ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి | all set for intermediate exams | Sakshi
Sakshi News home page

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Mar 11 2014 4:39 AM | Updated on Sep 2 2017 4:33 AM

ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 62,898 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

 ఖమ్మం, న్యూస్‌లైన్ :
 ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 62,898 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం 93 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 11,390 బాలురు, 13,249 మంది బాలికలు మొ త్తం 24,639 మంది, ఒకేషనల్ విభాగంలో బాలురు 1859 మంది, బాలికలు 1468 మంది పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 11,782 మంది, బాలికలు 12, 426 మంది మొత్తం 24,208 మంది రెగ్యులర్ విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం ప్రైవేట్‌గా బాలురు 2,786 మంది, బాలికలు 2,085 మంది మొత్తం 4,872 పరీక్షలకు హాజరు కానున్నారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్సులో రెగ్యులర్ అభ్యర్థుల్లో బాలురు 2913 మంది, బాలికలు 2723 మంది మొత్తం 4,736 మంది ఉండగా ఇదే విభాగంలో ప్రైవేట్ అభ్యర్థులు బాలురు 524 మంది, బాలికలు 592 మంది మొత్తం 1116 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల
 వరకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
 
 పరీక్షలకు సర్వం సిద్ధం: ఆర్‌ఐవో
 ఇంటర్ మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని ఆర్‌ఐవో విశ్వేశ్వర్‌రావు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 93 సెంటర్ల ద్వారా 62,898 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వాజేడు, ఏపీటీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల గుండాల, జీజేసీ గుండాల, జీజేసీ పినపాక, జీజేసీ ఏన్కూరు, జీజేసీ చర్ల, జీజేసీ గార్ల, జీజేసీ కూనవరం, జీజేసీ పాల్వంచ, జీజేసీ వీఆర్‌పురం, జీజేసీ నాగులవంచ, జీజేసీ వేలేరుపాడు, జీజేసీ బూర్గంపాడు, జీజేసీ దుమ్ముగూడెం, జీజేసీ కామేపల్లి  సెంటర్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని వివరించారు. ఆ సెంటర్లలో పరీక్షలు సజావుగా నిర్వహించేం దుకు అదనపు ఉద్యోగులను నియమించామని చెప్పారు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగానే విద్యార్థులు హాల్‌లోకి వెళ్లాలని సూచించారు. ఉదయం 8:45 నుంచి 8: 59 మధ్య వచ్చిన వారు ఆలస్యానికి కారణం తెలుపుతూ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల్లో ఏ ఇద్దరు ఒకే కళాశాల వారై ఉండరాదన్నారు. సెంటర్‌కు కనీసం 300 మీటర్ల పరిధిలో సెల్‌ఫోన్‌లు నిషేధిస్తున్నామని తెలిపారు. దీనిని పసిగట్టేందుకు జీసీఎస్, జీపీఆర్ యంత్రాలను అమర్చుతున్నామని చెప్పారు.
 
  ఇన్విజిలేటర్ల కోసం అన్వేషణ...
 పరీక్షల నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్ల కోసం జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. రోజుకు సుమారు 28 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా, ఇందుకోసం కనీసం 1400 మంది ఇన్విజిలేటర్లు అవసరం. అయితే జూనియర్ కళాశాలల పరిధిలో పనిచేసే అధ్యాపకులు 400 మంది మాత్రమే ఉండటంతో మిగిలిన వారికోసం ప్రభుత్వ పాఠశాలల ఉపాద్యాయులను ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే ఎన్నికల డ్యూటీ, టెట్ పరీక్షల కసరత్తు, పదో తరగతి విద్యార్థులకు బోధన వంటి పనులతో బీజీగా ఉన్న ఉపాధ్యాయులకు ఇంటర్ డ్యూటీలు వేయడం కుదరదని డీఈవో ఇంటర్ బోర్డు అధికారులకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. అయితే ఉపాధ్యాయులను తప్ప మిగిలిన వారికి డ్యూటీలు వేయలేమని ఆర్‌ఐవో జిల్లా విద్యాశాఖ అధికారికి వివరించడంతో ఇంటర్ డ్యూటీల కోసం ఉపాధ్యాయులను అనుమంతించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement