breaking news
-
రేవంత్ మూలాలు బీజేపీలో..
సిరిసిల్ల: రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని ‘పెద్దన్నయ్య’గా పొగిడి ఆయన ప్రాపకం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామా రావు విమర్శించారు. భవిష్యత్తులోనూ ప్రధాని ఆశీస్సులు ఉండాలని కోరడం ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పరోక్షంగా వేస్ట్‌ఫెలో అని రేవంత్ చెప్పినట్లు అయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ మూలాలు బీజేపీలో ఉన్నా యని... ఆయన మరో ఏక్నాథ్ షిండే (శివసేనను చీల్చి బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర సీఎం అయిన నేత), హిమంత బిశ్వశర్మ (కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి సీఎం అయిన అస్సాం సీఎం) అని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తా బాద్, సిరిసిల్లలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రుణమాఫీ, రైతుబంధు ఏదీ? బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ చెప్పారు. తాము తీసుకొ చ్చిన అనేక పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్నా రు. అలాంటిది రాష్ట్రంలో గుజరాత్ నమూనా అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని సీఎం రేవంత్ కోరడమంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించ పరచడమేనని మండిపడ్డారు. ఆయన సీఎం కావ డం మన కర్మ అని పేర్కొన్నారు. ప్రజలు మోస పోవాలని కోరుకుంటున్నారని గతంలో మీడియా ముందు రేవంత్ చెప్పారని, ఇప్పుడు అదే జరిగిందన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ రైతుబంధు వేయలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ఎర్రని ఎండల్లోనూ చెరు వులు మత్తడి దూకితే ప్రస్తుతం కరెంట్ కోతలు, నీరులేక పొలాలు ఎండిపోతున్నాయన్నారు. కాళేశ్వరం గురించి కాంగ్రెస్ సన్నాసులకు ఏం తెలుసు? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రూ. లక్ష కోట్లు గంగ పాలయ్యాయని కాంగ్రెసోళ్లు అంటున్నారని, ఆ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ సన్నాసులకు ఏం తెలుసని కేటీఆర్ ప్రశ్నించారు. సగం తెలంగాణ కాళేశ్వరం పరిధిలో ఉందని, 270 కి.మీ. సొరంగంతో వందల కి.మీ. కాల్వలతో పంపుహౌస్‌లు, విద్యుత్ సబ్స్టేషన్లతో గోదావరి జలాలను ఎత్తి పోస్తూ చెరువులను నింపామన్నారు. కాళేశ్వరం నీటితో 3.50 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి రైతులు చేరుకున్నారని వివరించారు. మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగిపోతే.. మొత్తం ప్రాజెక్టు గంగపాలైనట్లు ప్రచారం చేస్తున్నారని, మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్ చుట్టూరా కాఫర్ డ్యాం కట్టి ఇప్పటికీ నీటిని ఎత్తిపోయొచ్చని, పొలాలు ఎండకుండా చూడొచ్చన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి ఆ తెలివి లేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్‌పై కోపాన్ని రేవంత్ రైతులపై చూపుతున్నారని... సిరిసిల్ల పవర్‌లూం పరిశ్ర మకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా తనపై కోపాన్ని నేతన్నలపై చూపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రంగు.. కాంగ్రెస్ పొంగు తెలిసింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇస్తే ఇప్పుడు నియామక పత్రాలు అందిస్తూ 30 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ పేర్కొన డం మందికి పుట్టిన బిడ్డను సొంత బిడ్డగా ముద్దా డినట్లు ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి రంగు.. కాంగ్రెస్ పొంగు తెలిసిపోయిందని, 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తోందన్నారు. గురువారం సిరిసిల్లకు వస్తున్న రేవంత్... కేసీఆర్ హయాంలో సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని చూడాలని సూచించారు. మల్కపేట రిజర్వా యర్‌ను ప్రారంభించాలని, సిరిసిల్ల వర్కర్లను ఓనర్లను చేయాలని, సిరిసిల్ల నేతన్నలకు బతు కమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని, పాత బకాయిలను నేతన్నలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లాకు బండి ఏం చేశారు? కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సిరిసిల్ల జిల్లాకు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అమిత్ షా చెప్పులు మోయడం తప్ప ఒక్క గుడి.. ఒక్క బడి కట్టలేదని ఆరోపించారు. ప్రజలకు ఏం చేశారని ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. -
దీర్ఘకాలిక లక్ష్యంతోనే పొత్తు
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా దీర్ఘకాలిక లక్ష్యంతోనే బీఎస్పీతో పొత్తు కుదుర్చుకున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలతో ఉమ్మడి భేటీలో కేసీఆర్ మాట్లా డారు. బీఎస్పీతో పొత్తుకు సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌తో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలను వివరించారు. శక్తులను కూడదీసుకోవాలి ‘ప్రస్తుత పరిస్థితుల్లో మనం మన శక్తులను కూడదీసుకోవడంతోపాటు కలసి వచ్చే భావసా రూప్య శక్తులను కలుపుకొని పోవాలి. ఆ దిశగా మనం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రయోజనాలను కాపాడే దీర్ఘకాలిక లక్ష్యంతో కూడుకొని ఉంది. లౌకికవాద తాత్వికతతో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిన కృషి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ నేపథ్యంలో దళిత బహుజన శక్తులతో కలసి పనిచేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మరింత చేరువవుతాం. బీఎస్పీ కలసికట్టుగా పనిచేసి ప్రజాభీష్టాలను సంపూర్ణంగా నెరవేరుద్దాం. ఈ దిశగా మరిన్ని చర్చలు జరిపి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల విధివిధానాలను ఖరారు చేస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనను హర్షధ్వానాల నడుమ ముక్తకంఠంతో పార్టీ నేతలు ఏకీభవించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాదరణ పొందుదాం ‘ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పనిచేస్తోంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాదరణ పొందుదాం. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో నిలిచిన పెండింగ్ ప్రాజెక్టుల తోపాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఎత్తిపోతల పథకం ద్వారానే కొడంగల్‌కు పుష్కలంగా సాగునీటిని తరలించవచ్చు. అయినా ఉన్నదాన్ని తీసేసి కొడంగల్‌కు లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలను కోవడం సరైన నిర్ణయం కాదు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీని వీడే వారి గురించి ఆలోచించకుండా ప్రజా సమస్యలపై పోరాడదా మని పిలుపునిచ్చారు. డొల్లతనంతో కాంగ్రెస్ సర్కార్ అభాసుపాలు ‘ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాగు, సాగునీరు, విద్యుత్ వంటి కనీస అవసరాలను తీర్చలేకపోవడంతో ప్రజలు విస్మయం చెందుతున్నారు. కొత్తగా ఇచ్చే తెలివి లేక గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా కొనసాగించలేక పాలనలోని డొల్లతనాన్ని స్వయంగా కాంగ్రెస్ సర్కార్ బయటపెట్టుకొని అభాసుపాలవు తోంది. ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు కాకముందే ప్రజావ్యతిరేకతను మూటకట్టు కుంది. అధికారం కోసం ఎన్నికల ముందు గ్యారంటీల పేరిట అలవికాని హామీలు ఇచ్చింది. ఇప్పుడు అమలు చేతకాక అబద్ధాలకు, బెదిరింపులకు దిగి తప్పించుకుంటోంది’ అని కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఆయన గెలుపు కోసం అను సరించాల్సిన కార్యాచరణౖపై నేతలకు దిశాని ర్దేశం చేశారు. తక్షణమే మండలాలవారీగా ఎన్నికల సన్నాహక సమావేశాల ఏర్పాటుకు షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఉంటాయని, త్వరలో మహబూ బ్‌నగర్ పట్టణంలో భారీ బహిరంగ సభ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తారనే అంశాన్ని కేసీఆర్ సూత్రప్రాయంగా వెల్లడించారు. కాగా, ఉచిత ఎల్ఆర్ఎస్ బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం, శుక్ర వారం శివరాత్రి పర్వదినం కావడంతో ఉమ్మడి జిల్లాలవారీగా నిర్వహిస్తున్న భేటీలకు బీఆర్ ఎస్ 3 రోజుల బ్రేక్ ఇచ్చింది. ఈ నెల 9 నుంచి ఉమ్మడి జిల్లాలవారీగా కేసీఆర్‌తో భేటీలు తిరిగి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. -
కలసి నడుస్తాం.. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో బీఆర్ఎస్ జట్టు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కలసి నడవాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిర్ణయించాయి. పొత్తు విధివిధానాలు, సీట్ల సర్దుబాటు అంశాలపై బుధవారం లోతుగా చర్చించాలని ఇరు పార్టీల అధ్యక్షులు నిర్ణయానికి వచ్చారు. చర్చల సారాంశాన్ని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి వివరించి ఆమోదం పొందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, కె.చంద్రశేఖర్‌రావు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మంగళవారం సంయుక్త ప్రకటన చేశారు. కేసీఆర్‌తో ప్రవీణ్ భేటీ.. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉంటానని ప్రకటించిన ప్రవీణ్‌కుమార్ మంగళవారం ఉదయం అనూహ్యంగా నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట బీఎస్పీ ప్రధాన కార్యదర్శి విజయ్ ఆర్య, ఉపాధ్యక్షుడు దయానంద్‌రావు ఉన్నారు. వారికి రాజ్యసభ ఎంపీ జె.సంతోష్ కుమార్ స్వాగతం పలికారు. కేసీఆర్‌తో భేటీలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 3 గంటలపాటు జరిగిన ఈ భేటీలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. కేసీఆర్‌తో కలసి ప్రవీణ్ కుమార్, ఇతర నేతలు మధ్యాహ్న భోజనం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కలసి పోటీ చేయాలనే సూత్రప్రాయ అంగీకారం కుదిరిన నేపథ్యంలో కేసీఆర్, ప్రవీణ్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సిద్ధాంతపరంగా సారూప్యత ఉంది: కేసీఆర్ ‘వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా ఇరు పార్టీల నడుమ సారూప్యత ఉంది. మేము అమలు చేసిన దళితబంధు, దళిత సంక్షేమం, రెసిడెన్షియల్ పాఠశాలలు, బలహీనవర్గాల అభ్యున్నతి తదితరాల ఆధారంగా ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలసి చర్చించాం. బీఎస్పీ హైకమాండ్ అనుమతితో చర్చించి కలసి పనిచేయాలని స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాం. మిగతా విషయాలు ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తాం. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై బుధవారం చర్చిస్తాం. పొత్తుపై అవగాహన ఏర్పడిన నేపథ్యంలో గౌరవప్రదంగా సీట్ల పంపిణీ ఉంటుంది. నేను ఇప్పటివరకు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో మాట్లాడలేదు. కానీ ఆమెతో ఉన్న పాత పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా మాట్లాడతా’అని కేసీఆర్ తెలిపారు. రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: ఆర్.ఎస్. ప్రవీణ్ ‘కేసీఆర్‌ను కలవడం ఆనందంగా ఉంది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా లౌకికత్వం ప్రమాదంలో ఉంది. లౌకికత్వాన్ని దెబ్బతీసేందుకు రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కుట్రలు చేస్తోంది. లౌకిక భావాలతో నిరంతరం లౌకికవాదాన్ని కాపాడిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను మాయావతి ఆశీస్సులతో కలిశా. తెలంగాణలో రాజ్యాంగం, లౌకికత్వానికి ప్రమాదం పొంచి ఉంది. లౌకికత్వాన్ని దెబ్బతీసే విషయంలో కాంగ్రెస్ కూడా బీజేపీలాగానే మారుతోంది. ఇరు పార్టీల ముప్పు నుంచి తెలంగాణను కాపాడేందుకు కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. సీట్ల సర్దుబాటు విషయంలో మా అధిష్టానానికి నివేదిస్తాం. ఇరు పార్టీల స్నేహం తెలంగాణలో ప్రజల జీవితాలను మారుస్తుంది. మా స్నేహాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇక్కడి ప్రజల విలువలు, గంగా–జమునా తహజీబ్ సంస్కృతిని కాపాడతాం. బహుజన వర్గాల జీవితాలు కూడా బాగుపడతాయి. రేవంత్ ప్రభుత్వంపట్ల నిరుద్యోగులు సంతోషంగా లేరు. పట్టుమని 4 నెలలు కాకముందే రోడ్డెక్కే పరిస్థితి ఉంది’అని ఆర్.ఎస్. ప్రవీణ్ పేర్కొన్నారు. -
కొత్త ఏటీఎం తెలంగాణ: ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంగా తయారైందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకోవడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ పరస్పరం ‘కవర్ ఫైర్’ చేసుకుంటున్నాయని విమర్శించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు. ఈ పార్టీల మధ్య బలమైన అవినీతి బంధం ఉంది. దీని గురించి ప్రపంచం అంతా తెలుసు. మీరు తిన్నారు.. మేం కూడా తింటాం అన్నట్టుగా రెండు పార్టీల తీరు ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండిటిదీ ఒకే బాట.. అదే అబద్ధాలు.. దోపిడీ (ఝూట్.. లూట్)..’ అంటూ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడి రైతుల నుంచి బీఆర్ఎస్ సర్కార్ వేల కోట్లు దోచుకుంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై విచారణ జరిపించకుండా మౌనం వహించడమే కాకుండా దానికి సంబంధించిన ఫైళ్లు మూసేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కుంభకోణాల్లో కాంగ్రెస్ భాగస్వామి అయ్యిందని అన్నారు. ఈ రెండు పార్టీల ‘కవర్ ఫైర్’ ఎక్కువ రోజులు సాగబోదని, ఉగ్రవాదంపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మోదీ ప్రభుత్వం.. ‘ఎయిర్ స్ట్రైక్’ కూడా చేస్తుందని హెచ్చరించారు. అయితే అందుకు ప్రజల పూర్తి ఆశీర్వాదం కావాలని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేలా, దేశవ్యాప్తంగా ఎన్డీయే పక్షం 400 స్థానాలకు మించి గెలిచేలా ఓట్లు వేసి నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. (నాలుగు వందల సీట్లు దాటాలి. బీజేపీకి ఓటు వేయాలి అంటూ తెలుగులో పిలుపునిచ్చారు) మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పలు అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు. అనంతరం విడిగా ఏర్పాటు చేసిన బీజేపీ ‘విజయ సంకల్ప యాత్ర’ బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలుగులో ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారాలు’ అంటూ ప్రసంగం ప్రారంభించారు. నేను చెప్పానంటే తప్పకుండా చేసి చూపిస్తా ‘తెలంగాణ ప్రజల ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలను తెలంగాణ అభివృద్ధి రూపంలో రెండింతలు చేసి తిరిగి ఇచ్చేస్తా. ఇది మోదీ గ్యారంటీ. నేను ఏదైనా చెప్పానంటే దానిని తప్పకుండా చేసి చూపిస్తాం. మనందరం కలిసి భారత్‌ను ప్రపంచంలోనే కొత్త శిఖరాలకు తీసుకెళదాం. తెలంగాణ ప్రజల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీని బాగా ఆదరిస్తున్నారు. మీ ఆశీర్వాదాలు వృథా కానివ్వను. మోదీ గ్యారెంటీ అంటే.. ఇచ్చిన హామీని నెరవేర్చే గ్యారెంటీ. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేశాం. అయోధ్యలోని భవ్య మందిరంలో శ్రీరాముడికి స్వాగతం పలికాం. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికశక్తిగా మన దేశం మారింది. ఆర్థిక ప్రగతిలో మన దేశం కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని చెప్పి, దానిని నిజం చేసి చూపాం..’ అని మోదీ అన్నారు. మూడేళ్లలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ‘ఇప్పుడు మరో గ్యారంటీ ఇస్తున్నా..రాసుకోండి. వచ్చే మూడేళ్లలో విశ్వంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగేలా చేస్తాం. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే హామీ. (ఈ వాక్యాన్ని తెలుగులో ఉచ్ఛరించారు. దీంతో పలువురు సభికులు ‘మోదీ మోదీ’ అని పెద్దపెట్టున హర్షధ్వానాలు చేస్తూ నినదించారు. తెలంగాణ ప్రజలు తామే మోదీ కుటుంబమని చెబుతున్నారంటూ ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. మేమే మోదీ కుటుంబం అంటూ ప్రజలతో నినాదాలు చేయించారు). సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ ద్వారా మేము అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నాం..’ అని ప్రధాని తెలిపారు. తెలంగాణకు ఎక్కువ నిధులు ‘తెలంగాణ అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాం. వేలాది కోట్లు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై పెడుతున్నాం. వీటి వల్ల తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి వారి స్వప్నాలు సాకారమవుతాయి. రాష్ట్ర ప్రజల స్వప్నాలను, మోదీ కుటుంబసభ్యుల కలలను సాకారం చేయాలనే సంకల్పంతో ముందుకెళుతున్నాం. మహిళలు, దళితులు, రైతులు.. ఇలా అన్ని వర్గాల వారికి వివిథ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి విషయంలో ఏ చిన్న అవకాశాన్నీ విడిచిపెట్టబోమని గ్యారంటీ ఇస్తున్నాం. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఇచ్చిన గ్యారెంటీని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. తెలంగాణలోని రైతుల నుంచి గత పదేళ్లలో ధాన్యం, పత్తి పెద్దమొత్తంలో కొనుగోలు చేశాం. రాష్ట్రంలోని 40 లక్షలకు పైగా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రయోజనం చేకూరింది..’ అని మోదీ చెప్పారు. నాకు కుటుంబం లేదంటున్నారు.. ‘దేశ ప్రజలు, వారి కుటుంబాలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీల అమలుకు నేను చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ, వారి మిత్ర పక్షాలు నన్ను, నా కుటుంబాన్ని తిడుతున్నాయి. శాపనార్థాలు పెడుతున్నాయి. మోదీని, ఆయన కుటుంబాన్ని ఎందుకు తిడుతున్నారు? వాళ్ల కళ్లు ఎందుకు ఎర్రబడుతున్నాయి? నేను వారి రూ.