breaking news
-
TS: సీఎం రేవంత్‌కు కడియం సవాల్
సాక్షి,వరంగల్: సీఎం రేవంత్ రెడ్డి వేదిక ఏదైనా సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఆయన భాష జుగుప్సాకరంగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. బుధవారం వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం మాట్లాడుతున్న భాషను తీవ్రంగా ఖండిస్తున్నానమని, ఇది మంచి పద్దతి కాదన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. ‘సీఎంలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మీ మేనిఫెస్టో.. మా మేనిఫెస్టోపైన మేం చర్చకు రెడీ. ప్రశ్నిస్తే మాపై మాటల దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారో అర్దం కావడం లేదు. రాజకీయాల్లో మగతనం మాట ఎందుకు వస్తోంది. మహిళా నాయకుల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడ్డం హాస్యాస్పదం. నువ్వు అంత మగాడివే అయితే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు గెలిపించి నీ మగ తనాన్ని నిరూపించుకో. సీఎంగారు మీ ప్రభుత్వాన్ని కూల్చాలన్న అలోచన మాకు లేదు. మీ ఆంతట మీరు కూలిపోతే మాకు సంబంధం లేదు. మీ వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నీ కుర్చీ ఇనాం కింద వచ్చిందే అనుకుంటున్నాం. రాజీవ్ గాంధీ కుటుంబం ఇనామ్ కింద ఇచ్చిందే కదా నీ కుర్చీ. ఇందిరాగాంధీ నామజపంతో తుకుతున్న పార్టీ మీది. మీది జాతీయపార్టీ కాదు. ప్రాంతీయ పార్టీ మీది. ఆప్ కంటే అద్వాన్నంగా మారింది కాంగ్రెస్ పార్టీ. మార్చి1వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్తున్నాం. త్వరలో కేసీఆర్ కూడా మేడిగడ్డ కు వస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే కాదు. మేడిగడ్డకు పెట్టిన ఖర్చు కేవలం రూ. 3 వేల కోట్లు మాత్రమే. కూలిపోయిన 3 పిల్లర్ల వద్ద రిపేర్ చేసి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలి. బ్యారేజ్ కొట్టుకుపోయేలా చేయాలనే దుర్మార్గపు అలోచన చేస్తున్నారు. ఇదీ చదవండి.. తెలంగాణకు మరోసారి మోదీ.. రెండు రోజులు ఇక్కడే -
తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ.. రెండు రోజులు ఇక్కడే..
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మార్చి నాలుగో తేదీన అదిలాబాద్, మార్చి ఐదో తేదీన సంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తున్నారు. వచ్చే నెల 4, 5 తేదీల్లో మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్టు సమాచారం. షెడ్యూల్ ఇలా.. నాలుగో తేదీన ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు ఆదిలాబాద్‌లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌లకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మోదీ 11.15 గంటల నుండి 12 గంటల వరకు పబ్లిక్ మీటింగ్ రాత్రి హైదరాబాద్ రాజ్ భవన్లో బస చేస్తారు. ఐదో తేదీన సంగారెడ్డిలో పర్యటన ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి బయలుదేరనున్న మోదీ ఉదయం 10:45 నుండి 11:15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 11:30 నుండి 12:15 వరకు బీజేపీ బహిరంగ సభ తెలంగాణ పర్యటన తర్వాత ఒడిషా వెళ్లనున్న ప్రధాని మోదీ -
ఈటలకు మల్కాజ్గిరి ఫిక్స్!.. బీజేపీ నేతలతో కీలక భేటీ?
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మల్కాజ్గిరి ఎంపీ టికెట్‌ను ఈటల రాజేందర్‌కు కేటాయించినట్టు తెలుస్తోంది. దీంతో, ఆయన పోటీ ఆసక్తికరంగా మారనుంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి లోక్‌సభ స్థానంలో ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మల్కాజ్గిరి స్థానం ఈటలకు కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. దీంతో, ఈటల శామీర్‌పేటలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ మేరకు మెసేజ్‌లు వెళ్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్–జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్‌నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మెదక్–ఎం.రఘునందన్‌రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’
సాక్షి, హైదరాబాద్: ‘మేడిగడ్డ బ్యారేజీలో రెండు మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే కాంగ్రెస్ ప్రభు త్వం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చే కుట్ర చేస్తోంది. మేడిగడ్డపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎండగట్టడంతోపాటు కాళేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను ప్రజలకు వివరిస్తాం. దీని కోసం మార్చి 1న ‘చలో మేడిగడ్డ’కార్యక్రమం చేపడుతున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నేత లు తెలంగాణ భవన్ నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరి వెళ్తాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. దశలవారీగా కాళేశ్వరంలోని ప్రతీ రిజర్వాయర్‌ను సందర్శించడంతోపాటు కాంగ్రెస్ మంత్రులు తమ వెంట వస్తే వారినీ తీసుకెళ్తామని చెప్పారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు కేటీఆర్ మాటల్లోనే... రైతాంగంపై కక్షపూరిత వైఖరి మానుకోండి మరమ్మతులు చేపట్టకుండా వచ్చే వర్షాకాలంలో కాళేశ్వరంలో అంతర్భాగమైన మూడు బ్యారేజీలు వరదలో కొట్టుకుపోయేలా కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. నేరపూరిత మనస్తత్వంతోనే బ్యారేజీలకు మరమ్మతు చేయకుండా రోజూ వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతోంది. గతంలోనూ కాంగ్రెస్ హయాంలో కడెం, గుండ్లవాగు, మూసీ, సింగూరు, పులిచింతల సహా అనే ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయి. బ్యారేజీల మరమ్మతుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు ఉన్నా యి. రాజకీయ లబ్ధి మానుకుని రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాఫర్‌డ్యాంను నిర్మించి మేడిగడ్డలో దెబ్బతిన్న మూడు పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. వచ్చే వేసవిలో సాగునీరే కాదు.. మంచినీళ్లు కూడా ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్పై దు్రష్పచారం చేసినా రైతుల జీవితాలను దెబ్బతీసి పొలాలను ఎండబెట్టకండి. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ మాత్రమే కాదని మూడు బ్యారేజీలు, అనేక రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు, కాలువల సమాహారం. 40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే కామధేనువు కాళేశ్వరం వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లను సందర్శిస్తాం. తెలంగాణకు ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకాల ద్వారానే నీరు అందించడం సాధ్యం. కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్న మేధావులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బాసర నుంచి భద్రాచలం దాకా గోదావరి జలాల కోసం 60 ఏళ్ల పాటు పోరాటాలు జరిగినా తెలంగాణకు నీళ్లకు బదులుగా కన్నీళ్లు మిగిల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నీళ్ల గోసను గద్దర్, సదాశివుడు వంటి కవులు వివరిస్తే, జలసాధన ఉద్యమాల ద్వారా కేసీఆర్ పల్లెలను జాగృతం చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసి తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా తీయలేదు. గోదావరి జలాలను తెలంగాణ పొలాలకు మళ్లించే సంకల్పంతోనే సీడబ్ల్యూసీ, నిపుణుల సూచనతో మహారాష్ట్రతో సంప్రదించి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. కాగ్ నివేదిక పవిత్ర గ్రంథం కాదు కాగ్ రిపోర్టును నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సహా అనేక మంది తప్పుపట్టి అదేమీ పవిత్ర గ్రంథం కాదని తేల్చారు. గతంలో జలయజ్ఞం సహా కల్వకుర్తి ప్రాజెక్టులో రూ.900 కోట్ల గురించి కాగ్ ప్రస్తావించింది. కాగ్ నివేదికపై ద్వంద్వ వాదన వినిపిస్తున్న కాంగ్రెస్ సమాధానాలు చెప్పాలి. గతంలో జలయజ్ఞంలో రూ.52 వేల కోట్ల అవినీతి జరిగిందని కాగ్ ఎత్తి చూపింది. అప్పుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రస్తుతం కొత్తగా అప్పులు తేవొద్దు. -
ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ప్రజా సంక్షేమంలో లాభనష్టాలు చూసుకోరు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునే వారు వ్యాపారులవుతారు గానీ పాలకులు కారు. మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టం’అని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హరీశ్‌రావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వంద శాతం జనావాసాలకు నిరంతరం సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ‘మిషన్ భగీరథ’ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదని,దండగని రేవంత్ మాట్లాడటం శోచనీయమన్నారు. మిషన్ భగీరథ కోసం గత ప్రభుత్వం రూ. 35 వేల కోట్లు ఖర్చు చేస్తే, దాన్ని రూ.50 వేల కోట్లకుపెంచి చెబుతున్న ఘనత రేవంత్‌కే దక్కుతుందన్నారు. మిషన్ భగీరథపై అవగాహన లేదు ‘మిషన్ భగీరథ పథకం లక్ష్యంపై సీఎం అనే వ్యక్తికి కనీసం అవగాహన లేదు. మిషన్ భగీరథ ప్రజల ఆరోగ్యం కాపాడిన గొప్ప సంజీవనిగా చూడాలి. లాభనష్టాలు బేరీజు వేసుకోవడం తగదు. రైతులకు సాగునీరు ఇవ్వడాన్ని, ప్రజలకు మంచినీరు ఇవ్వడాన్ని కూడా లాభనష్టాలతో బేరీజు వేసుకునే ప్రభుత్వం ఒకటి వస్తుందని తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించి ఉండరు. బీడు భూముల్లో సిరులు పండుతుంటే రైతులు పడే సంతోషం చూడాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారి మనస్తత్వంతో లాభనష్టాలు చూడొద్దని కోరుతున్నా. ఆసరా పెన్షన్లు, రైతుబంధు వంటివి కూడా లాభం లేని పథకాలుగా భావించి రద్దు చేస్తారా’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. తరచూ తన ఎత్తు గురించి మాట్లాడుతున్న రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రజల కోసం ఎవరెంత ఆలోచిస్తున్నారో, ఎవరెంత పనిచేస్తున్నారో మాత్రమే అవసరమన్నారు. ‘హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పి ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎల్ఆర్ఎస్ను ఎలాంటి ఫీజు లేకుండా అమలు చేయాలి.. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి’అని హరీశ్ పేర్కొన్నారు. -
ప్రజాహిత యాత్రపై రాళ్లదాడి
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో బీజేపీ జాతీయ కా ర్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బండి సంజయ్, మంత్రి పొన్నం మధ్య మాటల యుద్ధమే ఇందుకు కారణమని అంటున్నారు. మంగళవారం ప్రజాహిత యాత్ర హుస్నాబాద్ మండలం రాములపల్లిలో కొనసాగుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బండి దిష్టి»ొమ్మను దహనం చేసేందుకు కొందరు కార్యకర్తలు యాత్రలోకి చొచ్చుకునిరాగా.. బీజేపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఓ కార్యకర్తను బీజేపీ నాయకులు చి తకబాదారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పో లీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. పొన్నం సిద్ధమా: యాత్ర హుస్నాబాద్‌కు చేరుకు న్న సందర్భంగా బండి మాట్లాడుతూ.. కరీంనగర్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే రాజకీయ సన్యాసానికి పొన్నం సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యమని పొన్నం అన్న మాట నిజం కాదా అని అన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని, అక్కడే రామమందిరం ఉన్నట్లు కచ్చితంగా చెబుతామన్నారు. పొన్నంకు రాముడంటే కోపమంటూ.. అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. సంచలనం కోసమే పొన్నం యాత్రను అడ్డుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. పొన్నం తన తల్లిని అడ్డుపెట్టుకొని.. మంత్రి పొన్నం ప్రభాకర్ తన తల్లిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. స్వర్గంలో ఉన్న పొన్నం తండ్రి ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో ఆలోచించుకోవాలన్నారు. పొన్నం తల్లి నిండు నూరేళ్లు బతకాలని కాంక్షించారు. ‘అందరు తల్లులు నా తల్లితో సమానం. ఆయన తల్లిని నేను అవమానించలేదు. వాళ్ల తల్లిని అవమానించడమంటే నా తల్లిని నేను అవమానించినట్లే’అని బండి చెప్పారు. -
బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు?
సాక్షి, హైదరాబాద్: ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు లైన్‌క్లియర్ అయింది. గురువారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగే పక్షంలో ఆరోజుగానీ మరుసటి రోజుగానీ ఈ చేరికలు ఉండొచ్చని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒక ఎంపీ మాత్రం గురువారం మంచిరోజు ఉందని, ఆ రోజే పార్టీలో చేరుతానని చెప్పినట్టు తెలిసింది. ఇటీవల అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు గైర్హాజరయ్యారు. ఆయనతోపాటు కుమారుడు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు ఆ పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ, ఉమ్మడి ఖమ్మం నుంచి మరో సిట్టింగ్ ఎంపీ కూడా తమ పార్టీలో చేరే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సదరు ఎంపీ గతంలో ఉత్సాహం చూపినా, ఆ తర్వాత కొంత ఆచితూచే ధోరణితో ఉండడంతో చేరికపై పూర్తి స్పష్టత రాలేదని తెలుస్తోంది. టికెట్‌పై భరోసా ఇస్తే...? వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము సిట్టింగ్‌లుగా ఉన్న చోట నుంచే అవకాశం ఇవ్వాలంటూ ఉమ్మడి మెదక్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి భరోసా కోరినట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో పలువురు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆ పార్టీనేతలు చెబుతున్నారు. బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి సిట్టింగ్ ఎంపీల చేరికను బట్టి 17 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై ఓ స్పష్టత వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 29న లేదా మరో తేదీన జరిగే పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీలో రాష్ట్రానికి సంబంధించిన 8 నుంచి 10 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశమున్నట్టు తెలిసింది. సర్వేలే ప్రాతిపదికగా... మోదీపాలన, బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణకు తోడు పార్టీ తరఫున బరిలో నిలపాలని భావిస్తున్న అభ్యర్థులు, ఇతర పార్టీల సిట్టింగ్ ఎంపీల ఇమేజ్, గుర్తింపు జత కలిస్తే గెలిచే అవకాశాలు మరింత మెరుగవుతాయని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై వివిధ అంశాల ప్రాతిపదికన పలు దఫాలుగా బీజేపీ సర్వేలు నిర్వహిస్తోంది. ► రాష్ట్రంలో 12 ఎంపీ సీట్ల పరిధిలో మోదీ పాలన, పార్టీ పట్ల ప్రజల్లో మద్దతు 30 శాతానికి పైగా వ్యక్తం కాగా, ప్రజల్లో సొంతంగా పదినుంచి 15 శాతం సానుకూలత సాధించే బలమైన అభ్యరి్థకి టికెట్ ఇస్తే 8 నుంచి 10 దాకా కచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని బీజేపీ ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. ► మిగతా ఐదారు స్థానాల్లో పార్టీ పట్ల ప్రజల్లో 20 శాతం దాకా మద్దతు వ్యక్తం కాగా, ఆయా స్థానాలకు పోటీపడుతున్న పార్టీ అభ్యర్థుల్లో ఐదారు శాతమే సానుకూలత వ్యక్తం కావడంతో ఆ స్థానాల్లో అభ్యర్థుల ఖరారు పెండింగ్‌లో పెట్టాలని నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. ► పార్టీ అభ్యర్థులు అంతగా బలంగా లేని ఆయా సెగ్మెంట్ల పరిధిలో ఇతర పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎంపీలు వస్తే గెలిచే అవకాశాలపై అన్వేషణ సాగిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే బీజేపీ టికెట్ ఆశిస్తున్న ఇతర పార్టీలకు చెందిన కొందరు సిట్టింగ్ ఎంపీలు ఓకే అంటే వారిలో బరిలో దింపేందుకు నాయకత్వం సిద్ధమైనట్టు పార్టీ వర్గాల సమాచారం. ► కొద్దిరోజుల క్రితం నగరశివార్లలో జరిగిన రాష్ట్రపార్టీ విస్తృత సమావేశంలో నిర్వహించిన అభిప్రాయసేకరణలో బీఆర్ఎస్ ఎంపీ రాములు చేరితే నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానాన్ని తప్పక గెలుచుకోగలుగుతామనే అభిప్రాయాన్ని పార్టీనాయకులు వెలిబుచ్చినట్టు పార్టీవర్గాల సమాచారం. పార్టీపరంగా సర్వేతో పాటు రాములు వస్తే విజయం సాధిస్తామనే అంచనాల నేపథ్యంలో ఆయనను చేర్చుకునేందుకు ముఖ్యనేతలు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. -
చేవెళ్ల సభలో సీఏం రేవంత్ హాట్ కామెంట్స్
చేవెళ్ల: నూటికి నూరు శాతం ఇచ్చిన హామీలు అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌డ్డి అన్నారు. కేసీఆర్ మనిషివా.. మానవ రూపంలో ఉన్న మృగానివా? అని సూటిగా ప్రశ్నించారు. చేవెళ్ల కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. ‘నీళ్ళ ముసుగులో భారీ దోపిడీ జరిగింది. మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఏ ఆడబిడ్డ కళ్లలో కట్టెల పొయ్యితో నీళ్ళు రావొద్దని.. రూ.500కే గ్యాస్ సిలెండర్ అందిస్తున్నాం. పథకాలు రాలేదని బాధపడోద్దు. ఎమ్మార్వో, ఎంపీడీవో దగ్గరకు వెళ్ళి ఉచిత విద్యుత్ పథకం, రూ.500లకే గ్యాస్ సిలెండర్ అందించే పథకం అందివ్వాలని కోరుతున్నా. కార్యకర్తలు కష్టపడితేనే మేము నాయకులం అయ్యాం. 14 ఎంపీలను గెలిపించే బాధ్యత మనది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యత నాది. 5 మంది సభ్యులతో ఇందిరమ్మ కమిటీతో పథకాలు అమలు చేస్తాం. ... అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలను మరిచిపోతారనీ అంటారు. నేను మాత్రం కార్యకర్తల కోసం పనిచేస్తా. జిల్లాలు,నియోజకవర్గాల్లో తిరుగుతా. బీజేపీ చెబుతున్న గుజరాత్ మోడల్ అంటే ఎంటి?. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు ఏమైంది?. మా ఊర్లో వడ్లు కొనేవారు లేదు. తాండూరులో కందులు కొనేవాళ్లు లేరు. గుజరాత్ మోడల్ అంటే ప్రభుత్వాలు పడగొట్టడమా!. ఎన్నికలు వస్తె బీజేపీ నేతలు ఈడి, సీబీఐలను పంపుతారు. బీజేపీ వాళ్లకు ఓటు వేయడం దండగ. కార్యకర్తలు గెలిచినప్పుడే కాంగ్రెస్‌ది నిజమైన గెలుపు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ప్రచారఅ్రస్తాలుగా బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. షెడ్యూల్ త్వరలో వెలువడుతుందనే ప్రచారం నేపథ్యంలో కార్యాచరణ వేగవంతం చేయాలని నిర్ణయించింది. షెడ్యూల్ వెలువడేలోగా ఆరువారాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన బీఆర్ఎస్, ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో సోమవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. మాజీ మంత్రి హరీశ్‌రావు స్వల్ప జ్వరంతో ఈ భేటీకి హాజరుకాకున్నా, ఆయనతో కేసీఆర్, కేటీఆర్ ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ అంటూ.... తెలంగాణ ప్రయోజనాలు కాపాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేననే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా రూపొందించిన కార్యాచరణను తనతో భేటీ అయిన ముఖ్యనేతలకు కేసీఆర్ వివరించినట్టు సమాచారం. బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలతో పాటు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, మూడు నెలల్లోనే వాటి అమలులో విఫలమైన తీరును వివరించేలా కరపత్రాలు, బుక్లెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆరు గ్యారంటీల పేరిట ఇచ్చిన 13 హామీలు కలుపుకొని మొత్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు అసాధ్యమనే విషయాన్ని ప్రజలకు విడమరిచి చెప్పాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎన్నికల కార్యాచరణలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి మండలస్థాయిలో పార్టీ కేడర్‌తో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు సమావేశాలు ఏర్పాటు చేస్తారు. గ్రామస్థాయిలో పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయడంతోపాటు బీఆర్ఎస్ పాలనలో వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారితోనూ భేటీ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ సిద్ధం చేసి ముఖ్యనేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగిస్తారు. ముఖ్య నేతలకు ప్రచార సమన్వయ బాధ్యతలు లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా పార్టీ నేతల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా రాష్ట్రస్థాయి అంశాలతో పాటు స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల వ్యూహం అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కడియం శ్రీహరి, మధుసూధనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వంటి సీనియర్ నేతలకు అప్పగించనున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కూడికలు, తీసివేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా కుస్తీ పడుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ అంశంపై ఎలా స్పందించాలనే కోణంలోనూ సోమవారం జరిగిన భేటీలో కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక కూడా జరుగుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో జరిగే ఈ ఎన్నికకు సంబంధించి దివంగత ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో కేసీఆర్ త్వరలో భేటీ అవుతారని పార్టీవర్గాలు వెల్లడించాయి. -
కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు
సనత్‌నగర్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశం మొత్తంమీద కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రావని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ను ఎక్కడా ప్రజలు నమ్మడం లేదనీ, రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని ఆ పార్టీ నేతలే నమ్మడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లిపోతారన్నారు. కిషన్‌రెడ్డి చేపట్టిన విజయసంకల్ప యాత్ర సోమవారం సనత్‌నగర్ నియోజకవర్గంలో కొనసాగింది. పద్మారావునగర్ స్వరాజ్య ప్రెస్ సర్కిల్లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి మొదలైన యాత్ర ముషీరాబాద్ చౌరస్తా, బైబిల్ హౌస్, హిల్ స్ట్రీట్, షోలాపూర్ స్వీట్‌హౌస్, మహంకాళి స్ట్రీట్, బేగంపేట రైల్వేస్టేషన్, అమీర్‌పేట గురుద్వారా, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం మీదుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా అమీర్‌పేటలో జరిగిన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవకున్నా నష్టమేమీ ఉండదన్నారు. మళ్లీ మోదీనే పీఎం కావడం ఖాయం రానున్న ఎన్నికల్లో మళ్లీ మోదీ ప్రధాని కావడం ఖాయమనీ, మూడోసారి ఆయన ప్రధాని కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందనీ, దేశ ప్రతిష్టను ఆయన పెంచారని అన్నారు. గత పదేళ్ల కాలంలో దేశం ప్రశాంతంగా ఉందంటే అది మోదీ వల్లేనని పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడా ఐఎస్ఎస్ కార్యకలాపాలు లేవని, జమ్మూ కశ్మీర్లో నేడు శాంతియుత వాతావరణం ఉందన్నారు. మోదీ నాయకత్వం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని, అలాంటి మోదీకి రాష్ట్రం నుంచి ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి బహుమతిగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ యాత్రలో కిషన్‌రెడ్డి వెంట ఎంపీ లక్ష్మణ్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్, కార్పొరేటర్లు సరళ, సుచిత్ర, దీపిక, నాయకులు వెల్లాల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి మోదీ, షా, నడ్డా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుస ఎన్నికల పర్యటనలతో హోరెత్తించనున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసంగా పది ఎంపీ సీట్లు గెలుపొందాలన్న లక్ష్యం నేపథ్యంలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రచారాన్ని ప్రారంభించక ముందే బీజేపీ ఉధృత ప్రచారం చేపట్టాలని భావిస్తోంది. ఆ మేరకు ఆ పారీ్టల అభ్యర్థుల ప్రకటనకు ముందే ఈ నెలాఖరులోగా బీజేపీ అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారపర్వంలోకి దూకాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ఇచ్చేలోగానే మోదీ 2 సభలు... ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగానే ఆదిలాబాద్, సంగారెడ్డిల్లో ఏర్పాటు చేసిన సభలకు ప్రధాని మోదీ విచ్చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని తెలుస్తోంది. ఆయా సభలకు ముందు రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనలను మోదీ చేతుల మీదుగా చేపట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. గత పదేళ్ల పాలనలో కేంద్రంలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతితో పాటు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో కాంగ్రెస్ పార్టీ తీరును, రాష్ట్రంలో గత తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కారు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై మోదీ సునిశిత విమర్శలు చేస్తారని రాష్ట్ర పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 29న బీజేపీ తొలి జాబితా...? ఈ నెల 29న ఢిల్లీలో జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాష్ట్రంలోని 17 సీట్లలో మెజారిటీ (అంటే 12 స్థానాలకు) అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ 29న ఇద్దరు లేదా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఐదారుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరి చేరికను బట్టి ఎవరు గట్టి అభ్యర్థులు అవుతారో వారి బలాబలాల ప్రాతిపదికన పేర్లను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మరింత మెరుగైన అభ్యర్థుల కోసం అన్వేషణలో భాగంగా... జహీరాబాద్, పెద్దపల్లి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం సీట్లకు క్యాండిడేట్ల ఎంపికను పెండింగ్‌లో పెట్టినట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగానే అగ్రనేతల విస్తృత ప్రచారం ఆదిలాబాద్, సంగారెడ్డి సభలకు పీఎం మోదీ ఆ తర్వాత అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం 4న హైదరాబాద్‌లో అమిత్ షా సభ! 29న బీజేపీ తొలి జాబితా? 12 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు 4న అమిత్ షా రాకుంటే మోదీ? వచ్చే నెల 4న హైదరాబాద్‌లో సభ ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా పాల్గొంటారని తెలుస్తోంది. ముందుగా రాష్ట్ర పర్యటన ఖరారైతే అదే రోజున అమిత్ షా బదులు మోదీ సభ ఉండొచ్చునని సమాచారం. ఈ సభ కోసం గచ్చిబౌలి, సరూర్‌నగర్ స్టేడియాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలు కవర్ చేసేలా (ఐదు వేర్వేరు ప్రాంతాల్లో) చేపట్టిన విజయసంకల్పయాత్రల ముగింపు సందర్బంగా హైదరాబాద్‌లో మార్చి 2న అమిత్‌షా సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని తొలుత భావించారు. ఐతే 2వ తేదీకి బదులు 4న రాష్ట్రానికి వచ్చేందుకు అమిత్‌షా సమయం కేటాయించడంతో అదేరోజున సభను నిర్వహించాలని నిర్ణయించినట్టు పారీ్టవర్గాల సమాచారం. -
మీకు, కేసీఆర్‌కు తేడా ఏముంది?
కోహెడ (హుస్నాబాద్)/ కరీంనగర్ టౌన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తే, వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేంద్రం నయా పైసా సాయం చేయలేదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మలిదశ ప్రజాహిత యాత్రలో భాగంగా సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి కేంద్రంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నరేంద్ర మోదీ పాలనలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చిందని, అసలు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పాలన సాగుతోందంటే మోదీ ఇస్తున్న నిధుల పుణ్యమేనని అన్నారు. కాంగ్రెస్‌కి దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బండి సవాల్ విసిరారు. ‘కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏముంది? 10 ఏళ్లలో బీఆర్ఎస్ రూ.5 లక్షల కోట్ల అప్పు తెస్తేం మీరు 2 నెలల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారు’అని కాంగ్రెస్‌ను విమ ర్శించారు. ‘వంద రోజుల్లోనే 6 గ్యారంటీలన్నీ అమలు చేస్తానన్నారు, 75 రోజులు దాటిపోయా యి. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు బంధు ఎకరాకు రూ.15 వేలు, మహిళలకు నెలనెలా రూ.2,500, ఆసరా పెన్షన్ రూ.4 వేలు ఇస్తానన్న హమీ ఎందుకు అమలు చేయడం లేదు’అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం తెలంగాణలో 2 లక్షల 40 వేల ఇళ్లు మంజూరుచేస్తే ఒక్క ఇల్లు కూడా కట్టివ్వకుండా మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలను గెలుస్తాం సీబీఐ, ఈడీని శాసించే అధికారం బీజేపీకి లేదని, ఢిల్లీ లిక్కర్ కేసులో సాక్ష్యాలు, ఆధారాలతోనే కవితకు నోటీసులిచ్చారని, ఆధారాలుంటే ఎంత పెద్దవారైనా ఉపేక్షించకూడదన్నదే బీజేపీ విధానమని బండి అన్నారు. రెండోవిడత ప్రజాహిత యాత్ర ప్రారంభం సందర్భంగా కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని అన్నారు. విజయ సంకల్పయాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. బీజేపీ ఐదారు రోజుల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించబోతోందని, బీఆర్ఎస్తో పొత్తు అంటే చెప్పుతో కొట్టాలని తానే చెబుతున్నానని స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మోదీని మరోసారి ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రజాహిత యాత్ర కొనసాగిస్తున్నామని తెలిపారు. -
మీ మేనిఫెస్టోలు, మా ఆరు గ్యారంటీలపై చర్చకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: 2014, 2018 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోలు, 2014, 2019 ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోలు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చిద్దామని, బీఆర్ఎస్, బీజేపీ నేతలు సిద్ధమా? అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమ లు చేస్తున్నామని, గత పదేళ్లలో జరిగిన తప్పిదాలను పరిష్కరించేలా ముందుకెళ్తున్నామని చెప్పా రు. బీఆర్ఎస్, బీజేపీల భాష, భావం, ఆలోచనా విధానం ఒక్కటేనని, రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నాయని విమర్శించారు. సోమవారం సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించే పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డ రోజున అప్పుల కింద ఏడాదికి రూ. 