వికటించిన ‘మధ్యాహ్నం’

44 Members Students Illness With Midday Meal in Nagarkurnool - Sakshi

44మంది విద్యార్థులకు అస్వస్థత

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రికి తరలింపు

ఐదుగురి పరిస్థితి విషమం

విచారణకు కలెక్టర్‌ ఆదేశం

విద్యార్థులను పరామర్శించిన జెడ్పీ చైర్‌పర్సన్, డీఈఓ

పెద్దకొత్తపల్లి/ నాగర్‌కర్నూల్‌: ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 44మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని చంద్రకల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 144 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 125 మంది గురువారం పాఠశాలకు హాజరై ఎప్పటిలాగే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మూడు గంటలకు 44 మందికి తీవ్ర కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. ఇది గమనించిన హెచ్‌ఎం శ్రీనివాసులు వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, వీరిలో పదో తరగతి విద్యార్థులు మానస, ప్రేమలత, మంజుల, లక్ష్మి, వంశీలకు పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఇదిలాఉండగా అధికారుల పర్యవేక్షణలోపం, నాసిరకమైన మధ్యాహ్న భోజనం అందించడం వల్లే ఇలా జరిగిందని విద్యార్థులు ఆరోపించారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి, డీఈఓ గోవిందరాజులు అక్కడికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ జరిపి త్వరలోనే బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు. దీనిపై హెచ్‌ఎం శ్రీనివాసులును వివరణ కోరగా రోజూలాగే వంట ఏజెన్సీ మహిళలు తయారుచేసిన వంకాయ కూరతో కూడిన మధ్యాహ్న భోజనం అందించామన్నారు. ఈ కూరలో ఏమైనా కలిసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

నాసిరకం భోజనమే కారణమా..?  
విద్యార్థుల అస్వస్థతకు నాసిరకం మధ్యాహ్న భోజనమే కారణమని స్థానికులు ఆరోపించారు. మండలంలోని చంద్రకల్‌ ఉన్నత పాఠశాలలో గురువారం కలుషిత మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థుల్లో 44మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చేర్పించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

పరామర్శించిన నేతలు
విషయం తెలుసుకున్న జిల్లా జెడ్పీచర్మన్‌ పెద్దపల్లి పద్మావతి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీపీ సూర్యప్రతాప్‌ గౌడ్, జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్మన్‌ విష్ణు తదితరులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యపరిస్థితి విషమించిన విద్యార్థులకు మైరుగైన వైద్యం అందించాలని కోరారు.  

విచారణకు ఆదేశించిన కలెక్టర్‌ 
చంద్రకల్‌ ఉన్నత పాఠశాలలో కలుషిత మధ్యాహ్న భోజనం చేసి అస్వస్థతకు గురైన విద్యార్థులను  ఆసుపత్రిలో కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని డీఈఓను ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top