వేలు, లక్షల కోట్ల కుంభకోణాలు, అవినీతి గుట్టును విప్పుతున్నందుకు అంత ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో కశీ్మర్ నుంచి తమిళనాడు దాకా కుటుంబ పార్టీల పాలన కొనసాగుతోంది. ఎక్కడెక్కడైతే కుటుంబ పార్టీలు అధికారంలో ఉన్నాయో అక్కడ వారి పరివారాలు ఆర్జనలో బలోపేతమై, రాష్ట్రాలు మాత్రం బలహీనమై పోయాయి. కుటుంబ పార్టీలకు దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా? ఒక ముఖ్యమంత్రి కుటుంబం, దగ్గరి బంధువుల్లో 50 మంది ఉన్నతస్థానాల్లో ఆసీనులయ్యారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేను గళమెత్తితే...నా ప్రశ్నలకు బదులివ్వకుండా మోదీకి కుటుంబమే లేదంటూ విరుచుకుపడుతున్నారు. వీరి కుటుంబ, పరివారవాద రాజకీయాలకు వ్యతిరేకంగా గట్టిగా గొంతు విప్పి చర్యలు తీసుకోవడం సరైనదేనా? (సభికులు అవును అంటూ కేకలు వేశారు)’ అని మోదీ అడిగారు. 140 కోట్ల ప్రజలే నా కుటుంబసభ్యులు ‘కుటుంబ పార్టీల కారణంగా ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. కాంగ్రెస్ పార్టీ పరివార వాద పార్టీగా మారాక 50 ఏళ్లకు తక్కువ వయస్సు ఉన్న వారిని ముందుకెళ్లకుండా అడ్డుకుంది. ఏదైనా పదవిలో కూర్చోబెట్టాలంటే 80, 85 ఏళ్లు దాటిన వారిని తీసుకొస్తున్నారు. యాభై ఏళ్లలోపు వారు వస్తే తమను ఓవర్టేక్ చేస్తారనే భయం వారిని పట్టుకుంది. వారికి వారి కుటుంబమే సర్వస్వం. దీనికి భిన్నంగా దేశంలోని ప్రతి కుటుంబం నాదే. 140 కోట్ల ప్రజలే నా కుటుంబసభ్యులు. దేశంలోని ప్రతి చెల్లి, ప్రతి తల్లి, యువత నా కుటుంబమే. కాంగ్రెస్, ఇండి కూటమికి ఇది అర్థం కావడంలేదు. వారికి వారి కుటుంబప్రయోజనాలే ముఖ్యమైతే నాకు దేశ హితమే సర్వస్వం. వారు తమ కుటుంబ ప్రయోజనాల కోసం దేశహితాన్ని బలిపీఠం ఎక్కించారు. మోదీ మాత్రం దేశ హితం కోసం తనను తాను సమర్పించుకుంటున్నాడు..’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. నా సంపాదన ప్రజలకే ఖర్చు చేస్తున్నా.. ‘దేశ రాజకీయాల్లోకి నీతివంతమైన యువతను తీసుకురావాల్సిన అవసరం ఉంది. నాకు అవకాశం దొరికినపుడు, గతంలో సీఎంగా ఉన్నపుడు, ఇప్పుడు నా సంపాదన నుంచి ప్రజల కోసం ఖర్చు చేశా. దానాలు చేశా. పేద పిల్లల చదువులకు కేటాయించా. కుటుంబ రాజకీయాలు చేసేవారు అధికారంలో ఉన్నపుడు వచ్చిన బహుమానాలను సొంతంగా వాడుకున్నారు. తాము సంపాదించిన నల్లధనాన్ని చట్టబద్ధం చేసుకునే ప్రయత్నం చేశారు. నేను మాత్రం గుజరాత్ సీఎంగా, దేశ పీఎంగా వచ్చిన ఇలాంటి గిఫ్ట్‌లను ఒక భాండాగారంలో భద్రపరిచి, తర్వాత వేలం వేసి వచ్చిన మొత్తాన్ని గంగమ్మ తల్లి సేవలో ఖర్చు చేస్తున్నా. మీ సేవకుడిగా దాదాపు రూ.150 కోట్లు ప్రజల సేవలో ఖర్చు చేశా. నేను కూడా పరివార వాదిని అయితే ఈ సొమ్మంతటినీ సొంతానికి తీసుకునేవాడిని. మీరు నా కుటుంబసభ్యులు. మీ గౌరవాన్ని తగ్గించి తలదించుకునే పని ఎప్పటికీ చేయను. కొందరు నల్లధనం దాచుకోవడానికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఓ వర్గం తమ కుటుంబాలకు విలాసవంతమైన భవనాలు కట్టించారు. మోదీ ఇంతవరకు సొంతానికి ఒక్క ఇల్లు కూడా కట్టించుకోలేదు. కానీ దేశంలో పేదలకు మాత్రం 4 కోట్ల ఇళ్లు కట్టించాం. అందుకే కోట్లాది మంది ప్రజలు తాము మోదీ కుటుంబ సభ్యులమని అంటున్నారు..’ అని మోదీ తెలిపారు. -
సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్‌ను రేవంత్‌రెడ్డే బొందపెడతారంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లోనూ మోదీ ఆశీస్సులు ఉండాలని రేవంత్ అనడంలో అర్థమేంటి?. మళ్లీ మోదీనే ప్రధాని అని రేవంత్ ఒప్పుకున్నారా?’’ అంటూ ప్రశ్నించారు. తంగళ్లపల్లి మండలంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రధాని మోదీకి ఎంత గౌరవం ఇచ్చామో అందరికి తెలుసు. మనకు ఏం చేయలేదనే 2021 నుంచి మోదీ తెలంగాణకు వచ్చినపుడు కేసీఆర్ వెళ్లలేదు. మోదీనీ బుట్టలో వేసుకోవడానికి కొన్ని మాటలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నాలుగు నెలల క్రితం గుజరాత్‌ను కించపరిచిన రేవంత్.. నిన్న మోదీ ముందు దేశానికి గుజరాత్ మోడల్ అన్నారు. వచ్చే రోజుల్లో రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేలాగా మారి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం గ్యారంటీ’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘‘ఎర్రటి ఎండలో కూడా కేసీఆర్ రైతులకు నీళ్లు ఇచ్చాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్లో వంద భాగాలు ఉన్నాయి, మూడు బ్యారేజీలు ఉన్నాయి. 270 పైగా సొరంగ మార్గాలు ఉన్నాయి. రోజుకు 5 వేల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయి. వాటిని ఆపాలని రేవంత్ రెడ్డి ఎందుకు ప్రయత్నం చేయడంలేదు’’ అంటూ కేటీఆర్ నిలదీశారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు -
అందులో ఎలాంటి రాజకీయం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తనను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అంటున్నారు. మంగళవారం సాయంత్రం మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ‘‘తెలంగాణలో ప్రతిపక్ష నేత లేనే లేరు. ఉంటే ఆయన అసెంబ్లీకి వచ్చేవారు కదా. అసెంబ్లీకి రాని నేత అసలు ప్రతిపక్ష నేత ఎలా అవుతారు. ప్రధానిని పెద్దన్న అనడంలో తప్పేం ఉంది?. దేశానికి ప్రధాని పెద్దన్నే కదా. కేసీఆర్ లాగా మోదీకి నేను చెవిలో ఏం చెప్పలేదు. రాష్ట్రానికి రావాల్సిన విషయాల్నే మైకులో చెప్పాను.. .. కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేస్తే.. వంద రోజుల్లో పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. కాళేశ్వర్రావు కట్టిన మేడిగడ్డ మేడి పండు అయ్యింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడే బ్యారేజ్ కూలిపోయింది. మేడిగడ్డను రిపేర్ చేయాలని