కరీంనగర్‌కు నేడు అమిత్‌ షా

Amit Shah Meeting In Karimnagar - Sakshi

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం కరీంనగర్‌ రానున్నారు. ఉత్తర తెలంగాణ కేంద్రంగా కరీంనగర్‌ నుంచి ఆయన ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో తొలి సభ నిర్వహించారు. ఆ సభ సక్సెస్‌ కావడంతో ఉత్తర తెలంగాణలోని కరీంనగర్‌ రెండో సభకు బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసింది. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో కరీంనగర్‌లో నిర్వహించే అమిత్‌ షా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం కరీంనగర్‌ రానున్నారు. ఉత్తర తెలంగాణ కేంద్రంగా కరీంనగర్‌ నుంచి ఆయన ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో తొలి సభ నిర్వహించారు. అది సక్సెస్‌ కావడంతో ఉత్తర తెలంగాణలోని కరీంనగర్‌ రెండో సభకు బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసింది. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో కరీంనగర్‌లో నిర్వహించే అమిత్‌ షా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా.. అమిత్‌ షా బహిరంగ సభకు కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియం సిద్ధమైంది. సభా వేదిక ఏర్పాట్లను మంగళవారం కూడా రాష్ట్ర నాయకులు పరిశీలించారు. బహిరంగ సభ కోసం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి లక్ష మందిని సమీకరించడంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిమగ్నమయ్యారు. కరీంనగర్‌ నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రచార ఘట్టానికి శ్రీకారం చుట్టనున్న ఎన్నికల శంఖారావం, సమరభేరి సభకు అన్ని ఏర్పాట్లు చేశారు.
 
అగ్రనేతల నజర్‌లో కరీంనగర్‌.. పాగా వేసేందుకు ప్రయత్నం..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో జిల్లా రాజకీయాలపై పట్టు బిగించేందుకు ఆ పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర నాయకత్వాన్ని ఒప్పించి బుధవారం కరీంనగర్‌ నగరంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సభ నిర్వహిస్తున్నారు. ఆయన రాక, బహిరంగ సభ పార్టీలో నూతనోత్తేజాన్ని నింపనుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సభను విజయవంతం చేసి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో కమల వికాసాన్ని విరబూయించే చర్యల్ని తీసుకుంటున్నారు. గతంలోనూ పార్టీ జాతీయ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ కరీంనగర్‌లో నిర్వహించిన భారీ సభకు హాజరై ఇక్కడి ప్రజల ఆశీసుల్ని అందుకున్నారు.

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా రెండు పర్యాయాలు జిల్లాలోని సభలకు హాజరయ్యారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓసారి వచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో 2014 ఏప్రిల్‌ 22వ తేదీన కరీంనగర్‌లోని అంబేద్కర్‌ మైదానంలో నిర్వహించిన భారీ సభకు భాజపా ప్రధాని అభ్యర్థి హోదాలో మోదీ విచ్చేశారు. పార్టీలో నమో నినాదాన్ని నింపి గత ఎన్నికల్లో ఓటు బ్యాంకుని పెంచుకునేలా ప్రసంగించారు. గతంలో జాతీయ పార్టీ అధ్యక్షుడి హోదాలో నితిన్‌గడ్కరీతోపాటు జాతీయ నాయకురాలు స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రులు ఉమ్మడి జిల్లాకు వచ్చి ఇక్కడి ప్రజలతో మమేకమైన సందర్భాలున్నాయి. మళ్లీ అదే తరహాలో ఈ ఎన్నికల్లో ప్రచార హోరును జోరుగా కొనసాగించే సన్నాహాల్ని పార్టీ చేపడుతోంది.
 
