Sakshi News home page

నాన్న ప్రోత్సాహంతోనే ఒలింపిక్స్‌ స్థాయికి..

Published Wed, Mar 21 2018 6:45 AM

Badminton Player Sumeeth Reddy Special Interview - Sakshi

వరంగల్‌ స్పోర్ట్స్‌ : క్రీడాకారుడికి సాధించాలనే తపన, అందుకు తగిన కృషి ఉంటేనే సరిపోదు,  అనుకున్న క్రీడల్లో రాణించాలంటే ఆటల్లో కొత్త మెళకవల కోసం సరికొత్తగా ఆలోచించే సృజనాత్మకమైన శక్తి కలిగి ఉండాలని ఇండియన్‌ డబుల్స్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు బుస్సు సుమిత్‌రెడ్డి అన్నారు. హన్మకొండ భీమారంలో సమీపంలోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న క్రీడా వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుమిత్‌రెడ్డిని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన ఒలింపిక్స్‌ స్థాయికి ఎదిగిన తీరుతోపాటు యువ క్రీడాకారులకు పలు సూచనలు అందించారు. అవి ఆయన మాటల్లోనే.. 

మాది రంగారెడ్డి జిల్లా గున్‌గల్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో ఉంటున్నాం. అమ్మ నిర్మలాదేవి ఆబిడ్స్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలు. నాన్న చంద్రభాస్కర్‌రెడ్డి సైతం వ్యాయామ ఉపాధ్యాయుడే. ఆయన ప్రస్తుతం ధూల్‌పేటలోని జలక్షత్రియ పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ వ్యాయామ ఉపాధ్యాయులే కావడం నా అదృష్టంగా భావిస్తా. 

నేను మొదటిసారి 2001లో బ్యాడ్మింటన్‌ రాకెట్‌ను పట్టుకున్నా. నా మొదటి కోచ్‌ గోవర్ధన్‌రెడ్డి నాకు క్రీడల్లో ఓనమాలు నేర్పిస్తే, పుల్లెల గోపీచంద్‌ కోచింగ్‌ క్రీడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా చేసింది. ప్రతిరోజు నాన్న దగ్గరుండి ప్రాక్టీస్‌ చేయించేవాడు. అలా 17 సంవత్సరాల శిక్షణలో ఒలింపిక్స్‌ స్థాయికి ఎదిగాను. అదంతా నాన్న అందించిన ప్రోత్సాహమే.

ఇండియా నుంచి షటిల్‌ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో ఒలింపిక్స్‌లో ఆడే మొదటి అవకాశం నాకు రావడం అవధుల్లేని సంతోషాన్నిచ్చింది. నా జోడి మన్హోత్రితో కలిసి అనేక అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మా సత్తా చాటాం. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంటుంది. మన్హోత్రి తో కలిసి 2016 రియో ఒలంపిక్స్‌లో మా శాయశక్తులా ఆడాం. మూడు మ్యాచ్‌ల్లో మొదట  జపాన్‌పై విజయం సాధించాం. అదే ఉత్సాహంతో చైనా, ఇండోనేషియాలతో ఆడినప్పటికీ విజయం సాధించలేకపోయాం. అయినప్పటికీ బలమైన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చామన్న సంతృప్తి మాత్రం మాకు కలిగింది.

వరంగల్‌ వేదికగా గతంలో రెండు రాష్ట్ర స్థాయి టోర్నమెంటుల్లో పాల్గొన్నాను. త్వ రలో వరంగల్‌ మా అత్తారి ఊరు కాబో తుండడం సంతోషంగా ఉంది. మహబూ బాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌  క్రీడాకారిణి నెలకుర్తి సిక్కిరెడ్డితో ఇటీవల నిశ్చితార్థమైంది. ఇద్ద రం క్రీడాకారులం కావడం, అందులోనూ ఇద్దరం బ్యాడ్మింటన్‌ క్రీడాకారులం సంతో షంగా ఉంది’ అని ఆయన వెల్లడించారు.


 

Advertisement

What’s your opinion

Advertisement