6 వేల కోట్లు కట్టేవారమని, ఇప్పుడు పదేళ్ల తర్వాత ఏడాదికి రూ.70 వేల కోట్లు అప్పుల కింద కట్టాల్సి వస్తోందని చెప్పారు. మిగులు బడ్జెట్ స్థితిలో రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే రాష్ట్రాన్ని దివాలా స్థితికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఇంత త్వరగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయగల శక్తి కేసీఆర్‌కు తప్ప ఎవరికైనా ఉందా అని ఎద్దేవా ఏశారు. మార్చి 31 కల్లా రైతుబంధు రైతుబంధును మార్చి 31 కల్లా రైతులకు ఇస్తామని అసెంబ్లీలోనే చెప్పానని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. రైతుబంధును 15 రోజుల్లోనే ఇవ్వొచ్చని, అయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు నిధులివ్వలేమని వెల్లడించారు. ఉద్యోగాలను వారు వదిలేస్తే న్యాయ పరిష్కారం చూపెట్టి 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. తాము ఇచ్చిన ఉద్యోగాలకు తెడ్డు తిప్పుతున్నారని హరీశ్‌రావు అంటున్నారని, మరి తెడ్డు తిప్పలేని సన్నాసి మంత్రి ఎలా అయ్యా రని ఎద్దేవా చేశారు. మార్చి 2న మరో ఆరువేల ఉద్యోగాలిస్తామని, 70 రోజుల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. దూలం లెక్క పెరిగిన హరీశ్‌కు దూడకున్న బుద్ధి కూడా లేదని విమర్శించారు. రేవంత్‌ను సీఎంగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లి ఉంటే కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా వచ్చేవి కాదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన్ను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. గత ఎన్నికల్లో తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కేసీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, కిషన్‌రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా తలపడ్డామని, తమ పార్టీ నేతలతో కలిసి 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలకు వెళ్లానని, పార్టీ అధ్యక్షుడంటే ఇంటి పెద్దే కదా అని అన్నారు. కిషన్‌రెడ్డి ఏనాడైనా కలిశారా? అధికారం చేపట్టిన తర్వాత రాజకీయాలకతీతంగా తాము నిధుల కోసం, సమస్యల పరిష్కారం కోసం కేంద్రం వద్దకు వెళ్లామని, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఏ రోజైనా ప్రజా సమస్యల కోసం తనను కలిశారా అని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలన్న ఆలోచన బీజేపీకి లేదని విమర్శించారు. మూడోసారి ప్రధానిగా మోదీకి ఎందుకు అవకాశం ఇవ్వాలని, రైతులను కాల్చిచంపడానికా అని అన్నారు. నిరుద్యోగులకు ఆన్లైన్ క్లాసులు పేద, గ్రామీణ నిరుద్యోగుల కోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ల పేరిట అత్యవసరంగా ఆడిటోరియాలు కట్టి, అక్కడ ఆన్లైన్ క్లాసులతో శిక్షణనిస్తామని రేవంత్ చెప్పారు. సంక్షేమ పథకాల అమలుకు తెల్ల రేషన్‌కార్డును కొలబద్దగా తీసుకున్నామని చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా అనర్హులకు రూ.22వేల కోట్లు పంచిపెట్టారన్న అంచనా ఉందన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాల కోసం ఆధార్‌కార్డు చూపిస్తే నమోదు చేసుకునేలా మండల కేంద్రాల్లో హెల్ప్ డెసు్కలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉజ్వల్ పథకం కింద కేంద్రం ఇస్తున్న మొత్తం పోను మిగిలింది సిలిండర్ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పారు. -
ఎంపీగా పోటీ చేసి తీరుతాను: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేసి తీరుతానని పీసీసీ మాజీ చీఫ్, సీనియర్‌నేత వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు. సోమవారం వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ‘ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న. ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను. ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ నాకు అడుగుతున్నారు. పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా?. ఇండియాలో నాకంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా?. నేనేం తప్పు చేశాను.. నన్ను ఎందుకు పక్కన పెట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే నా లాంటి సీనియర్ల పరిస్థితి ఎంటి?. ...గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలి. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. ప్రధాని మోదీకి సముద్రం లోపలికి వెళ్లి పూజలు చేయడానికి టైం ఉంది కానీ మణిపూర్ వెళ్ళడానికి టైం లేదు. ఏం ఉద్దరించారని సంకల్ప యాత్ర చేస్తున్నారు. రాముడ్ని మేమే పుట్టించామని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. దేవుడి పేరుపై ఓట్లు సంపాదించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ నేతలు భాష మార్చుకోవాలి. ఇప్పటికైనా ప్రధాని మోదీ మణిపూర్ వెళ్ళాలి. రాహుల్ గాంధీని గుడికి రానివ్వడం లేదు. గుడులు మీ అయ్య జాగీర్లా?’అని వీహెచ్ మండిపడ్డారు. -
బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి ఖండించారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మల్లు రవి మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు ప్రకటించకపోతెనే అసెంబ్లీ ఎన్నికల్లో 65 సీట్లు వచ్చాయి. ముందే ప్రకటించి ఉంటే 80కి పైగా సీట్లు వచ్చేవి. ప్రజాపాలన కేటీఆర్ కళ్ళకు కనిపించడం లేదా?. తెలంగాణలో ప్రజలు స్వేచ్చగా తిరుగుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు. ...బీఆర్ఎస్ పాలనలో ప్రజలు కేసుల భయంతో బతికారు. గత ప్రభుత్వంలో ప్రజలు లేక వెలసిపోయిన సెక్రటేరియట్, ఇప్పుడు మంత్రులను సాధారణ ప్రజలు డైరెక్టుగా కలుస్తున్నారు. కేటీఆర్ తరహా వ్యాఖ్యలు పుట్టుకతోనే గుడ్డి, చెవుడు ఉన్నల్లే చేస్తారు. 420 అన్న వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్‌పై కేసు పెట్టాలి. 10 లక్షల ఆరోగ్యశ్రీ కింద ఇప్పటికే 6వేల మంది పేదలు లబ్ధి చెందారు’ అని మల్లు తెలిపారు. -
కవితకు ఈడీ నోటీసులు.. బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. అలాగే, బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అనే వాళ్లను చెప్పుతో కొట్టాలని పిలుపునిస్తున్నట్టు ఆగ్రహంగా చెప్పారు. గతంలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేసి మా కొంప ముంచారంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, బండి సంజయ్ మలి విడత ప్రజాహిత యాత్రలో భాగంగా హుస్నాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీ, బీజేపీకి సంబంధం లేదు. వారికి ఉన్న అధికారాలు, ఆధారాలను అనుసరించి మాత్రమే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకుంటారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. గతంలో వారే అధికారాన్ని పంచుకున్నారు. యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేసి మా కొంపముంచారు. ఇప్పుడు మళ్లీ అదే మాట అంటున్నారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెబుతాం. విజయ సంకల్ప యాత్రలకు మంచి స్పందన ఉంది. వారం రోజుల్లో తెలంగాణలో వీలైనన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించబోతున్నాం. కేంద్రంలో 370 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే మా టార్గెట్. ఆ టార్గెట్‌ను తప్పకుండా రీచ్ అవుతాం. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారు. తెలంగాణలో కూడా హైదరాబాద్ సహా 17 సీట్లు గెలుస్తాం. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీది మూడో స్థానమే. కొండగట్టుకు నిధులు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారు. కొండగట్టు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. కేంద్రం నుంచి తప్పకుండా సహకారం ఉంటుంది అని వ్యాఖ్యలు చేశారు. -
సిట్టింగ్‌లు కొందరే!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయం దగ్గర పడుతున్న వేళ..భారత్ రాష్ట్ర సమితి ఆచితూచి అడుగులు వేస్తోంది. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని, పక్కా వ్యూహంతో వైరిపక్షాలను దెబ్బకొట్టాలని, మెజారిటీ సీట్లు సాధించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. 2019లో తొమ్మిది సీట్లలో పార్టీ విజయం సాధించగా, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. మిగతా ఏడుగురు సిట్టింగ్ సభ్యుల్లో ముగ్గురు లేదా నలుగురికే తిరిగి అవకాశం ఇచ్చి, మిగతా చోట్ల వేరే వారికి చాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆర్థిక స్తోమత కలిగి, ఆయా నియోజకవర్గాల్లో మంచి పేరున్న వారై ఉండాలని పార్టీ భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే మొదటి విడత కసరత్తు పూర్తి చేసిన పార్టీ అధినాయకత్వం ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వ్యూహ రచన చేస్తోంది. ముఖ్యంగా శాసనసభ ఎన్నికల తరహాలో ముందస్తుగా పార్టీ అభ్యర్థులనుప్రకటించకూడదని పార్టీ నిర్ణయించింది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తరువాత సమీకరణాలను బేరీజు వేసుకొని ధీటైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని భావిస్తోంది. ఇప్పటికే సన్నాహక సమావేశాలతో.. శాసనసభ ఎన్నికల తరువాత ఓటమి షాక్‌లో ఉన్న పార్టీ యంత్రాంగాన్ని ఉత్సాహ పరచడంతో పాటు పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం చేసే ప్రక్రియను నెల క్రితమే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రారంభించారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్లో ఒక్కోరోజు ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాల్లో శాసనసభ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవడంతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో కలిసి సమాలోచనలు చేశారు. ముఖ్య నాయకులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అధినేత కేసీఆర్‌కు నివేదికలు అందజేశారు. తర్వాత కేటీఆర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ముఖ్య నేతలతో సమావేశమతున్నారు. ఈ సమావేశాల తరువాత అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. సన్నాహక సమావేశాల్లోనే ఇద్దరికి గ్రీన్‌సిగ్నల్.. ఖమ్మం, చేవెళ్ల లోక్‌సభ సీట్లను సిట్టింగ్ ఎంపీలకే కేటాయిస్తున్నట్లు సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ ప్రకటించారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్రావును, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని పార్టీ యంత్రాంగాన్ని కోరారు. కాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు స్థానికంగా పని చేసుకోవాలని సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. వీరితో పాటు కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను తిరిగి గెలిపించుకోవాలని ఆ నియోజకవర్గ సమావేశంలోనే కాకుండా కరీంనగర్, సిరిసిల్ల పర్యటనల్లో కేటీఆర్ పిలుపునిచ్చారు. మిగతా స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా సిట్టింగ్ ఎంపీల సీట్లను అడుగుతున్నారు. అదే సమయంలో 2019లో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిచిన ఏడు స్థానాల కోసం కూడా పలువురు పోటీ పడుతుండడం గమనార్హం. రేసులో ముఖ్య నేతలు పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో అనూహ్యంగా ఎంపీగా పోటీ చేసి గెలిచిన వెంకటేశ్ నేత, మరోమారు తనకు సీటు దక్కే పరిస్థితి లేదని అర్ధమయ్యే పార్టీ మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ, కొప్పుల ఈశ్వర్‌నే బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. మెదక్ నుంచి గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీకి చాలా మందే లైన్లో ఉన్నా వంటేరు ప్రతాప్‌రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని భావించినప్పటికీ, మారిన పరిస్థితుల్లో వంటేరు వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. పసునూరి దయాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ స్థానం కోసం ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడి ఆశావహుల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు. మహబూబాబాద్‌లో సిట్టింగ్ ఎంపీగా మాలోతు కవిత ప్రాతినిథ్యం వహిస్తుండగా సీతారాం నాయక్, రెడ్యా నాయక్‌ల వైపు పార్టీ చూస్తున్నట్టు సమాచారం. మహబూబ్‌నగర్‌కు మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీగా ఉన్న పి.రాములు వైపే ఈసారి కూడా పార్టీ మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. రాములు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం ఉన్నప్పటికీ, ఆ పార్టీలో నాగర్‌కర్నూల్ సీటుకు పోటీ ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆ స్థానాలపై ప్రత్యేక దృష్టి ఎంఐఎం గెలిచిన హైదరాబాద్ మినహా గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ గెలుచుకున్న ఏడు సీట్లపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితుల్లో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను, బీఆర్ఎస్ పట్ల సానుభూతిని అనుకూలంగా మలుచుకొని ఆయా సీట్లలో కూడా గులాబీ జెండా ఎగరేయాలని పార్టీ భావిస్తోంది. కరీంనగర్లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఖరారు కాగా, ఆదిలాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును బరిలోకి దింపే యోచనలో ఉంది. నిజామాబాద్‌లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీ చేయడం లేదని ఇప్పటికే స్పష్టమైంది. దీంతో ఇక్కడ బీజేపీ ఎంపీగా ఉన్న అరవింద్‌కు పోటీగా మున్నూరు కాపు వర్గానికే చెందిన బాజిరెడ్డి గోవర్ధన్‌ను బరిలోకి దింపే యోచనలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది. సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిత్వానికి కూడా గట్టి పోటీ ఉన్నప్పటికీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ వైపే పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ పార్లమెంటు స్థానంలో కూడా కేవలం గోషామహల్ మినహా అన్నిచోట్లా బీఆర్ఎస్ విజయం సాధించింది. నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో హవా చూపించినప్పటికీ, ఈసారి తమకు అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది. నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి లేదా తేరా చిన్నపరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్‌ల పేర్లు పరిశీలిస్తున్నారు. గుత్తా అమిత్‌రెడ్డికి నల్లగొండ లేదా భువనగిరిలలో ఏదో ఒకచోట నుంచి అవకాశం లభించవచ్చని చెబుతున్నారు. రేసులో ముఖ్యనేతలు పెద్దపల్లి ఎస్సీ స్థానం నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వెంకటేశ్ నేత మళ్లీ సీటు దక్కే పరిస్థితి లేదని అర్ధమయ్యే పార్టీ మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరూ వినిపిస్తున్న ప్పటికీ, కొప్పుల ఈశ్వర్‌నే బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. మెదక్ నుంచి వంటేరు ప్రతాప్‌రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు సమా చారం. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని భావించినప్పటికీ, మారిన పరిస్థితుల్లో వంటేరుకే సీటిచ్చేందుకు కేసీఆర్ మొగ్గుచూపుతు న్నారని సమాచారం. పసునూరు దయాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ స్థానంలో పోటీకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారు. మహబూ బాబాద్‌లో సిట్టింగ్ ఎంపీగా మాలోతు కవిత ప్రాతినిధ్యం వహిస్తుండగా సీతారాం నాయక్, రెడ్యా నాయక్‌ల వైపు పార్టీ చూస్తున్నట్టు సమాచారం. మహబూబ్‌నగర్‌పై మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీగా ఉన్న రాములుకే ఈసారీ పార్టీ మొగ్గు చూపొచ్చని తెలుస్తోంది. రాములు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం ఉన్నప్పటికీ, ఆ పార్టీలో నాగర్‌కర్నూల్ సీటుకు పోటీ ఎక్కువగా ఉండటం గమనార్హం. -
ఉద్యమకారులను విస్మరించిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను విస్మరించడం వల్లనే కాంగ్రెస్‌లో పార్టీలోకి వలస వస్తున్నారని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం గాందీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్ మున్షి సమక్షంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీపా దాస్ మున్షి వారిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులకు తగిన గుర్తిపు ఉంటుందన్నారు. టీఆర్ఎస్ అమరుల త్యాగాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమకారులను తొక్కిపెట్టిందని గుర్తు చేశారు. ఉద్యమకారులు పార్టీ వీడి మంచి నిర్ణయం తీసుకుంటున్నారని అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరిని సంక్షేమ అభివద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం అత్తగారింటి నుండి తల్లి గారి ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టడంతోనే రాజీనామా చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమకారులను కాదని ధనబలం ఉన్న వ్యక్తులనే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారుల విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, జీహెచ్ఎంíసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, కార్పొరేటర్లు బాబా ఫసియొద్దీన్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ గ్యారంటీలతో గారడీ చేస్తోంది
తూప్రాన్ (మెదక్)/గజ్వేల్: కాంగ్రెస్ పార్టీ అమలు కాని ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి...నేడు తికమకపడుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర మెదక్ జిల్లా తూప్రాన్‌కు చేరుకోగా కిషన్‌రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని, రెండూ కుటుంబపార్టీలేనని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తూ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 17 సీట్లు గెలుస్తుందని, హైదరాబాద్‌లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. కార్యక్రమంలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. రూ.12 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన కాంగ్రెస్ దేశంలో రూ.12 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డ కాంగ్రెస్‌కు వచ్చే ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్పయాత్ర ఆదివారం రాత్రి గజ్వేల్‌కు చేరుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లకే పరిమితం కావడం వల్ల మూడు నెలల పాటు విదేశీయాత్రకు వెళ్లిన రాహుల్‌గాంధీకి ఈ సారి ఏకంగా ఏడాది పాటు విదేశాల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలోనూ బీజేపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. -
కారు దిగిన రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్
మీర్‌పేట, సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పా రు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం గాంధీ భవ న్లో కాంగ్రెస్ వ్యవహా రాల రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు అనితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. మీర్‌పేటలోని టీకేఆర్ కళాశాలలో ఆదివారం మీడియాతో జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందనీ, ఫలితంగానే ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైందన్నారు. స్థానిక సంస్థల పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిధులు సమకూర్చడంతో పాటు అధికారాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.సహకరించినా ప్రాధాన్యత ఇవ్వలేదు: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నగర మేయర్‌గా, ఎమ్మెల్యేగా, హుడా చైర్మన్‌గా దశాబ్దాల పా టు సేవ చేశానన్నారు. తన ఓటమి తరువాత కాంగ్రెస్‌లో గెలిచిన వారికి బీఆర్ ఎస్‌లో మంత్రి పదవి ఇచ్చారని, అయినా పార్టీకి సహకరించినా ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాను గతంలో కలిసి పనిచేశామని.. ఆయన పిలుపు మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. -
ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ధారాదత్తం చేసింది రేవంతే
నాగర్‌కర్నూల్/ అచ్చంపేట: కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి ధారాదత్తం చేసిన దగుల్బాజీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్, అచ్చంపేటలలో నిర్వహించిన పార్టమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల జూరాల, శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి ఉండదని..చుక్కనీరు కావాలన్నా వారి అనుమతి తీసుకోవాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేఆర్ఎంబీకి అప్పగించాలని కేసీఆర్‌పై ఎంత ఒత్తిడి తెచ్చినా ఒప్పుకోలేదని చెప్పారు. గుంపుమేస్త్రీకి తెలంగాణ తల్లి వడ్డాణం పెట్టుకోవడం నచ్చలేదని, తన ఇంట్లో పెళ్లి జరిగితే మాత్రం ఒంటినిండా బంగారం దిగేసుకోవచ్చా అని ప్రశ్నించారు. రాష్ట్ర చిహ్నంలో గోల్కొండ, చార్మినార్ ఉండొద్దంటున్న రేవంత్‌రెడ్డికి జయజయహే తెలంగాణ గీతాన్ని ఒక్కసారి వింటే వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుందన్నారు. వందరోజుల పరిపాలన పూర్తయ్యేనాటికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలే మీ గొయ్యి తవ్వేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దాడులకు భయపడం.. కాంగ్రెస్ దాడులకు భయపడేది లేదని, వారు ఎన్నికల సమయంలో ఇటుకలు విసిరారు.. మనం కొన్ని రోజులు చూస్తాం.. మనం రాళ్లు విసరలేమా.. మనకు 60 లక్షల మంది బలం ఉందని కేటీఆర్ అన్నారు. అడ్డి మారి గుడ్డి దెబ్బ అన్నట్టుగా అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రేవంత్‌రెడ్డి సీఎం అవుతాడని ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లిలోనే ఎవరూ నమ్మలేదని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి సీఎం అని ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చి ఉండేవి కాదని, అనుకో కుండా గాలి నాలా తంతే గారెల బుట్టలో పడినట్టు పడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వస్తామని కలలో కూడా ఊహించలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా అమ్మతోడు చెబుతున్నాం.. మహబూబ్‌నగర్ జిల్లాలో మేం ఐదారు గెలుస్తాం అనుకున్నాం కానీ.. 12 గెలుస్తామని కలలో కూడా అనుకోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని విమర్శించారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. లాస్య మరణం తీరని లోటు కంటోన్మెంట్: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం కాకాగూడలోని లాస్య నందిత కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. లాస్య తల్లి గీత, చెల్లెళ్లు నమ్రత, నివేదితలను ఓదార్చారు. ప్రమాద వివరాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. లాస్య మరణం బీఆర్ఎస్ పారీ్టకి, కంటోన్మెంట్ ప్రజలకు తీరని లోటు అన్నారు. పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు రాజశేఖరరెడ్డి, మాధవరం కృష్ణారావు తదితరులు ఉన్నారు. -
‘చేయి’స్తారా?
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడవాలని సీపీఐ, సీపీఎం అనుకుంటున్నాయి. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించాయి. 17 లోక్‌సభ సెగ్మెంట్లలో చెరో సీటులో పోటీ చేస్తామని స్పష్టం చేశాయి. అయితే పొత్తులపై సీపీఐ, సీపీఎం ప్రకటన చేసినా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. దీంతో కామ్రేడ్లు కాస్తంత గుర్రుగా ఉన్నారు. బీజేపీని నిలువరించాలంటే తమ మద్దతు అవసరమని, కాబట్టి కాంగ్రెస్ త్వరగా తేల్చాలని లెఫ్ట్ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే దేశంలో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ పొత్తులపై దృష్టి సారించిందని, రాష్ట్రంలో కూడా త్వరగా ఒక నిర్ణయానికి వస్తే ముందస్తుగా ప్రచారంలోకి దూసుకెళ్లొచ్చని అంటున్నాయి. సీపీఎం వైఖరిలో మార్పు గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం ముందస్తుగా బీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నించాయి. ఆ పార్టీతో పొత్తు చిత్తవడంతో కాంగ్రెస్‌తో కలిసి నడవాలని అనుకున్నాయి. సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చివరకు సీపీఐ ఒక్క సీటుకు ఒప్పుకొని కొత్తగూడెంలో విజయం సాధించింది. సీపీఎం మాత్రం కాంగ్రెస్‌తో రాజీప డక ఒంటరిపోరుకు సిద్ధమై 19 అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు దక్కలేదు. ఇటీవల జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లోనూ కొన్ని జిల్లాలకు చెందిన నాయకులు ఈ విషయాన్ని బాహాటంగానే విమర్శించినట్టు సమాచారం. కాంగ్రెస్‌తో వెళ్లి ఉంటే కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండేదని చర్చ జరిగినట్టు తెలిసింది. అంతేగాక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కొన్ని చోట్ల, బీఆర్ఎస్కు మరికొన్నిచోట్ల మద్దతు ఇవ్వడం కూడా సరైన నిర్ణయం కాదన్న వాదనలు కూడా ఆ పార్టీలో తలెత్తాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కే తమ మద్దతు అని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేస్తే, రాష్ట్ర పార్టీ నాయకత్వం మాత్రం బయటకు ఏదీ నేరుగా చెప్పకుండా అంతర్గతంగా బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపైనా విమర్శలు వచ్చా యి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీపీఎం వైఖరిలో మార్పు వచ్చింది. కాంగ్రెస్‌తోనే ముందుకు నడవాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఓట్లతో బయటపడ్డ వాస్తవాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాను పోటీ చేసిన పాలేరు అసెంబ్లీ స్థానంలో పరువు దక్కించుకోలేకపోయారు. ఆ పార్టీకి పాలేరులో 5,308 ఓట్లు, మిర్యాలగూడలో 3,23 4 ఓట్లు, వైరాలో 4,439 ఓట్లు వచ్చాయి. అంతేకాదు మొదట్లో అడిగిన ఐదింటిలోని భద్రాచ లంలో 5,860 ఓట్లు, మధిరలో 6,575 ఓట్లు, ఇబ్రహీంపట్నంలో 3,948 ఓట్లు మాత్రమే సాధించింది. మొత్తం 19 స్థానాల్లో పోటీ చేసిన సీపీఎం అన్నిచోట్లా కలిపి కేవలం 52,349 ఓట్లే సాధించింది. కనీసం ఎక్కడా డిపాజిట్ రాలేదు. కాంగ్రెస్ ప్రతిపాదించినట్టుగా మిర్యాలగూడ అసెంబ్లీ స్థానంతోపాటు, రెండు ఎమ్మెల్సీలు తీసుకొని ఉంటే ఎలాగోలా గౌరవం దక్కేదన్న చర్చ కూడా సీపీఎంలో జరుగుతోంది. ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో సరాసరి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. కాబట్టి తమ ఓట్లు గణనీయంగా ఉంటాయని లెఫ్ట్ నేతలు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని, కాబట్టి ఆ పార్టీకి ఎలాగైనా ఎంపీ సీట్లలో గండిపెట్టాలని వామపక్షాలు భావిస్తున్నాయి. చెరో ఎంపీ సీటు ఇస్తే సరేసరి... లేకుంటే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే విషయంలోనూ ఆ పార్టీలు సమాలోచన చేస్తున్నట్టు సమాచారం. మద్దతు ఇచ్చినందుకు చెరో ఎమ్మెల్సీ స్థానం కోరే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
ఆ పార్టీలకు ఓటేస్తే వృధా అయినట్టే: కిషన్‌రెడ్డి
సాక్షి, మెదక్: తెలంగాణలో బీఆర్ఎస్కు భవిష్యత్ లేదని.. కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే వృధా అయినట్టేనంటూ వ్యాఖ్యానించారు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. ఆదివారం ఆయన తూప్రాన్‌లో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్ఎస్లను అవినీతి పార్టీలుగా అభివర్ణించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17కి 17 సీట్లు గెలుస్తాం. హైదరాబాద్‌లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ని ఒడిస్తామన్నారు. రాహుల్ గాంధీ ఎంపీ ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లి పోతారంటూ కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే సత్తా రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఇంకో రెండు నెలలు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నాయకులను గ్రామాల్లో తిరగనివ్వం’ అంటూ కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఇదీ చదవండి: విచారణకు హాజరుకాలేను.. సీబీఐకి కవిత లేఖ -
అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణపై ప్రేమతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించలేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేవలం రాజకీయం కోసమే పెట్టాడని మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నా ధైర్యం చూసి.. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా కాకుండా బీఆర్ఎస్, బీజేపీ పనిచేస్తుంది. రాష్ట్రంలో 14 సీట్లు గెలవడమే మా టార్గెట్. దాన్ని అడ్డుకోడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. ..లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పుడు బండి సంజయ్.. కవిత అరెస్ట్ అవుతుందని చెప్పిండు ఏమైంది. ఇప్పుడు కవితకు నోటీసుల విషయం కూడా అంతా డ్రామానే. అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరాను. గాంధీ కుటుంబంపై ప్రేమతోనే కాంగ్రెస్‌లో చేరాను. రాహుల్ అంటే నాకు పిచ్చి.. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. రాహుల్‌ను ప్రధానమంత్రి చేయడం కోసం నిర్విరామంగా పనిచేస్తా’ అని జగ్గారెడ్డి తెలిపారు. -
లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారో తెలుసు: కేటీఆర్
సాక్షి, నాగర్ కర్నూల్: కుడితిలో పడ్డ ఎలుకల పరిస్థితిగా కాంగ్రెస్ స్థితి ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారో మీకే తెలుసు. రేవంత్‌రెడ్డి తిరిగి పాతమూలాలకు పోతున్నట్టు ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి’’ అంటూ ప్రశ్నించారు. ‘‘పథకాలు అమలు కోసం కొత్త కొర్రీలు పెడుతున్నారు. మార్చి 17 వరకు వేచి చూద్దాం.. అవసరమైతే 6 నెలలు ఆగుదాం. ఇంకా రైతు బంధు ఎప్పటికీ వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగంలో కేసీఆర్ పాలనపై తప్పుడు ప్రకటన చేయించారు. మోదీ హవా లేదు.. బోడీ లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని పార్టీ బీజేపీ. కృష్ణా ప్రాజెక్ట్‌లను కేఆర్ఎంబీకి అప్పగించిన చరిత్ర కాంగ్రెస్‌ది. మనం ప్రతిఘటిస్తే తిరిగి తీర్మానం చేశారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా అప్పర్ భద్రాకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది ’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘కారు సర్వీసింగ్‌కు పోయింది.. తిరిగి మంచి స్పీడుతో వస్తుంది. జైత్రయాత్ర పార్లమెంట్ ఎన్నికల నుంచి కొనసాగించాలి. ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా అండగా ఉంటాం. తెలంగాణ కోసం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. జైత్రయాత్ర పార్లమెంట్ ఎన్నికల నుంచే కొనసాగించాలి. ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా తామంతా గంటలో వచ్చి అండగా ఉంటాం’’ అంటూ కార్యకర్తలకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇదీ చదవండి: Hyderabad: ‘గ్యాస్’ బెనిఫిట్.. 10 లక్షల మందికే..