చలిముసుగులో.. ‘స్వైన్‌ఫ్లూ’ బెడద

Awareness Campaign About Swine Flu By Doctor Srinivas Rao - Sakshi

అప్రమత్తతే రోగనివారణకు మార్గం

పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు

సాక్షి, హైదరాబాద్‌ : డెంగీ తీవ్రత కాస్తంత తగ్గుముఖం పట్టింది.శీతాకాలం మొదలు కావడంతో హెచ్‌1ఎన్‌1 వైరస్‌ గాలిలోకి ప్రవేశించింది.దీంతో స్వైన్‌ఫ్లూ తాకిడికి అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రచారం మొదలు పెట్టింది. గత అనుభవాల రీత్యా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని, అప్రమత్తతే రోగనిరోధానికి మార్గమని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్, స్వైన్‌ఫ్లూ నియంత్రణ సాంకేతిక కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మూడో దశ ప్రమాదకరం.. 
‘‘స్వైన్‌ఫ్లూ తీవ్రతను బట్టి దాన్ని మేం మూడు కేటగిరీలుగా వర్గీకరించాం. ఇది జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, ముక్కు దిబ్బడ, దగ్గు వంటి సాధారణ లక్షణాలతో మొదలవుతుంది. వీరు డాక్టర్‌ సూచనల మేరకు తేలిక పాటి చికిత్స తీసుకుంటూ ఇంటి వద్దనే ఉండి పరిశుభ్రతను పాటిస్తే సరిపోతుంది. ఈ లక్షణాలు 48 గంటల్లో తగ్గుముఖం పడతాయి. ఇక రెండో కేటగిరీ ఫ్లూ జ్వరం ప్రారంభమైన 48 గంటల తర్వాత కూడా జ్వరం తగ్గకుండా తీవ్రం కావటం, గొంతునొప్పి పెరుగుతుంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మొదటి కేటగిరీలో ఉన్నా బీ రకం కిందకే వస్తారు. ఈ కేటగిరీ వాళ్లంతా సత్వరమే వైద్యుడ్ని సంప్రదించాలి.

ఇక 5 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, మధుమేహం, ఆస్తమా, గుండె, కిడ్నీ జబ్బులు, దీర్ఘకాలిక శ్వాస సమస్యలున్న వారు, క్యాన్సరు చికిత్స తీసుకుంటున్న వాళ్లు, అవయవ మార్పిడి చేయించుకున్నవారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది వీరు తప్పనిసరిగా వైద్యుల దగ్గరకు వెళ్లాలి. సకాలంలో స్పందించి మందులు వాడితే ప్రమాదం ఉండదు. మూడో కేటగిరీ స్వైన్‌ఫ్లూ అత్యంత ప్రమాదకరం.

జ్వర తీవ్రత, ఛాతీలో బరువు, బీపీ పడిపోవటం, శరీర రంగు మారటం, దగ్గితే రక్తం పడటం, శ్వాసకు ఇబ్బంది, వాంతులు, వీరేచనాలు, కడుపు నొప్పి మొదలైనవి ఉన్నవారు ఈ కోవలోకి వస్తారు. వీరిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయాల్సిందే. తెలంగాణా ప్రభుత్వం అన్నీ ఆసుపత్రుల్లోనూ ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డులను ఏర్పాటు చేసింది. బాధితులను ఆసుపత్రిలో చేర్చినా, వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా ప్రత్యేకమైన గదిలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇక ఆసుపత్రి సిబ్బంది తప్పనిసరిగా స్వైన్‌ ఫ్లూ టీకా వేయించుకోవాలి’’అని శ్రీనివాసరావు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top