నేటి నుంచి బడిబాట

Badi Bata Program In Mahabubnagar - Sakshi

జిల్లాలో విద్యాశాఖ అధికారులు శుక్రవారం నుంచి బడిబాట కార్యక్రమం చేపడుతున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి బడిబయట ఉన్న చిన్నారులను బడిలో చేర్పించనున్నారు. యేటా ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అధికారులు కార్యక్రమాన్ని ఈనెల 19 వరకు నిర్వహించనున్నారు. 

వనపర్తి టౌన్‌ :  బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు బడిబాట నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక విడుదల చేశారు. జూన్‌ 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, మండల, జెడ్పీ, ఎయిడెడ్, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులందరినీ భాగస్వాములు చేసేలా విధివిధానాలను రూపొందించింది. ప్రైవేట్‌ పాఠశాలల ప్రవేశాలకు దీటుగా విద్యార్థులను సమకూర్చుకునేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధం అవుతోంది.

ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ప్రగతి, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, గుణాత్మక విద్య బోధనాంశాలు వివరించి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని ప్రచారం చేయనున్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఈనెల 14 నుంచి 19 వరకు బడి బాట కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమం అన్నీ ప్రభుత్వ పాఠశాలలో కొనసాగనుంది. ప్రజలను, ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాగం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయులను సంసిద్ధులను చేయడంతో పాటుగా బడిబయట పిల్లలను గుర్తించి, బడిఈడు పిల్లలను సర్కార్‌ బడుల్లో చేర్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

ఖర్చులకు రూ.వెయ్యి 
బడిబాట నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. ఈనెల 14 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జిల్లాలోని 539 పాఠశాలలకుగానూ ఒక్కో పాఠశాలకు రూ.1000 ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఈ డబ్బులతో ప్రచార సామగ్రి, ప్రగతి నివేదికలు, బ్యానర్‌లను ఉపాధ్యాయులు సమకూర్చుకోనున్నారు.
  
అపోహలు తొలగించే విధంగా..  
సర్కార్‌  పాఠశాలపై   ప్రజల్లో   నమ్మకం కలిగించి, వారిలోని అపోహలను తొలగించేందుకు  ఉపాధ్యాయులు బడిబాట ద్వారా  కృషి   చేయనున్నారు.      నాణ్యమైన  విద్య,   అందిస్తున్న    తీరుతో   పాటు, బడుల్లోని  బోధన,    సదుపాయాలు, సాధించిన  ఫలితాలతో తల్లిదండ్రుల విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నించనున్నారు.  

నేడు ప్రదర్శనలు  
ఈనెల 14 మనఊరు బడి పేరుతో గ్రామంలోని పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అవాస ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, ప్రభుత్వ అందిస్తున్న నాణ్యమైన విద్య, సదుపాయాలను వారికి వివరించనున్నారు. 15న బాలికలకు విద్య అందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు ఆరోగ్య, సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న సదుపాయాలపై అవగాహన కల్పిస్తున్నారు. 17న విద్యార్థులతో సామూహికంగా అక్షరాభాస్యం చేయిస్తారు. ఉన్నత పాఠశాలలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. 18న పాఠశాలలోని తరగతి గదులను తీర్చిదిద్దేందుకు, ఆవరణలను పరిశుభ్రపరుస్తారు. ఆవరణలో మొక్కలు నాటి స్వచ్ఛత కార్యక్రమాలు చేపడతారు. 19న పాఠశాలల యాజమాన్య కమిటీల భాగస్వామ్యంతో ఇంటింటికీ పర్యటిస్తారు. పాఠశాలల యాజమాన్య కమిటీ, స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి పదో తరగతిలో విద్యార్థులు సాధించిన ప్రగతిని వివరించనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top