ఆధార్‌కు వెనకడుగు | Back step to AADHAR | Sakshi
Sakshi News home page

ఆధార్‌కు వెనకడుగు

Mar 20 2018 10:50 AM | Updated on May 25 2018 6:12 PM

Back step to AADHAR - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  భూ రికార్డుల ప్రక్షాళనతో బినామీల బాగోతం వెలుగుచూస్తోంది. ఆధార్‌ నంబర్‌ అనుసంధానంతో ఇన్నాళ్లు రికార్డులకే పరిమితమైన భూముల వ్యవహారం బాహ్యప్రపంచానికి తెలుస్తోంది. రెవెన్యూ రికార్డుల నవీకరణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఆధార్‌ విశిష్ట సంఖ్యను కూడా పట్టాదార్‌ పాస్‌ పుస్తకానికి జోడిస్తోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో భూ సమగ్ర సమాచారం ఆన్‌లైన్‌లో నిక్షిప్తమవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న రెవెన్యూయంత్రాంగం తాజాగా ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తోంది.

కాగా, ఈ ప్రక్షాళన కేవలం రికార్డుల అప్‌డేట్‌ వరకే పరిమితమవుతుందని భావించిన బడాబాబులు.. ఆధార్‌ సీడింగ్‌ తప్పనిసరి చేయడంతో కలవరం చెందుతున్నారు. ఒకవేళ ఆధార్‌ సంఖ్యను ఇవ్వకపోతే సదరు భూమిని బినామీల జాబితాలో చేరుస్తామని ప్రకటించడంతో వారిలో ఆందోళన మొదలైంది. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 79.30 శాతం మాత్రమే ఆధార్‌ నంబర్‌ను అప్‌లోడ్‌ చేశారు. మిగతా 20.70 శాతం మంది ఇంకా ఆధార్‌ ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ఆధార్‌ ఇవ్వని జాబితాలో అత్యధికం శివారు మండలాలే ఉన్నాయి. సరూర్‌నగర్‌ 1.45 శాతం, శేరిలింగంపల్లి 6.74 శాతం, రాజేంద్రనగర్‌ 20.95 శాతం, గండిపేట 46.23 శాతం మాత్రమే నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో భూముల విలువ నింగినంటింది.

నల్లధనం కలిగిన సంపన్నవర్గాలు, సినీరంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్లు ఈ ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా భూములను కొనుగోలు చేశారు. రియల్టీ కోణంలో ఆలోచించిన ఆయా వర్గాలు భూముల్లో పెట్టుబడులు పెట్టారు. ఆశించిన స్థాయిలో రేటు రాగానే  అమ్ముకొని భారీగా గడిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడుతున్న పెద్దలు తమ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసేందుకు వెనుకాడుతున్నారు. దీంతో చాలావరకు వీరి తరఫున కొందరు బ్రోకర్లే రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వ్యవహారాలను చక్కబెడతారు.

తాజాగా ఇప్పుడు 1బీ రికార్డు ఆధారంగా గుర్తించిన ప్రతి సర్వేనంబర్, భూ విస్తీర్ణానికి సంబంధించిన యజమాని సమాచారాన్ని తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఒకవేళ ఈ సమాచారం గనుక రాకపోతే సదరు ఆస్తిని బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తామని ప్రకటించింది. అయినప్పటికీ,  ఇంకా చాలామంది తమ ఆధార్‌నంబరే కాకుండా ఫోన్‌నంబర్‌ను కూడా ఇచ్చే విషయంలో తటపటాయిస్తున్నారు. 2.56 లక్షల నంబర్లకుగాను ఇప్పటివరకు 1.05 లక్షల నం బర్లు మాత్రమే నమోదు కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement