సందు దొరికితే సంపుడే..! | Animal hunting going on Mahadevpur forests | Sakshi
Sakshi News home page

సందు దొరికితే సంపుడే..!

Mar 23 2017 3:16 AM | Updated on Oct 4 2018 6:03 PM

సందు దొరికితే సంపుడే..! - Sakshi

సందు దొరికితే సంపుడే..!

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గోదావరి తీరం వణ్యప్రాణుల వేటకు నిలయంగా మారింది.

మహదేవపూర్‌ అడవుల్లో జోరుగా వేట
హైదరాబాద్‌ నుంచి వస్తున్న బడాబాబులు
పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న స్థానిక ముఠా
విదేశాలకు జంతు చర్మాలు
గోదావరి తీరంలో షూటింగ్‌ రాకెట్‌


సాక్షి, భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గోదావరి తీరం వణ్యప్రాణుల వేటకు నిలయంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన బడాబాబులు తమ మృగయానం దం తీర్చుకునేందుకు మహదేవపూర్‌ అడవుల్లోకి షికారుకు వస్తున్నారు. ఇక్కడ వేటాడిన జంతువుల మాంసంతో నగరంలో దావత్‌లు చేసుకుంటున్నారు. జంతు చర్మాలను విదేశాలకు ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రెండేళ్లుగా ఈ తంతు పకడ్బందీగా కొనసాగుతోంది.  మహదేవపూర్‌ రేంజ్‌ పరిధిలో ఆదివారం(19న) రాత్రి ఫారెస్టు అధికారులు జరిపిన దాడిలో హైదరాబాద్‌కు చెంది న కారు, రెండు జింకల మృతదేహాలు లభిం చడంతో వేట ఇక్కడ సర్వసాధారణం అన్న అంశం తెరపైకి వచ్చింది.

గతంలో ఉచ్చులు, కరెంటు తీగలు అమర్చడం ద్వారా అటవీ జంతువులను వేటాడేవారు. ఇలా వేటాడిన జంతువుల మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకునేవారు. కరెంటు తీగలు అమర్చడం వల్ల స్థానికులు మరణిస్తుండటంతో కొన్నేళ్లుగా కరెంటు తీగలు, ఉచ్చులతో వేటాడటం తగ్గుముఖం పడుతోంది. దీని స్థానంలోకి తుపాకులు, జిప్సీలు, బైనాక్యులర్స్‌ ఉపయోగిస్తూ వేటాడేవారి సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌లో హై–ఫై సర్కిళ్లకు వన్యప్రాణుల మాంసాన్ని సరఫరా చేసే ముఠాల సంచారం పెరిగింది. స్థానికంగా ఉండే వారు వీరికి సహకారిస్తూ ఒక రాకెట్‌గా ఏర్పడ్డారు. ఫలితంగా అడవి జంతువులు బలవుతున్నాయి.

ముందస్తు సమాచారం
మహదేవపూర్, పలిమెల మండలాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నాయి. ఈ రెండు మండలాల పరిధిలోనే ప్రాణహిత, ఇంద్రావతి నదులు గోదావరిలో కలుస్తున్నాయి. దట్టమైన అడవితో పాటు జంతువులు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఇక్కడ మావోయిస్టులు, పోలీసుల సంచారం ఎక్కువగా ఉంటుంది. మావోయిస్టులు, పోలీసుల కూంబింగ్‌లు జరగని రోజులను వేటగాళ్లు ఎంపిక చేసుకుంటున్నారు. వేటగాళ్ల ముఠాకు సహకరించేందుకు స్థానికంగా అధికార పార్టీకి చెందిన ఓ నేత ఆధ్వర్యంలో పదిహేను మందితో కూడిన ప్రత్యేక దళం పని చేస్తున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.

పెద్ద బండ్లు
కాళేశ్వరంలో దైవదర్శనానికి వచ్చే భక్తులు మినçహా మహదేవపూర్‌ మండలంలోకి పెద్ద పెద్ద కార్లు వచ్చే సందర్భాలు అరుదు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భం గా వాహనాల రాక పెరిగినా అనుమానాస్ప దంగా తిరిగే కార్ల సంఖ్య అధికమైనట్లు తెలుస్తోంది. మహదేవపూర్‌–పలిమెల మార్గంలోకి ఫార్చునర్, ఇన్నోవా వంటి కార్లు అకస్మాత్తుగా రావడం రోడ్డు పక్కన అడవుల్లో గంటల తరబడి పార్కింగ్‌ చేసి ఉండటాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అలాగే, వేటకు అనువుగా ఉండే జిప్సీ, టాప్‌లెస్‌ జీపుల వినియోగం ఇటీవల ఈ ప్రాంతంలో పెరగడం జంతువుల వేట జోరుగా సాగుతోందన్న సందేహాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.

లక్షల్లో వ్యాపారం..
హైదరాబాద్‌లో జరిగే పలు పార్టీల్లో అడవి జంతువుల మాంసాన్ని ప్రత్యేక ఆకర్షణగా పేర్కొంటున్నారు. ఇలాంటి పార్టీలకు మాంసం చేరవేసేందుకు పక్కా నెట్‌వర్క్‌తో పనిచేస్తున్నారు. దీంతో మహదేవపూర్‌ అడవుల్లో వేట వ్యవహారం కనీస జీవనోపాధి దశ నుంచి కార్పొరేట్‌ స్థాయికి చేరుకుంది. వేటలో లభించిన జంతువును బట్టి రేటును నిర్ణయిస్తున్నారు. జింక మాంసాన్ని కేజీకి వేలల్లో అమ్ముతున్నట్లు సమాచారం. లేదా సగటున 25 కేజీలు ఉండే జింక, దుప్పి వంటి జంతువులను చర్మంతో సహా టోకుగా విక్రయిస్తున్నట్లు తెలిసింది. జంతు చర్మాలను హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement