అంతంకాదిది.. ఆరంభమే..

30 Days Plan Is Not An End It Is Just Begining Says Collector RV Karnan - Sakshi

సాక్షి, ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక నెల రోజులతోనే అంతం కాదని.. ఇది ఆరంభం మాత్రమేనని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. గ్రామ పంచాయతీల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై పనులను గుర్తించడం.. పరిష్కరించడం.. కొనసాగించడంపై నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికతో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. జిల్లాలో డీఆర్‌డీఏ ద్వారా నిరంతరం పనులు కొనసాగించాలని సూచించారు. సర్పంచ్‌తో సహా అంతా ఐక్యంగా ఉండి.. కలిసికట్టుగా పనిచేస్తే గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చో నిరూపించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు గ్రామ పంచాయతీ నిధులను పెంపొందించేందుకు వందశాతం పన్నులు వసూలు చేయాలని సూచించారు. ఉపాధిహామీ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు.

ప్రతి బుధవారం మండల స్థాయిలో జరిగే సమావేశానికి సర్పంచ్‌లు సైతం హాజరయ్యేలా సర్క్యులర్‌ జారీ చేయాలని డీఆర్‌డీఓను ఆదేశించారు. 584 గ్రామ పంచాయతీల్లో.. 100 జీపీల్లో డంపింగ్‌ యార్డులు ఉంటే.. ఇప్పటికే సుమారు 500 డంపింగ్‌ యార్డులకు స్థలాలను గుర్తించామన్నారు. అదే విధంగా 75 శ్మశాన వాటికలు ఉంటే, ప్రస్తుతం 520 శ్మశాన వాటికలకు స్థలాలు గుర్తించినట్లు తెలిపారు. హరితహారం కింద మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాలని సూచించారు. అన్ని గ్రామాల్లో యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి పనులను కొనసాగించాలన్నారు. జిల్లాలో త్వరలో రాష్ట్రస్థాయి నుంచి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు సందర్శిస్తాయని, ఎక్కడైనా తప్పులు దొర్లితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇన్‌చార్జ్‌ డీపీఓ హన్మంతు కొడింబా మాట్లాడుతూ 30 రోజులుగా అభివృద్ధి పనులు ముమ్మరంగా చేశారన్నారు. మరో నెల రోజులు కూడా వాటిని కొనసాగించేందుకు యాక్షన్‌ ప్లాన్‌పై అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల్లో సర్పంచ్‌తోపాటు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి గుణాత్మక మార్పును తీసుకొచ్చారన్నారు. ప్రతి జీపీ నుంచి అధికారులు సమర్పించిన వివరాలను ఎంపీడీఓ, స్పెషల్‌ ఆఫీసర్లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు సందర్శించి.. ఇవన్నీ సరైన వివరాలే అని నిర్ధారించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారని, ఈ వివరాలు రాష్ట్రస్థాయి వరకు ఉంటాయని, ఏమైనా తప్పులు దొర్లితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

సమావేశంలో సర్పంచ్‌ల ఆవేదన  
కాగా.. సర్పంచ్‌లు తమ ఆవేదనను కలెక్టర్‌ కర్ణన్‌ ఎదుట వెలిబుచ్చారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పనులు చేయాలని ఆదేశించారని.. మేం క్షేత్రస్థాయిలో పనులు చేస్తుంటే నగదు అందించడం లేదని వాపోయారు. విద్యుత్‌ శాఖాధికారులు పూర్తిస్థాయిలో పనులు చేయడం లేదని, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికకు సంబం«ధించిన స్థలాల అంశం, ఒక ప్రాంతంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌లు వేర్వేరుగా పనులు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారనే తదితర సమస్యలను వెలిబుచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ కర్ణన్‌ సమన్వయంతో ముందుకెళ్తే సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. 

సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి బి.ప్రవీణ, డీఆర్‌డీఓ ఇందుమతి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ రమేష్‌ జెడ్పీ సీఈఓ ప్రియాంక, విద్యుత్‌ శాఖ డీఈ రామారావు, డివిజనల్‌ పంచాయతీ అధికారి పుల్లారావు, ఫ్లయింగ్‌ స్క్వాడ్, సర్పంచ్‌లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top