కేసీఆర్ కోరడం తప్పును కప్పిపుచ్చుకోవడమే అవుతుంది. మేడిగడ్డ దొంగలంతా మా వెంట రాకుండా ప్రత్యేకంగా వెళ్లి చూసొచ్చారు. అలాగే.. కేసీఆర్‌పై లీగల్ చర్యలకు ప్రాసెస్ ఉంటుంది. ఫైనల్‌గా కేంద్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది రేవంత్ అన్నారు. .. కేసీఆర్ చదివింది బీఏ. కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో పీజీ చదివినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ మాకు మిత్రుడేం కాదు. నన్ను ఇతర పార్టీ ఎమ్మెల్యే లు కలవడం లో ఎలాంటి రాజకీయం లేదు. సీఎం ను ఎమ్మెల్యే లు కలిస్తే ఏదో జరుగుతున్నట్లుగా కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ లేనే లేదు. లేని పార్టీని ఎందుకు తిట్టాలి. కర్ణాటకలో 40 శాతం కమీషన్‌పై మోదీ ఎందుకు మాట్లాడరు?. జీఎస్టీ వసూళ్లలో పెద్ద కుంభకోణమే జరిగింది. ఆ దొంగల్ని బయటకు తీస్తున్నాం. ప్రభుత్వం పడిపోతుందని కొందరు పిచ్చిపట్లినట్లు మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం ఎందుకు పడిపోతుందో విమర్శించే వారే చెప్పాలి.. ఇంకా సీఎం రేవంత్ ఏమన్నారంటే.. .. సస్పెండైన ప్రణీత్ రావ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజు కు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగింది. జీఏస్టీ 500 కోట్ల ఆదాయం పెరిగింది. ఎల్ ఆర్ ఎస్ పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తాం. సీఏంఆర్ఎఫ్ పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుంది... చర్యలు తీసుకుంటాం. మా పరిపాలన రిఫరెండం గా ఎన్నికలకు వెళ్తాం. 14 కు పైగా సీట్లు గెలుస్తాం... మా కుటుంబం లో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయరు.. .. ట్యాక్స్ పేయర్స్ కు రైతు బంధు ఎందుకు? వ్యవసాయం చేసే వారికే రైతు బంధు. అసెంబ్లీ లో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. అన్ని ప్రైవేటు యూనివర్సిటీ లపై విచారణ జరుపుతాం. జీవో 3 పై కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నాం. రాహుల్ గాంధీ తెలంగాణ లో పోటీ చేస్తే రాష్ట్ర గౌరవం పెరుగుతుంది’’ అని సీఎం రేవంత్ అన్నారు. -
మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మరో లోక్‌సభ అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఇప్పటివరకు 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. నలుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించగా, అందులో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు. నామా నాగేశ్వర్రావు ఖమ్మం నుంచి, మాలోత్ కవిత మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాల నుంచి తిరిగి బరిలోకి దిగనున్నారు. ఇక కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారు. కాగా, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దాదాపుగా కొత్తవారే బరిలోకి దిగే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరిద్దరు సిట్టింగ్‌లు మినహా మిగతా చోట్ల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొత్త నేతలు పోటీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడటం, మరికొందరు పోటీకి దూరంగా ఉండనుండటమే దీనికి కారణమని అంటున్నాయి. లోక్‌సభలో బీఆర్ఎస్కు తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు ఉండగా.. అందులో ముగ్గురు పార్టీని వీడారు. దీంతోపాటు ఇప్పటికే అభ్యర్థిత్వం ఖరారైన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కారు గుర్తుపై పోటీచేసే విషయంలో పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఈక్రమంలో పక్షం రోజులుగా ఆయన బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో.. రంజిత్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరవచ్చని లేదా బీఆర్ఎస్లోనే కొనసాగుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: బీఆర్ఎస్ నుంచి లోక్‌సభకు కొత్త వారే.. -
తెలంగాణ 'గేట్‌వే ఫర్ సౌత్ ఇండియా' - నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' ఈ రోజు (మంగళవారం) తెలంగాణలోని సంగారెడ్డిలో రూ.7200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రగతికి తన నిబద్ధతను వివరించారు. రాష్ట్రాల అభివృద్దే దేశాభివృద్ధి అనే స్పూర్తితో తాను పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణను 'గేట్‌వే ఆఫ్ సౌత్ ఇండియా' అని పిలవవచ్చని ఈ సందర్భంగా మోదీ అన్నారు. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, గత పదేళ్లుగా తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ఈ రోజు 140 కోట్ల భారతీయులు అభివృద్ధి చెందాలని దానికోసం నిర్చయించుకున్నట్లు మోదీ వెల్లడించారు. తప్పకుండా 2047కు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి ఆధునిక మౌలిక సదుపాయాలు చాలా అవసరం. అందువల్ల, ఈ ఏడాది బడ్జెట్లో మౌలిక సదుపాయాల కోసం కేంద్రం రూ.11 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో తెలంగాణ గరిష్ట ప్రయోజనం పొందాలని కేంద్రం కోరుతోందని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులలో ఎక్కువ శాతం రోడ్డు, రైలు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ వంటి రంగాలకు సంబంధించినవి ఉన్నాయని వెల్లడించారు. అంతే కాకుండా పౌర విమానయాన రంగంలో రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO) కేంద్రాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. -
బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారైంది. కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కలిసి పొత్తుపై చర్చించారు. అయితే.. తెలంగాణను కాపాడేందుకే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలిసి ఆయన మీడియా ముందు మాట్లాడారు. బీఆర్ఎస్, బీఎస్పీ చాలా అంశాల్లో కలిసి పని చేసింది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. కేవలం ఆర్ఎస్ ప్రవీణ్‌తోనే ఇప్పడు మాట్లాడాం. రేపు బీఎస్పీ అధినేత్రి మాయవతితో మాట్లాడతా. కచ్చితంగా కలిసి పోటీ చేస్తాం. సీట్ల పంపకాలపై త్వరలోనే ప్రకటన చేస్తాం అని కేసీఆర్ చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌తో రాజ్యాంగానికి ముప్పు ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది. ఆ రెండు పార్టీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మా స్నేహం తెలంగాణ ను పూర్తిగా మారుస్తుంది అని అన్నారు. నాగర్‌కర్నూల్ నుంచి పోటీ? ఇక పొత్తు ఖరారు నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ స్థాయి సమావేశం జరిగింది. అయితే.. మహబూబ్ నగర్ లోక్‌సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కానీ, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ స్థానం సమావేశం మాత్రం జరగలేదు. రెండ్రోజుల తర్వాత సమావేశం ఉంటుందని చివరి నిమిషంలో ప్రకటించడంతో.. అక్కడి కీలక నేతలు తెలంగాణ భవన్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో.. ప్రవీణ్‌కుమార్ పేరు పరిశీలన కోసమే ఈ మీటింగ్ వాయిదా పడి ఉండొచ్చన్న సంకేతాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరారు. ఇటీవల బీజేపీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో రాములు తనయుడు భరత్‌కు నాగర్ కర్నూల్ సీటు కేటాయించింది కమలం పార్టీ. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఈ స్థానానికి గట్టి పోటీనే ఉంది. అయితే.. సీనియర్ నేత మల్లు రవిని పార్టీ బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారితో నంది నగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ ప్రతినిధుల బృందం. pic.twitter.com/bynXDHVXMB — BRS Party (@BRSparty) March 5, 2024 -
పరివార్.. ప్రధానిపై లాలూ విమర్శలతో రాజకీయ రగడ
న్యూఢిల్లీ/ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ నేత లాలూప్రసాద్ విమర్శలు పెను రాజకీయ వివాదానికి దారి తీశాయి. దేశవ్యాప్తంగా మంటలు రాజేశా యి. మోదీకి కుటుంబమూ లేదు, సంతానమూ లేరంటూ ఆదివారం పట్నా జన్సందేశ్ ర్యాలీలో లాలూ ఎద్దేవా చేశారు. ఆయనసలు హిందువే కాదంటూ ఆక్షేపించారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్‌తో పాటు ఇండియా కూటమికి చెందిన విపక్ష నేతల సమక్షంలో లాలూ చేసిన ఈ వ్యాఖ్యలకు మోదీ సోమవారం గట్టిగా కౌంటరిచ్చారు. దేశం కోసమే జీవితాన్ని అంకితం చేశానని చెప్పారు. భారతదేశం, 140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమని పునరుద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలంతా వెంటనే అందిపుచ్చుకున్నారు. తామంతా మోదీ కుటుంబమేనంటూ ఆయనకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మొదలుకుని రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జి.కిషన్‌రెడ్డి, అర్జున్‌రామ్ మేఘ్వాల్ తదితర కేంద్ర మంత్రులు, నేతలంతా ఈ మేరకు ప్రకటనలు చేశారు. మోదీపై లాలు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. విపక్షాలపై పెద్దపెట్టున విరుచుకుపడ్డారు. తామంతా మోదీ కుటుంబమేనంటూ ప్రధానికి బాసటగా నిలిచారు. అంతేగాక సోషల్ మీడియా అకౌంట్లలో తమ పేరు పక్కన ‘మోదీ కా పరివార్’ అంటూ జోడించుకున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు కూడా ఇదే బాటపట్టి ‘మోదీ కా పరివార్’ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. చివరికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా తన ఎక్స్ ప్రొఫైల్‌కు ‘మోదీ కా పరివార్’ అని చేర్చుకున్నట్టు ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి! విపక్షాలు మరోసారి లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి చేజేతులా పదునైన నినాదమే అందించాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిల్లర వ్యాఖ్యలు: బీజేపీ మోదీపై వ్యక్తిగత విమర్శలు విపక్షాలకు కొత్తేమీ కాదంటూ బీజేపీ ఆగ్రహం వెలిబుచి్చంది. ‘‘17 ఏళ్లుగా ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాయి. ఇది నిజంగా బాధాకరం’’ అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు. విపక్షాల రాజకీయ దురహంకారానికి దేశ ప్రజలు తగిన విధంగా బదులు చెబుతారన్నారు. ‘‘మొత్తం దేశాన్నే తన కుటుంబంగా మార్చుకున్నారు మోదీ. అందుకే ఎంత పని చేసినా ఆయనకు అలుపే రాదు. గత పదేళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు’’ అని చెప్పారు. మోదీకి సంతానం లేదన్న లాలు వ్యాఖ్యలను కూడా సుధాన్షు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘హిందూ మతం గురించి లాలుకేం తెలుసు? అసలు విపక్ష ఇండియా కూటమిలో ఒక్కరు కూడా హిందువు లేదు! సనాతన ధర్మంలో భక్తికే పెద్దపీట తప్ప కుమారునికి కాదు. భారత్‌లో గురుశిష్య సంప్రదాయముంది తప్ప తండ్రీ కొడుకుల సంప్రదాయం లేదు. రామ భక్తుడైన హనుమంతునికే ఊరూరా గుళ్లున్నాయి. రాముని కుమారులు లవకుశులకు ఎక్కడైనా ఆలయముందా?’’ అని ప్రశ్నించారు. ‘‘మోదీ నాయకత్వంలో 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం మోదీ లక్ష్యమైతే ఎలాగైనా అధికారం సాధించి 2047 దాకా కూడా దాన్ని తమ కుటుంబాల గుప్పెట్లోనే ఉంచుకోవడం విపక్షాల లక్ష్యం’’ అంటూ దుయ్యబట్టారు. వీలైనంత భారీగా అవినీతికి పాల్పడి, తద్వారా తాము, తమ కుటుంబాలు మాత్రమే తరతరాలకు సరిపడా సంపద పోగేసుకోవాలన్నది విపక్షాల ఉద్దేశమని ఆరోపించారు. నేరగాళ్లే మోదీ పరివారం: కాంగ్రెస్ ఇండియా కూటమి నానాటికీ బలోపేతమవుతుండటం చూసి అధికార బీజేపీలో అక్కసు పెరిగిపోతోందని కాంగ్రెస్ ఆరోపించింది. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘మోదీ కా పరివార్’ పేరిట కొత్త డ్రామాకు తెర తీసిందని మండిపడింది. ‘‘రైతులను కార్లతో తొక్కించి చంపిన నేరగాడి తండ్రయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, క్రీడాకారిణులను లైంగికంగా వేధించిన ఎంపీ బ్రిజ్‌భూషణ్‌సింగ్ వంటి బీజేపీ నేతలే నిజమైన మోదీ కుటుంబం. అదే ‘మోదీ కా అస్లీ పరివార్’’ అంటూ ఎద్దేవా చేసింది. ‘‘మణిపూర్ హింసాకాండకు బలైన మహిళలకు మోదీ కుటుంబంలో చోటేది? ఢిల్లీ శివార్లలో నిరసన గళమెత్తుతున్న రైతులను తన కుటుంబంగా చెప్పుకోగలరా? ఉపాధి లేక నిత్యం ఆత్మహత్యల బాట పడుతున్న నిరుద్యోగ యువతను తన కుటుంబమని చెప్పుకోరేం? బీజేపీ సర్కారు కేవలం క్రూరమైన నేరగాళ్లు, మోదీ సన్నిహిత పెట్టుబడిదారుల కోసం మాత్రమే పని చేస్తోంది’’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ దుయ్యబట్టారు. ‘‘రైతుల హత్య, మహిళలపై అత్యాచారాలు... ఇదే నిజమైన మోదీ కుటుంబం’’ అంటూ కాంగ్రెస్ నేతలంతా విమర్శలు గుప్పిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్, అజయ్ మిశ్రా తదితరులు తమ సోషల్ హ్యాండిల్స్‌కు ‘మోదీ కా పరివార్’ అని జోడించుకోవడాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. సంఘ్ పరివార్ కాస్తా చివరికి మోదీ పరివార్‌గా మారిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. 2019లో ‘మై భీ చౌకీదార్’ సాక్షి, న్యూఢిల్లీ: మోదీపై విపక్షాలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఇది తొలిసారి కాదు. 2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీపై ‘మౌత్ కా సౌదాగర్ (మృత్యు వ్యాపారి)’ అంటూ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో మత అల్లర్లకు కారకుడనే అర్థంలో ఆమె చేసిన విమర్శలు వివాదానికి దారి తీశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బాగా నష్టం చేశాయి. అనంతరం 2018లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్ హై’ (కాపలాదారే దొంగ) అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. తాను దేశానికి చౌకీదార్‌లా ఉంటానన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్ ఎక్కుపెట్టిన ఆ విమర్శలూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నింటికీ తీవ్రంగా చేటు చేశాయి. ఆ వ్యాఖ్యలను బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకుని ఘనవిజయం సాధించింది. మోదీ తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో ‘నరేంద్ర మోదీ చౌకీదార్’ అని చేర్చుకున్నారు. బీజేపీ నేతలు కూడా ‘మై భీ చౌకీదార్’ అని ప్రొఫైల్స్‌లో చేర్చుకున్నారు. ‘‘నువ్వేమీ మరీ అంత పెద్దవాడివి కాదు. మాట్లాడితే కుటుంబ రాజకీయాలంటూ మాపై పదేపదే దాడికి దిగుతున్నావ్! కుటుంబాల గురించి నీకెందుకు? నీకు సంతానం ఎందుకు లేదో చెప్పు. కుటుంబమే లేదు నీకు. అయోధ్యలో రామాలయం కట్టామంటూ గొప్పలు చెప్పుకుంటావు. కానీ నువ్వసలు హిందువువే కాదు. అమ్మ మరణిస్తే ప్రతి హిందువూ శిరోముండనం చేయించుకుంటాడు. నువ్వు మాత్రం చేయించుకోలేదు. కారణమేంటో చెప్పు! దేశమంతటా విద్వేష వ్యాప్తి చేస్తున్నావ్!’’ – పట్నా ర్యాలీలో మోదీపై లాలూ విమర్శలు ‘‘ఇండియా కూటమిలోని విపక్ష నేతలంతా అవినీతి, వారసత్వ, సంతుస్టీకరణ రాజకీయాల్లో పీకల్లోతున కూరుకుపోయారు. పార్టీ ఏదైనా ఝూట్–లూట్ (అబద్ధాలు, దోపిడీ) అన్నదే వాళ్లందరి నైజం. దీనిపై ప్రశి్నస్తే నాకు కుటుంబమే లేదంటూ ఆక్షేపిస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం. నా భారతదేశమే నా కుటుంబం. ఒక సేవకునిలా ప్రజా క్షేమానికే నా జీవితాన్ని అంకితం చేశా. దేశసేవ చేయాలనే కలను నిజం చేసుకోవడానికి చిన్న వయసులోనే ఇల్లు వీడా. నా జీవితమంతా తెరిచిన పుస్తకం. ప్రతి భారతీయునికీ ఆ విషయం తెలుసు’’ – ఆదిలాబాద్ సభలో మోదీ -
నలుగురితో బీఆర్ఎస్ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఖరారు చేశారు. నలుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించగా, అందులో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు. నామా నాగేశ్వర్రావు ఖమ్మం నుంచి, మాలోత్ కవిత మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాల నుంచి తిరిగి బరిలోకి దిగనున్నారు. ఇక కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారు. ఆదివారం ఉమ్మడి కరీంనగర్, సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. ఆయా సమావేశాల్లో పార్టీ నేతలు చర్చించి అభ్యర్థుల పేర్లకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు కేసీఆర్ ప్రకటించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంయుక్త ఎన్నికల ఇన్చార్జిలుగా ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను కేసీఆర్ నియమించారు. నేడు ఉమ్మడి పాలమూరు నేతలతో భేటీ లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో భాగంగా కేసీఆర్ మంగళవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. నాగర్‌కర్నూలు సిట్టింగ్ ఎంపీ పి.రాములు ఇప్పటికే బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు పి.భరత్‌ను బీజేపీ నాగర్‌కర్నూలు అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల నుంచి బీఆర్ఎస్ తరఫున ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది. అయితే మంగళవారం నాటి భేటీ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఆల ఖరారు..