అటవీ ప్రక్షాళన 

200 Officers Transferred In Telangana Forest Department - Sakshi

200 మంది అధికారుల బదిలీ.. 11 మందిపై సస్పెన్షన్‌

పనితీరు సరిగ్గా లేనివారికి మెమోలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అటవీశాఖ భారీ బదిలీలకు శ్రీకారం చుట్టింది. అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కఠినంగా వ్యవహరించే నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించేందుకు చర్యలు చేపట్టింది. దాదాపు 200 మంది అధికారులను బదిలీ చేసింది. అడవుల సంరక్షణ, అటవీ భూముల్లో చెట్ల పెంపకంపై చిత్తశుద్ధి చూపించే అధికారులను ముఖ్యమైన ప్రాంతాల్లో నియమించింది. జంగిల్‌ బచావో–జంగిల్‌ బడావో నినాదంతో అడవుల సంరక్షణ, అటవీ భూముల్లో అడవి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఇటీవలే సీఎం ఆదేశించారు. అడవిని రక్షించే బాధ్యతను అంకితభావం కలిగిన అధికారులకు అప్పగించాలని స్పష్టంగా చెప్పారు. ఎక్కువ మంది అధికారులు హైదరాబాద్‌లో ఉండటం కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు అటవీ శాఖ సంస్కరణలు ప్రారంభించింది. ముఖ్యమైన ప్రాంతాల్లో మంచిపేరున్న అధికారులను నియమించడం, స్మగ్లర్లకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నవారికి మెమోలు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టింది. 

చీఫ్‌ కన్సర్వేటర్‌ నుంచి బీట్‌ ఆఫీసర్‌ వరకు.. 
అడవులను సంరక్షించడంలో మంచి పేరున్న అధికారులను అటవీశాఖ ముఖ్య ప్రాంతాల్లో నియమించింది. దీంతో చీఫ్‌ కన్సర్వేటర్‌ నుంచి బీట్‌ ఆఫీసర్‌ వరకు దాదాపు 200 మంది బదిలీ అయ్యారు. ఈ బదిలీల ఫైలుపై సీఎం కేసీఆర్‌ మంగళవారం సంతకం చేశారు. జిల్లా అటవీ అధికారులుగా పనిచేస్తున్న చీఫ్‌ కన్సర్వేటర్లు, కన్సర్వేటర్లు, డీఎఫ్‌వో స్థాయి కలిగిన 21 మందికి ముఖ్యమైన జిల్లాల బాధ్యతలు అప్పగించారు. చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఏకే సిన్హాకు అచ్చంపేట బాధ్యతలను, కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ హోదా కలిగిన శర్వానంద్, వినోద్‌ కుమార్‌లకు మెదక్, కవ్వాల్‌ బాధ్యతలు అప్పగించారు.
 
ఆ ప్రాంతాలకు కొత్త డీఎఫ్‌వోలు..  
మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, పాల్వంచ, కిన్నెరసాని, వరంగల్, ఖానాపూర్, అమ్రాబాద్, బాన్సువాడ, ఇల్లందు, కాగజ్‌నగర్, ఇచ్చోడకు కొత్త డీఎఫ్‌వోలను నియమించారు. 19 మంది రేంజ్‌ ఆఫీసర్లను మార్చారు. మహబూబాబాద్, గూడూరు, గంగారం, బయ్యారం, ఆజంనగర్, పెద్దపల్లి, నర్సంపేట, మంచిర్యాల, డోర్నకల్, కరీంనగర్, కొత్తగూడెం, కెరమెరి, బెల్లంపల్లి, తిర్యాని, గాంధారి, బాన్సువాడ, పిట్లం, నాగిరెడ్డిపేట, దూలపల్లికి కొత్త రేంజ్‌ అధికారులను నియమించారు. ఫారెస్టర్లు, బీట్‌ ఆఫీసర్లు కలిపి 160 మందిని బదిలీ చేశారు.  

11 మందిపై సస్పెన్షన్‌ వేటు... 
అడవులను రక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, స్మగ్లర్లకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో పలువురిపై అటవీశాఖ చర్యలు తీసుకుంది. స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే అభియోగాలతో అటవీశాఖ ఇటీవల 11 అటవీ అధికారులను సస్పెండ్‌ చేసింది. సస్పెండైన వారిలో ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ స్థాయి నుంచి గార్డుల వరకు ఉన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి మెమోలు కూడా జారీ చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top