తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్‌! | AP intelligence in the state! | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్‌!

Sep 15 2018 2:24 AM | Updated on Sep 15 2018 8:53 AM

AP intelligence in the state! - Sakshi

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ను పరుగులు పెట్టిస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ను పరుగులు పెట్టిస్తోంది. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలపై దృష్టి సారించడమే దీనికి ప్రధాన కారణమని టీటీడీపీ వర్గాలు స్పష్టం చేశాయి. ఏపీ ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో టీడీపీ పట్టున్న ప్రాంతాలు.. గత ఎన్నికల్లో టీడీపీ సాధించిన ఓటు బ్యాంకు.. నేతల వలసలు.. తదితర అంశాలన్నింటిపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఏపీ ఇంటెలిజెన్స్‌ను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఏపీ ఇంటలిజెన్స్‌ పొలిటికల్‌ విభాగంలో పని చేస్తున్న 60 మంది హైదరాబాద్‌లోని ఏపీ డీజీపీ కార్యాలయానికి వచ్చి క్యాంపు ఏర్పాటు చేశారు. 4 రోజల క్రితం వచ్చిన వీరిని ముగ్గురు చొప్పున బృందాలుగా ఏర్పాటు చేసి సర్వే విధులు అప్పగించినట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఏయే స్థానాలను గెలవచ్చు.. పొత్తుపై టీడీపీ ఓటర్ల స్పందన అంశాలపై కూడా త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.  

ఆ 20పైనే నజర్‌... 
ప్రస్తుతం ఏపీ ఇంటెలిజెన్స్‌ బృందాలు 20 అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టినట్లు టీటీడీపీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, సనత్‌నగర్‌లో సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే రూరల్‌ ప్రాంతాలైనా నిజామాబాద్‌లో ఓ అసెంబ్లీ, మెదక్‌లో నారాయణ్‌ఖేడ్, వరంగల్‌లో నర్సంపేట్, కరీంనగర్‌లో కోరుట్ల, ఖమ్మంలో సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం, నల్గొండలో కోదాడ, మహబూబ్‌నగర్‌లో మక్తల్, వనపర్తి, దేవరకద్ర, ఆదిలాబాద్‌లో ఖానాపూర్‌ లేదా ఆసిఫాబాద్‌లో బృందాలు సర్వే చేస్తున్నట్లు తెలిసింది. పొత్తులో భాగంగా ఇదే స్థానాలను టీటీడీపీ కోరే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది.  

తెలంగాణలో వాళ్లెలా చేస్తారు? 
ఒక రాష్ట్రంలోని పరిస్థితులు, రాజకీయ పరమైన అంశాలపై పక్క రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్‌ బృందాలు సర్వే చేయడం వివాదాస్పదమయ్యేలా కనిపిస్తోంది. దీనిపై తెలంగాణ ఇంటెలిజెన్స్‌ను సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపే అంశంగా మారుతుందని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్‌ సంస్థతో సర్వే చేయించుకుంటే అభ్యంతరం లేదని, పక్క రాష్ట్రానికి చెందిన పోలీసులు సర్వే చేయడం నిబంధనలకు విరుద్ధమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement