భవిష్యత్‌ కార్యాచరణపై రేపు ప్రకటన : అశ్వత్థామ రెడ్డి

Announcement Come Tomorrow On Future Activity: Ashwatthama Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీని ప్రైవేటీకరణ సాధ్యం కాదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి శనివారం స్పష్టం చేశారు. కార్మికులు అధైర్యపడవద్దని, ప్రైవేటీకరణ అనేది చట్టంలో లేదని వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ జారీ చేసిన ప్రకటనను ఎండీకి పంపిస్తామని, సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. మరోవైపు ఆదివారం ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగులు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతారని వెల్లడించారు. అన్ని డిపోల కార్మికులు ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటాలకు నివాళులర్పించి డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలిన పిలుపునిచ్చారు. తదుపరి కార్యాచరణను ఆదివారం ప్రకటిస్తామని పేర్కొన్నారు.

మరోవైపు కార్మికుల దీక్ష 50వ రోజుకు చేరింది. వివిధ జిల్లాల్లో కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

  • ఖమ్మంలో బస్‌డిపో నుంచి బస్టాండ్‌ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌లోకి కార్మికులు, అఖిల పక్ష నాయకులు చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. డిపోకి వస్తున్న బస్సులను మహిళా కండక్టర్లు ఆపేసి వాటి టైర్లలోని గాలి తీశేసారు. కొత్తగూడెం పట్టణంలో సీపీఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల కోసం నాయకులు విరాళాలు సేకరించారు.
  • నిజామాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీని ధర్నాచౌక్‌ నుంచి ప్రారంభించగా బస్టాండ్‌, గాంధీ చౌక్‌, నెహ్రూ పార్క్‌, రైల్వే స్టేషన్‌ మీదుగా ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు నిర్వహించారు. బోధన్‌లో అంబేద్కర్‌ చౌరస్తా నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు.
  • మెదక్‌ జిల్లాలో ప్రైవేటీకరణకు నిరసనగా బస్టాండ్‌ నుంచి రాందాస్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డిలో బస్టాండ్‌ ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్‌ నుంచి ఐబీ వరకు దాదాపు 200 మంది కార్మికులు ర్యాలీ తీశారు.
  • కరీంనగర్‌ జిల్లాలో బస్టాండ్‌ నుంచి తెలంగాణ చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. గోదావరి ఖనిలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
  • మహబూబ్‌నగర్‌ జిల్లా తెలంగాణ చౌరస్తాలో కార్మికులు మానవ హారం నిర్మించారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top