ఒకే కాంట్రాక్టర్‌కు 4,769 పనులు!  

4,769 Works For A Single Contractor - Sakshi

నామినేషన్లపై అప్పగించిన  దక్షిణ డిస్కం

పనుల విలువ  రూ. 30 కోట్లకు పైనే

ఒకే పనికి వేర్వేరు రేట్లతో అడ్డగోలుగా అంచనాలు

100–700% అధిక రేటుతో బిల్లుల చెల్లింపు.. ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లను పాటించని అధికారులు 

మెదక్‌ జిల్లా తూప్రాన్‌లోని 2 ట్రాన్స్‌ఫార్మర్లకు 1,458 చ.అ. కంచె ఏర్పాటు కోసం 2018 మార్చిలో చదరపు గజానికి రూ.56 ధర తో రూ. 81,648 బిల్లులను కాంట్రాక్టర్‌కు చెల్లించారు. 

మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజలో రెండు ట్రాన్స్‌ఫార్మర్లకు 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 జూలైలో చదరపు అడుగుకు రూ. 125 ధరతో కాంట్రాక్టర్‌కు రూ. 71,750 చెల్లించారు. 

సిద్దిపేటలోని కల్వకుంట్ల కాలనీలో రెండు ట్రాన్స్‌ఫార్మర్లకు 290 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 నవంబర్‌లో చదరపు అడుగుకు రూ. 284 ధర చొప్పున కాంట్రాక్టర్‌కు రూ. 82,360 చెల్లించారు. 

పరిగిలోని గొండుగొనపల్లి, డి.ఎంకెపల్లిలో రెండు ట్రాన్స్‌ఫార్మర్లకు 220 చదరపు అడుగుల కంచె కోసం 2018 ఫిబ్రవరిలో చదరపు అడుగుకు రూ. 384 ధరతో కాంట్రాక్టర్‌కు రూ. 84,840 చెల్లించారు. 

నామినేషన్‌ విధానంలో ఈ నాలుగు పనులన్నింటినీ ప్రదీప్‌ ఎలక్రి్టకల్స్‌ అనే కాంట్రాక్టు సంస్థ దక్కించుకోవడం గమనార్హం. 2010–20 మధ్య ఈ ఒక్క సంస్థకే టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులు రూ. 30.69 కోట్లకుపైగా విలువజేసే 4,769 పనులు అప్పగించారు. 

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ఏర్పాటు చేసే రక్షణ కంచెల పనుల్లో జరుగుతున్న దోపిడీ బట్టబయలైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) అధికారులు కొన్నేళ్లుగా కాంట్రాక్టర్లకు యథేచ్ఛగా దోచిపెడుతున్న వైనం ఫేస్‌బుక్‌ లైవ్‌ వేదికగా వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద కంచెల ఏర్పాటుకు ఒక్కో ప్రాం తంలో ఒక్కో ధరతోపాటు ఒక్కో పని పరిమాణం తో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులు అంచనాలు తయారు చేసి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారంటూ టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అదనపు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఏడీఈ) కోటేశ్వర్‌రావు బహిర్గతం చేశారు. జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఏడీఈగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఆయన మంగళవారం ఫేస్‌బుక్‌ లైవ్‌ నిర్వహించి టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో జరుగుతున్న అక్రమాలను అధికారిక పత్రాలతో సహా ప్రజల ముందుంచారు. బుధవారం రాత్రి వరకు దాదాపు 2లక్షల మంది ఈ వీడియోను వీక్షిం చడంతోపాటు వేల మంది షేర్‌ చేయడంతో ఇది ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది.

యాజమాన్యం అండదండలతోనే... 
వికారాబాద్, మెదక్, జోగిపేట, సిదిపేట, సంగా రెడ్డి డివిజన్ల పరిధిలో ప్రదీప్‌ ఎలక్ట్రికల్స్‌ ఏజెన్సీకి నామినేషన్ల విధానంలో 4,769 పనులు అప్పగించా రని అధికారిక సాక్ష్యాలతో కోటేశ్వర్‌రావు బయటపెట్టారు. ఎస్‌ఈగా రిటైరైన ఓ అధికారి, మరో నలు గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ట్రాన్స్‌ఫార్మర్లకు కంచె ఏర్పాటు వంటి పనులకు తప్పనిసరిగా టెండర్లు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. అయితే సంస్థ యాజమాన్యం అండదండలతోనే ఈ అక్రమాలు జరిగా యన్నారు.

రూ.లక్షలోపు అంచనాలు కలిగిన పను లుచేసే ఒక చిన్న కాంట్రాక్టర్‌ ఒకే డివిజన్‌ పరిధిలో పనిచేయడం సాధ్యమని, అతడికి నాలుగు డివిజన్ల పరిధిలో పనులెలా అప్పగించారని ఆయన ప్రశి్నస్తున్నారు. ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రబ్యూషన్‌ బడ్జెట్‌ పేరుతో కేటాయించే అత్యవసర వినియోగం నిధు ల్లో సింహభాగం అధికారులు, కాంట్రాక్టర్ల జేబు ల్లోకి చేరుతున్నాయని అన్నారు. పనులు ఏమాత్రం చేయకున్నా, పాక్షికంగా చేసినా పూర్తిగా బిల్లులు చెల్లించినట్లు తన వద్ద ఆధారాలున్నాయన్నారు. విద్యుత్‌ సంస్థలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తాను ఫేస్‌బుక్‌ లైవ్‌ నిర్వహించానని వెల్లడించారు. అక్రమాలను నిరోధించడంలో యాజమాన్యం విఫ లంకావడంతో విద్యుత్‌ చార్జీల పెంపు అనివార్యం గా మారి పేదలు నష్టపోవాల్సి వస్తోందన్నారు.

700 శాతం వరకు రేట్ల పెంపు... 
కోటేశ్వర్‌రావు సాక్ష్యాలతో చూపిన ఆధారాల్లో అత్య ల్పరేటు అయిన రూ. 56తో పోలిస్తే 700 శాతం అధిక రేటు అయిన రూ. 384తో అంచనాలు అధికారులు రూపొందించారు. ఇలా 100% నుంచి 700% వరకు రేట్లను అడ్డగోలుగా పెంచారు. అంచనాల తయారీలో ప్రామాణిక ధరల పట్టిక (ఎస్‌ఎస్‌ఆర్‌) రేట్లను పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించారు. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ మహా అయితే 120 చ.అ. కంచె ఏర్పాటు చేస్తారు. కానీ ప్రదీప్‌ ఎలక్రి్టకల్స్‌ చేపట్టిన పనులను పరిశీ లిస్తే 2 ట్రాన్స్‌ఫార్మర్లకు కలిపి ఒకచోట 1,458 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు, మరోచోట 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు అధికారులు బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది.

 హైకోర్టులో కేసు... 
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో జరిగిన అక్రమాలపై రాష్ట్రపతి, ప్రధాని,  సీబీఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్, కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ, సీఎంకు ఫిర్యాదు చేయడంతోపాటు రాష్ట్ర హైకోర్టులో సైతం కోటేశ్వర్‌రావు కేసులు వేశారు. ఇవి త్వరలో విచారణకు రానున్నాయని ఆయన చెప్పారు. కాగా, కోటేశ్వర్‌రావు సీఎంవోకు చేసిన ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరుగుతోందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ప్రజా సంబంధాల విభాగం వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top