పుస్తక పఠనంతోనే చైతన్యం

Awareness with book reading - Sakshi

గ్రంథాలయ ఉద్యమం మళ్లీ  ప్రారంభం కావాలి

ప్రతి పల్లెలో గ్రంథాలయం, ఇంటింటికీ స్వచ్ఛాలయం నినాదం కావాలి 

‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’ ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  

సాక్షి, హైదరాబాద్‌: పుస్తకాలు భాషా, సంస్కృతులకు దర్పణాలని, విజ్ఞాన సముపార్జనలో, సమాజాభివృద్ధిలో కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పుస్తక పఠనం పెరిగి, సమాజంలో చైతన్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. 32వ హైదరాబాద్‌ జాతీయ పుస్తకమహోత్సవ వేడుకలు శనివారం ఎన్టీఆర్‌ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతిక, పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, తెలంగాణ మీడియా కమిషన్‌ చైర్మన్‌ అల్లం నారాయణ, హైదరాబాద్‌ బుక్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రసంగించారు. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం అప్పట్లో ప్రజలను చైతన్యవంతులను చేసిందని, మరోసారి ఆ ఉద్యమం రూపుదాల్చా లని అన్నారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛాలయం (శౌచాలయం), ప్రతి పల్లెకూ గ్రంథాలయం నినాదంతోపాటుగా స్వచ్ఛత మరియు పుస్తకాలు చదివే సంస్కృతి విస్తరించాలని సూచించారు.  తెలుగు భాషాభిమాని, రచయిత అయిన సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణలో గ్రంథాలయాల ప్రాధాన్యత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ‘‘అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక’’అన్న కాళోజీ మాటల్ని గుర్తు చేశారు. 

పుస్తకాలే అండగా నిలిచాయి.... 
దేశాభివృద్ధి, విజ్ఞాన శాస్త్ర పురోగతి, యుద్ధాలు, శాంతి సుస్థిరతల స్థాపన వంటి అనేక సందర్భా ల్లో సమస్త మానవాళికి పుస్తకాలే అండగా నిలిచాయన్నారు. ఇలాంటి వేడుకల్లోనే కొత్త పుస్తకాల గురించి, కొత్త రచయితల గురించి తెలుసుకోవచ్చునన్నారు. ఆన్‌లైన్‌ డిజిటల్‌ వేదికలు వచ్చినప్పటికీ అచ్చులో అక్షరం విలువ, పరిమళం ఎప్పటికీ వాడిపోవని చెప్పారు. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ 1966లో ముంబైలో తొలిసారి పుస్తక ప్రదర్శన నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ దేశంలో రెండో స్థానం లో ఉందని, మొదటి స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ మొదటిస్థానానికి చేరేలా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. తెలుగు భాష సాంస్కృతిక, సారస్వత పునరుజ్జీవనానికి, తెలంగాణ వికాసానికి గ్రంథాలయ ఉద్యమం చేసిన కృషిని గుర్తు చేశారు. విద్యార్థులకు మహనీయు ల జీవితాలు, చరిత్రను, సంస్కృతిని, విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను పరిచయం చేయాలని దిశానిర్దేశం చేశారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయడం ద్వారా విజ్ఞానం, మెరుగైన జీవితం తద్వారా మెరుగైన సమాజం సాకారమవుతాయన్నారు. ప్రధాని మోదీ సూచించిన విధంగా వివిధ కార్యక్రమాల్లో మంచి పుస్తకాలను బహుమతులుగా అందజేయాలని సూచించారు. ప్రజల్లో పఠనాసక్తిని పెంచేందుకు పత్రికలు, మీడియా చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top