బడిబాటకు సిద్ధం

Badibata Program In Khammam - Sakshi

బూర్గంపాడు:  జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ నెల 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 4వ తేదీనే ప్రారంభం కావాల్సి ఉండగా... వేసవి సెలవుల పొడిగింపుతో వాయిదా పడింది. ఎండల తీవ్రత కారణంగా ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యమైంది. దీంతో బడిబాట కార్యక్రమం కూడా ఆలస్యమైంది. నేటి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు బడిబాట కార్యక్రమాలను నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ షెడ్యూల్‌  రూపొందించింది.

కార్యక్రమ రూపకల్పన ఇలా..      
నేటి నుంచి ఈనెల 19 వరకు అన్ని ఆవాస ప్రాంతాలలో బడిబాట ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శనలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలలను సుందరంగా అలంకరించాలి. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి పిల్లలందరినీ బడిలో చేర్పించాలి. స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను కూడా బడిబాటలో భాగస్వాములు చేయాలి. బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలి. స్థానికుల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలి. అంగన్‌వాడీ కేంద్రాలలో చదువుతున్న ఐదేళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. 5, 6వ తరగతులు పూర్తయిన వారిని పైతరగతులలో చేర్పించాలి. ఆడపిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్‌లు పంపిణీ చేయాలి. బాలికల ఆరోగ్య పరిరక్షణపై వైద్యులతో అవగాహన కల్పించాలి. పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. బడిబాట కార్యక్రమంలో ముఖ్యంగా బాల కార్మికులను గుర్తించి వారిని బడిలో చేర్పించాలి.

ఇందుకు గాను తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, సహాయ కార్మిక అధికారి, స్వచ్ఛంద సంస్థలు, ఐసీడీఎస్, క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌లతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి బాల కార్మికులను గుర్తించాలి. బడిబాట కార్యక్రమంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలి. పాఠశాలలను శుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి. తరగతి గదులు, వంటగదులు, భోజనశాలలు, మరుగుదొడ్లు, ఆటస్థలాన్ని శుభ్రం చేయాలి. ప్రాథమిక పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాలను నిర్వహించాలి. బడిలో కొత్తగా చేరిన పిల్లలకు వారి తల్లిదండ్రులను పిలిపించి అక్షరాభ్యాస కార్యక్రమాలను ఘనంగా ఏర్పాటు చేయాలి. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలి. వాటి సంరక్షణ బాధ్యతలను విద్యార్థులకు అప్పగించాలి. బడిబాట కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను భాగస్వామ్యం చేసి పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. పాఠశాలల అభివృద్ధికి స్థానికంగా ఉన్నటువంటి దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి. ఎస్‌ఎంసీలు, ఎస్‌డీసీలతో సమావేశాలు నిర్వహించి పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించాలి.
 
అన్ని వర్గాల వారూ  సహకరించాలి
ఈ రోజు నుంచి ఈ నెల 19 వరకు కొనసాగనున్న బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి. అన్ని వర్గాల వారు దీనికి సహకరించాలి. బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలి. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు బడిబాటను వేదికగా చేసుకోవాలి.  – వాసంతి, డీఈఓ 

బడి బాటను విజయవంతం చేయాలి 

ఎంఈవోల సమావేశంలో డీఈవో వాసంతి  
కొత్తగూడెంరూరల్‌: జిల్లాలో శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు జరిగే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈఓ డి. వాసంతి ఎంఈఓలను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జిల్లాలోని ఎంఈఓలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమంలో సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు, ఆయా మండల పరిధిలో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లో టీచర్ల కొరతను గుర్తించాలన్నారు. మండలంలో పని చేసే సీఆర్‌పీలు ఫీల్డ్‌ లెవల్‌లో స్కూల్‌కు వెళుతున్నారా, సకాలంలో నివేదికలు అందిస్తున్నారా అనే వివరాలు  పరిశీలించాలని సూచించారు. విద్యా వలంటీర్లలను పాత వారినే కొనసాగించాలన్నారు. సమావేశంలో పరీక్షల నిర్వహణ అధికారి వి.వి. రామరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top