బీజేపీలో బీ–ఫారం ట్విస్ట్‌

B-Forms Twist In BJP Party In Narayankhed - Sakshi

 ఇద్దరికీ ఫారం జారీ

 నారాయణఖేడ్‌లో ఉత్కంఠరేపిన నామినేషన్‌

నారాయణఖేడ్‌: నారాయణఖేడ్‌ బీజేపీలో సోమవారం నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉదయం నుంచి అన్ని పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపింది. నారాయణఖేడ్‌ బీజేపీ అసెంబ్లీ టిక్కెట్‌ను రవికుమార్‌గౌడ్‌కు ఆ పార్టీ రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఈ మేరకు ఆయనకు బీ ఫారం అందజేసింది. కాగా ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా సంజీవరెడ్డికి కాంగ్రెస్‌ టిక్కెటు దక్కలేదు. సోమవారం నామినేషన్లకు చివరిరోజు. దీంతో బీజేపీ నాయకులు సంజీవరెడ్డిని సంప్రదించారు.

కార్యకర్తల ఒత్తిడిమేరకు సంజీవరెడ్డి బీజేపీ నుంచి నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యాడు. తనకు వచ్చిన బీ ఫారంను సమర్పించేందుకు రవికుమార్‌గౌడ్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం సమీపంలో ఉదయం 9గంటలకే చేరుకున్నాడు. పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు రవికుమార్‌గౌడ్‌ వద్దకు వచ్చి బీ ఫారం కావాల్సిందిగా కోరారు. దీంతో రవికుమార్‌గౌడ్‌ రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌లోకి వెళ్లి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు.

బీజేపీ నాయకులు ఎంతకూ ఫోన్‌ చేసినా ఫోన్‌ కలవడకపోవడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో పార్టీ నాయకత్వం హుటాహుటినా బీదర్‌ బీజేపీ ఎంపీ భగవంత్‌ కుబ్బాతో మరో బీఫారంను పంపగా సంజీవరెడ్డి మరో సెట్టును బీజేపీ అభ్యర్థిగా దాఖలు చేశారు. మొదట బీ–ఫారం సమర్పించిన రవికుమార్‌గౌడ్‌ స్థానిక కార్యకర్తలకు చిక్కకుండా వెళ్ళిపోయారు. ఈ విషయంపై సాక్షి బీజేపీ అభ్యర్థి రవికుమార్‌గౌడ్‌ను ఫోన్లో మాట్లాడగా.. పార్టీ బీఫారం ఇవ్వగా తాను నామినేషన్‌ వేసి బీఫారం సమర్పించినట్లు తెలిపారు. తనను ఎవ్వరూ సంప్రదించలేదన్నారు. సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసిందని, ఆయనకు మద్దతు ఇస్తారా అని ప్రశ్నించగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.

ఇద్దరికీ బీ–ఫారం ఇస్తే..
శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు ఒకే పార్టీ ద్వారా బీ ఫారం ఇస్తే ఎలా అనే సందేహం నారాయణఖేడ్‌లో సోమవారం నెలకొన్న ఘటన ద్వారా చర్చనీయాంశమయ్యింది. నారాయణఖేడ్‌ బీజేపీ పార్టీ అభ్యర్థులుగా రవికుమార్‌గౌడ్, సంజీవరెడ్డిలు నామినేషన్‌ వేసారు. ఇలా ఇద్దరు బీఫారాలు ఇవ్వడంతో ఎన్నికల అధికారులు ఎవరికి పార్టీ గుర్తు కేటాయిస్తారన్న చర్చ హాట్‌టాపిక్‌లా మారింది. ఈ విషయంలో పలు పార్టీల కార్యకర్తల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

ఒక పార్టీ ఒకరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాక ఏ–ఫారం, బీ–ఫారం అందజేస్తుంది. తర్వాత మొదటి వ్యక్తికి కాకుండా రెండో వ్యక్తికి ఏ–ఫారం, బీ–ఫారం జారీచేసేప్పుడే బీ–ఫారంలో ఉండే ఒక కాలంలో మొదటి వ్యక్తికి ఇచ్చిన బీ ఫారం రద్దు చేస్తున్నామని, కావునా ఈ రెండో వ్యక్తికి కేటాయించిన బీ ఫారాన్ని స్వీకరించాలని రాసి ఇస్తుంది. దీన్ని రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన పక్షంలో మొదటి వ్యక్తి ఇచ్చిన బీఫారాన్ని రద్దు చేసి రెండో వ్యక్తి ఇచ్చిన బీ ఫారానికి ఎన్నికల అధికారులు గుర్తును కేటాయిస్తారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top