భారీ బందోబస్తు.. పోలీసు బలగాల మోహరింపు..
ముందస్తు సమరంలో కమలం జోరుని పెంచాలని సరికొత్త వ్యూహంతో నిర్వహించే అమిత్‌ షా భారీ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించగా, పోలీసు బలగాలు సైతం మోహరించాయి. కరీంనగర్‌ కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌ గ్రౌండ్‌ను మంగళవారం ఉదయమే తమ అధీనంలోకి తీసుకున్న కేంద్ర పారా మిలటరీ బలగాలు, పూర్తిగా వారి పర్యవేక్షణలోనే ఉంచుకున్నారు. బాంబు డిస్పోజల్, డాగ్‌ స్క్వాడ్‌లు హెలిప్యాడ్, సభావేదిక వద్ద తనిఖీలు నిర్వహించారు. అమిత్‌ షా హాజరయ్యే ఈ సభలోని పలు ప్రాంత్లాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి నగరంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు ఆంక్షలతోపాటు దారి మళ్లింపు షెడ్యూల్‌ను రెండు రోజుల ముందుగానే విడుదల చేశారు. ఈ సందర్భంగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్, జాతీయ నాయకులు బండారు దత్తాత్రేయ, పి.మురళీధర్‌రావు, పోల్సాని సుగుణాకర్‌రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు బండి సంజయ్, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కుమార్, కరీంనగర్‌ జిల్లాధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఏర్పాట్లలో బిజీ బిజీగా గడిపారు.

దారిమళ్లింపు, వాహనాల పార్కింగ్‌ ఇలా..
బీజేపీ సభ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్‌ నిబంధనలు అమల్లోకి వస్తాయని పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి ప్రకటించారు. సభ పూర్తయ్యే వరకు దారి మళ్లింపు చర్యలు అమల్లో ఉంటాయని చెప్పారు. మానేరు జలాశయ సమీపంలో ఉన్న క్రీడా పాఠశాల మైదానం, శాతవాహన విశ్వవిద్యాలయం, ఐటీ టవర్స్‌ ప్రాంతం, కొండ సత్యలక్ష్మి గార్డెన్స్, లక్ష్మి వేంకటేశ్వర దేవాలయం సమీపంలోని స్థలాల్లో వాహనాలను నిలుపుదలకు కేటాయించినట్లు చెప్పారు. భారీ వాహనదారులు ఈ దారి మళ్లింపు చర్యలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. అదే రోజు పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించిన అర్హత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం వేళ పరీక్ష ముగిసిన తర్వాత ఎటూ వెళ్లకుండా సదరు కేంద్రాల్లోనే ఉండి, దారి మళ్లింపు చర్యలు ముగిసిన తర్వాత ప్రయాణాలను కొనసాగించాలని సూచించారు.

 పెద్దపల్లి, గోదావరిఖని: పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల మీదుగా వచ్చే వాహనాలు బద్దం ఎల్లారెడ్డి విగ్రహం, మైసూర్‌ బేకరి మీదుగా సభావేదికకు చేరుకునే కట్టరాంపూర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశంలో వాహనాలను నిలపాలి. హైదరాబాద్, వరంగల్‌: హైదరాబాద్, వరంగల్‌ ప్రాంతాల నుంచి సభా వేదిక వద్దకు వచ్చే వాహనాలు ఎన్‌టీఆర్‌ విగ్రహం, బద్దం ఎల్లారెడ్డి విగ్రహం, మైసూర్‌ బేకరీల మీదుగా చేరుకొని కట్టరాంపూర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశంలో వాహనాలను నిలపాలి.
 
చొప్పదండి, మంచిర్యాల: చొప్పదండి, మంచిర్యాల మార్గాల ద్వారా సభా వేదికకు చేరుకునే వాహనాలు నాఖాచౌరస్తా, పెద్దపల్లి ఫ్లైఓవర్, బద్దం ఎల్లారెడ్డి విగ్రహం, మైసూర్‌ బేకరీల మీదుగా సభా వేదికకు చేరుకుని కట్టరాంపూర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశంలో వాహనాలను నిలపాలి.

 సిరిసిల్ల, వేములవాడ: సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు చింతకుంట క్రాస్‌రోడ్డు, సిరిసిల్ల, బైపాస్, రాంచంద్రాపూర్‌కాలనీ మీదుగా సభా వేదికకు చేరుకుని కట్టరాంపూర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రాంతాల్లో వాహనాలు నిలపాలి.

 జగిత్యాల: నిజామాబాద్, జగిత్యాల ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు రేకుర్తి, శాతవాహన విశ్వవిద్యాలయం, చింతకుంట క్రాస్‌రోడ్, పద్మనగర్‌ బైపాస్, రాంచంద్రాపూర్‌ కాలనీ మీదుగా సభావేదికకు చేరుకోవాలి. కట్టరాంపూర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశంలో వాహనాలను నిలపాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top