ఓట్ల కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారు | Sakshi
Sakshi News home page

ఓట్ల కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారు

Published Mon, Sep 29 2014 12:30 AM

ఓట్ల కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారు

‘హైదరాబాద్ కా ముక్తి సంఘర్ష్’ పుస్తకావిష్కరణ సభలో కిషన్‌రెడ్డి
 
హైదరాబాద్: కొందరు నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారని టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆర్య ప్రతినిధిసభ ఆధ్వర్యంలో డాక్టర్ ఆనంద్ రాజ్ వర్మ హిందీలో రాసిన ‘హైదరాబాద్ కా ముక్తి సంఘర్ష్’ పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ కాచిగూడలోని నరేంద్ర భవన్‌లో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల వల్లే సెక్యులరిజం ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తరువాత కూడా మన దేశంలో రజాకార్ల వారసత్వం కొనసాగుతోందని ఆరోపించారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్యసమాజ్ చేసిన ఉద్యమంతోనే హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొన్నారు. ‘హైదరాబాద్  కా ముక్తి సంఘర్ష్’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదిస్తే అందుకు అవసరమైన సహాయం అందిస్తానని కిషన్‌రెడ్డి హామీనిచ్చారు.

ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఆ రోజుల్లో ఉర్దూ మాట్లాడే వారు హైదరాబాద్ రాష్ట్రంలో తక్కువగా ఉన్నా ముస్లింలదే రాజ్యాధికారమన్నారు. వచ్చే సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండిత్ నరేంద్ర విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సీహెచ్ రాజేశ్వరరావు, బి.నర్సింగరావు, అగర్వాల్ బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్, ఆర్య ప్రతినిధి సభ ప్రతినిధులు డాక్టర్ టి.వి.నారాయణ, విఠల్‌రావు ఆర్య, హరికిషన్ వేదాలంకార్, లక్ష్మణ్ సింహా తదితరులు పాల్గొన్నారు.   
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement