కోరలు చాస్తున్న కాలుష్యం | Air Pollution increasing every year in Greater Hyderabad | Sakshi
Sakshi News home page

కోరలు చాస్తున్న కాలుష్యం

Jul 30 2018 1:05 AM | Updated on Jul 30 2018 2:24 AM

Air Pollution increasing every year in Greater Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సూక్ష్మ ధూళికణాల కాలుష్యంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏటేటా పెరుగుతోన్న వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులు, ఇతర శ్వాసకోశ వ్యాధులతో నగరవాసులు సతమతమవుతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ ధూళికణాల మోతాదు 15 మైక్రోగ్రాములకు మించరాదు.

కానీ మహానగరంలో ఘనపు మీటరు గాలిలో 2016లో 40, 2017లో 49, 2018 జూన్‌ నాటికి 52 మైక్రోగ్రాముల మేర నమోదవడం గమనార్హం. ఈ సూక్ష్మ ధూళికణాలు తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా మోటారు వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యంతోనే గాలిలో సూక్ష్మ ధూళికణాలు పెరుగుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం.

కాలుష్యానికి కారణాలివే..
ప్రధానంగా మోటారు వాహనాల నుంచి వెలువడుతోన్న పొగ ద్వారా 50% సూక్ష్మ ధూళికణాలు గాలిలో చేరుతున్నాయని  నివేదిక వెల్లడించింది.
   మరో 11 శాతం రహదారులపై ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళి కారణం.  
   చెత్తను బహిరంగంగా తగలబెడుతుండడంతో 7 శాతం సూక్ష్మ ధూళికణాలు వెలువడుతున్నాయి.
 పరిశ్రమల నుంచి వెలువడుతోన్న పొగ, ఇతర ఉద్గారాల కారణంగా మరో 33 శాతం
 గ్రేటర్‌ పరిధిలో సుమారు 50 లక్షలకు పైగా ఉన్న వాహనాలు విడుదల చేస్తున్న పొగ, రహదారులపై రేగుతున్న దుమ్ము.
   శివారు ప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో, గాలిలో సూక్ష్మ ధూళికణాలు పెరిగి, సమీప ప్రాంత వాసుల ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి.  
 బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజగుట్ట, కూకట్‌పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్‌ ప్రాంతాల్లో వాయుకాలుష్యం శృతిమించుతున్నట్లు తేలింది.  
 ఆయా కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు వెల్లడైంది.
 బాలానగర్, ఉప్పల్‌ ప్రాంతాల్లో ఏడాదికి 200 రోజులకు పైగా కాలుష్య ఉధృతి ఉన్నట్లు తేలింది.  
 గ్రేటర్‌ పరిధిలోని 50 లక్షల వాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది.
 గ్రేటర్‌ పరిధిలో పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ రోడ్లను ముంచెత్తుతుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
♦  వాహనాల సంఖ్య లక్షలు దాటినా, గ్రేటర్‌లో 10 వేల కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ  పెరిగి సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కి పడిపోతుంది. ఇదే తరుణంలో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది.  
వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్బన్‌ మోనాక్సైడ్, నైట్రోజన్‌ డయాక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్, అమ్మోనియా, బెంజీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం (ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి.

ధూళి కాలుష్యంతో అనర్థాలివే..
 పీఎం10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ ధూళి రేణువులు పీల్చే గాలిద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి  శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి.
    చికాకు, అసహనం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.
 తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతుంది.
 ధూళి కాలుష్య మోతాదు  పెరుగుతుంటే ఊపిరితిత్తుల కేన్సర్లు పెరిగే ప్రమాదం ఉంది.
 ముఖానికి, ముక్కుకు మాస్క్‌లు, కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా ఆర్‌ఎస్‌పీఎం వల్ల కలిగే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement