నేను.. మా మమ్మీ, డాడీ! 

43 childrens was already adopted in the state - Sakshi

శిశుగృహ చిన్నారులను దత్తత తీసుకుంటున్న విదేశీయులు 

తొలిసారిగా విదేశాలకు వెళ్తున్న అనాథ శిశువులు

దత్తత కోరుకునే వారికి కలిసొస్తున్న ఆన్‌లైన్‌ అడాప్షన్‌ 

రాష్ట్రంలో ఇప్పటికే 43 మంది పిల్లల దత్తత 

సాక్షి, హైదరాబాద్‌: ఫ్రాంక్‌ ఆంటోనీ–పమేలా దంపతులది అమెరికాలోని న్యూజెర్సీ. ఉన్నత కుటుంబానికి చెందిన ఆంటోనీ–పమేలా వ్యాపార రంగంలో ఉంటూ ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. కానీ వారికి సంతానం కలగలేదు. పిల్లలు లేక మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరు.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ శిశు గృహంలోని ఓ మూడేళ్ల బాలికను దత్తత తీసుకున్నారు. 

ఇలాంటి దంపతులు ఎందరో.. శిశుగృహాల్లోని పిల్లలు ఇప్పుడు విదేశాలకు దత్తతకు వెళ్తున్నారు. రాçష్ట్రంలో ఇప్పటికి 43 మంది పిల్లలు ఇలా దత్తత తీసుకోవడంతో విదేశాలకు వెళ్లారు. అనాథ శిశువులను దత్తత తీసుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ దత్తత కార్యక్రమం ఎల్లలు దాటిపోతోంది. ప్రపంచం నలుమూలల నుంచి చిన్నారులను దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పిల్లల దత్తత ప్రక్రియలో ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి చెందిన పిల్లలను విదేశీ యులు దత్తత తీసుకుంటున్నారు. అమెరికా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఇంగ్లండ్‌కు చెందిన కుటుంబాలు మన రాష్ట్రంలోని పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. డెన్మార్క్‌ దేశానికి చెందిన మార్టిన్‌ దంపతులు నల్లగొండ జిల్లాకు చెందిన బాలికను దత్తత తీసుకున్నారు. 

నిబంధనలు మార్చాక ఇలా.. 
దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్న అనాథ చిన్నారులను అయినా దత్తత తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. దీని కోసం ప్రత్యేకంగా సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ(కారా) వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. దత్తత తీసుకోవాలనుకునే వారు ఈ వెబ్‌సైట్‌ విధానంతోనే ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. దీంట్లోనూ స్వదేశం(ఇన్‌ కంట్రీ), విదేశీ(ఇంటర్‌ కంట్రీ) పేరుతో రెండు విధానాలున్నాయి. స్వదేశీ విధానంతో భారతీయులు, రెండో విధానంతో విదేశీయులు మన దేశంలోని పిల్లలను దత్తత తీసుకోవచ్చు. మన దేశంలోని అనాథ పిల్ల లను విదేశీయులు దత్తత తీసుకునేందుకు రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ప్రభుత్వ సంస్థలలోని పిల్లలను దత్తత తీసుకునేందుకు మన దేశీయులు ఎవరూ సుముఖత వ్యక్తం చేయని సందర్భాల్లో రెండో ఆప్షన్‌ కింద విదేశీ దత్తత కేటగిరీలోకి మారుస్తారు. దీనికి 90 రోజులు గడువు ఉంటుంది.

ఇది పూర్తయిన తర్వాత ఆ పిల్లలను దత్తత తీసుకునేందుకు ఆసక్తి కనబర్చిన విదేశీయులు ‘కారా’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అక్కడి ఏజెన్సీలు దత్తతకు దరఖాస్తు చేసుకున్న కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయి. పిల్లల పెంపకానికి ఇబ్బంది లేదని నిర్ధారించిన అనంతరం దత్తత ప్రక్రియ పూర్తవుతుంది. అలాగే స్వదేశీ దత్తత మార్గదర్శ కాల మేరకు దత్తత పొందేందుకు దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాలు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దంపతుల సొంత రాష్ట్రంతోపాటు మరో రెండు రాష్ట్రాలను ఎంపిక చేసుకోవచ్చు. మొత్తంగా మూడు రాష్ట్రాల నుంచి పిల్లలను ఎంపిక చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పద్ధతితో జాప్యం లేకుండా గరి ష్టంగా 30 రోజులలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పాత నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలంటే కనీసం ఏడాదిన్నరపాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top