100 టీఎంసీలు కావాలి

100 TMC Of Water Needs To The State - Sakshi

సాగర్, శ్రీశైలం కింది తాగు, సాగు అవసరాలకు తెలంగాణ అంచనా

ప్రాజెక్టుల్లో ఉన్న లభ్యత నీటిలో తెలంగాణకు 175 టీఎంసీల వాటా దక్కే అవకాశం

రేపు కృష్ణా బోర్డు భేటీలో నిర్ణయం

ఎజెండాలో మరిన్ని అంశాలు చేర్చాలని కోరిన రాష్ట్రం

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద ఈ ఏడాది యాసంగి సీజన్‌లో రాష్ట్ర తాగు, సాగు నీటి అవసరాలకు 100 టీఎంసీల మేర అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. నాగార్జునసాగర్‌ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించడంతో అక్కడి అవసరాలు,ఏఎంఆర్‌పీ, హైదరాబాద్‌ తాగునీరు, కల్వకుర్తికి కలిపి ఈ నీళ్లు సరిపోతాయని తేల్చింది. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న దృష్ట్యా బోర్డు నుంచి అభ్యంతరాలు ఉండబోవని భావిస్తోంది.

లభ్యత పుష్కలం..
సాగర్‌కింద ఈ యాసంగిలో 6.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. గతేడాది పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరిచ్చిన సందర్భాల్లోనూ 45 నుంచి 50 టీఎంసీల నీటిని ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిన విడుదల చేశారు. ఈ ఏడాది సైతం 50 టీఎంసీల నీటితో సాగు అవసరాలు తీర్చవచ్చని నీటి పారుదల శాఖ లెక్కలేస్తోంది. ప్రస్తుతం సాగర్‌లో 312 టీఎంసీలకు గానూ 294.55 టీఎంసీల లభ్యత ఉంది. ఇందులో తెలంగాణకు దక్కే వాటాల్లోంచి సాగర్‌కు అవసరమయ్యే నీటి విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇక సాగర్‌ కిందే ఏఎంఆర్‌పీ ఎస్‌ఎల్‌బీసీ కింద 2.80లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించగా, దీని అవసరాలకు మరో 20 టీఎంసీ, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు మరో 10 టీఎంసీలు అవసరం పడతాయని అంచనా వేస్తున్నారు.

సాగర్‌ కిందే మొత్తంగా 80 టీఎంసీలకు అవసరం ఉంటోంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ కల్వకుర్తికింద 1.80 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వనున్నారు. దీనికి, తాగునీటి అవసరాలకు కలుపుకొని మొత్తంగా 20 టీఎంసీలు శ్రీశైలం నుంచి తీసుకో నున్నారు. శ్రీశైలంలోనూ 215 టీఎంసీలకు గానూ 182.61 టీఎంసీల లభ్యత ఉంది. మొత్తం రెండు ప్రాజెక్టుల్లోనూ ఉన్న నీటి లభ్యతలోంచి తెలంగాణకు ఇప్పటివరకు వినియోగించిన వాటా, ఇకపై వినియోగించే వాటాలు కలిపి గరిష్టంగా 175 టీఎంసీల వాటా దక్కే అవకాశం ఉందని ఇరు రాష్ట్రాలకు రాసిన లేఖలో కృష్ణా బోర్డు పేర్కొంది. ఈ వాటాల్లోంచే 100 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించనుండగా, మిషన్‌ భగీరథతో పాటు జిల్లాల తాగునీటి అవసరాలకు మరింత నీటిని వినియోగించుకునే వెసులుబాటు తెలంగాణకు ఉండనుంది.

ఎజెండాలో మళ్లింపు జలాలను చేర్చిన రాష్ట్రం..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వచ్చే జూన్‌ వరకు నీటి కేటాయింపులకు సంబంధించి చర్చించేందుకు ఈనెల 3న మంగళవారం కృష్ణాబోర్డు భేటీ కానుంది. బోర్డు భేటీలో నీటి కేటాయింపులతో పాటు, కార్యాలయాన్ని అమరావతికి తరలింపు, బడ్జెట్‌ కేటాయింపులు, వర్కింగ్‌ మాన్యువల్, ఇతర అంశాలపై ఇందులో చర్చిద్దామని ప్రతిపాదించింది. ఇందులో పట్టిసీమ, పోలవరం ద్వారా మళ్లిస్తున్న జలాల్లో తెలంగాణకు దక్కే వాటా, తాగునీటికి కేటాయిస్తున్న నీటిలో వినియోగాన్ని కేవలం 20%గా మాత్రమే పరిగణించాలన్న అంశాలను చేర్చాలని కోరుతూ తెలంగాణ బోర్డును కోరింది. దీనికి బోర్డు అంగీకరించింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top