండించారు. ఇందులో అత్యధికంగా 70వేల ఎకరాల్లో మూసీపరివాహకంలోనే సాగవుతుంది. అయితే విషతుల్యమైన మూసీ ఆయకట్టులో వరిసాగును తగ్గించి అరటితోటల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. విషతుల్యమైన మూసీ నీటి ప్రభావం అరటి పండ్లలో ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలాగే మూసీ పరీవాహకంలో భూమి కూడా అరటితోటలకు అనుకూలమైనదిగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో భువనగిరి పరిసరాల్లో తమలపాకు తోటలు పెద్ద ఎత్తున పెంచేవారు. ఇక్కడి తమల పాకులకు అత్యంత డిమాండ్‌ ఉండేదని రైతులు చెబుతుంటారు. దీని దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం.

పత్తి, కంది పంటలకూ పెద్దపీట
జిల్లాలో వరి విస్తీర్ణాన్ని తగ్గించి దాని స్థానంలో పత్తి, కంది పంటల విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈమేరకు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో గత సీజన్‌లో 1.60లక్షల ఎ కరాల్లో  పత్తి సాగు చేశారు. ఈ సీజన్‌లో రెండు లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వరి సాగుకంటే అధి కంగా పత్తిని ఇప్పటికే సాగు చేస్తున్నారు.  అలా గే 27వేల ఎకరాల్లో సాగు చేసిన కందిని 50వేల ఎకరాలకు పెంచే దిశగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే జిల్లాలో 2019 వానాకాలం సీజన్‌లో అన్ని పంటలు కలిపి3,37,812ఎకరాల్లో సాగు చేయగా, 2020 వానాకాలం సీజన్‌లో 3,54,750 ఎకరాల్లో వ్య వసాయ సాగు అంచనా వేసింది. అయితే మా రిన ప్రభుత్వ విధానం నేపథ్యంలో వరిసాగును తగ్గించి పత్తి, కందిసాగును పెంచే దిశగా చర్యలు చేపడుతుంది.జిల్లా యంత్రాంగం తయారు చేసిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతోపాటు సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశంలో తీసుకునే నిర్ణయాలను అమలు చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top