నేడు ప్రకటన ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. దీంతో అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు పూర్తి చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చర్చల అనంతరం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. మంగళవారం జరిగే భేటీ అనంతరం ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. రాహుల్‌గాందీతో పోటీకైనా రెడీ: నామా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పోటీ చేసినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్రావు ప్రకటించారు. తనను మరోమారు ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నామా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఖమ్మం జిల్లా ప్రజల ఆశీస్సులతో రెండుసార్లు ఎంపీగా గెలిచా. అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారు’అని నామా ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తప్పు చేశామనుకుంటున్నారు: మాలోత్ కవిత మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా మరోమారు పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన కేసీఆర్‌కు ఎంపీ మాలోత్ కవిత ధన్యవాదాలు తెలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పార్లమెంటు వేదికగా తన పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పారీ్టకి ఓట్లు వేసి తప్పు చేశామనే చర్చ ప్రజల్లో జరుగుతోందని పేర్కొన్నారు. మహబూబాబాద్‌లో మళ్లీ బీఆర్ఎస్దే విజయమని అన్నారు. -
అబద్ధాలు.. దోపిడీ
సాక్షి, ఆదిలాబాద్: కుటుంబ పార్టీల ముఖాలు వేర్వేరుగా ఉన్నా వారి చరిత్ర ఒకటేనని.. అబద్ధాలు ఆడటం, దోచుకోవడమనే రెండు అంశాలు వాటి చరిత్రలో తప్పకుండా ఉంటాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా మార్పేమీ లేదని.. ఇప్పుడు బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా అయ్యేదేమీ లేదని విమర్శించారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటేనన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే కాంగ్రెస్ దానిపై విచారణ చేయకపోగా కప్పిపుచ్చుతోందని ఆరోపించారు. ‘మీరు బాగుపడ్డారు.. మేమూ బాగుపడతాం.. మీరు తిన్నారు.. మేమూ తింటాం..’ అన్నట్టుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ల తీరు ఉందని విమర్శించారు. సోమవారం ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా రు. అనంతరం బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రసంగించారు. వివరాలు మోదీ మాటల్లోనే.. ‘‘ఇది ఎన్నికల సభ కాదు.. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదు. నాకు ఎన్నికలు ముఖ్యం కాదు.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం.. మీరంతా వికసిత్ భారత్ కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. దేశ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల పనులు చేపట్టాం. ఈ పదిహేను రోజుల్లో దేశంలో పలు ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఐఏఎంలు, ఎయిమ్స్‌లను ప్రారంభించాం. తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఆత్మనిర్భర్ భారత్ నుంచి వికసిత్ భారత్‌గా మారింది. కుటుంబ పార్టీలను నమ్మొద్దు అవినీతి, కుటుంబ పాలనలో ఇండియా కూటమి నేతలు నిండా మునిగారు. వారి తీరును నేను ప్రశ్నిస్తుంటే.. వారు నాపై ప్రతిదాడి చేస్తున్నారు. మోదీకి కుటుంబం లేదని విమర్శిస్తున్నారు. ఆ కుటుంబ పార్టీలను నమ్మొద్దు. ఎవరికైనా జైలుశిక్ష పడకపోతే రాజకీయాలకు పనికి రారని అన్నా అంటారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది. గత పదేళ్లలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారు. వచ్చే 25 సంవత్సరాల్లో.. అంటే 2047 నాటికి ప్రపంచంలో సమృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 400కుపైగా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తాం. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. మోదీ గ్యారంటీ అంటే.. గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ. గతంలో నేను చెప్పిన విధంగా సమ్మక్క–సారలమ్మ కొలువున్న చోట గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నాం. పత్తి రైతులకు ప్రయోజనకరంగా మద్దతు ధరను రికార్డు స్థాయిలో పెంచడం జరిగింది. దేశంలో ఏడు మెగా టెక్స్టైల్ పార్కులను నిర్మిస్తుండగా.. అందులో ఒకటి తెలంగాణలో చేపడుతున్నాం. వికసిత్ భారత్– వికసిత్ తెలంగాణ లక్ష్యంగా పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. రామ్‌లల్లా ఆశీర్వాదం ఉంటుంది రామ మందిరం బంగారు తలుపులు, ధ్వజ స్తంభం నిర్మాణంలో తెలంగాణ పాత్రను దేశం గుర్తించింది. రామ్ లల్లా ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఉంటుంది. రాంజీ గోండ్, కుమురంభీం వంటి యోధుల త్యాగాలకు తగ్గట్టుగా గత ప్రభుత్వాలు వ్యవహరించలేదు. మేం 2014 నుంచి ఆదివాసీల అభివృద్ధికి పాటుపడుతున్నాం. ఆదివాసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లో రాంజీ గోండ్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం. పీఎం జన్మన్ యోజనతో అంతరించిపోతున్న గిరిజన జాతుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాం. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం దేశంలోని 140 కోట్ల ప్రజలంతా నా కుటుంబమే. చిన్ననాడు ఒక కలతో ఇల్లు విడిచి బయటకు వచ్చాను. దేశ ప్రజల కోసమే నా జీవితాన్ని అంకితం చేశాను. ప్రతి క్షణం ప్రజల కోసమే పరితపిస్తాను. నాకంటూ ప్రత్యేకంగా కలలు లేవు. ప్రజల కలల సాకారమే నా లక్ష్యం. కోట్ల మంది ప్రజలు నన్ను ఇంటి మనిషిగా భావిస్తారు. ‘మేరా భారత్– మేరా పరివార్’..’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా సభలో ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీసీ కమిషన్ జాతీయ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం, ఎంపీ బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగులో ప్రసంగం మొదలుపెట్టి.. ప్రధాని మోదీ తన ప్రసంగంలో పలుమార్లు తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. ప్రసంగం మొదట్లోనే ‘నా తెలంగాణ కుటుంబ సభ్యుల్లారా.. నమస్కారం’ అంటూ ప్రారంభించారు. మధ్యలో ‘అబ్కీ బార్.. చార్సౌ పార్..’ అని మొదట హిందీలో చెప్పి తర్వాత.. ‘ఈసారి నాలుగు వందల సీట్లు.. బీజేపీకే ఓటు వేయాలి..’ అని తెలుగులో పిలుపునిచ్చారు. ‘మోదీ గ్యారంటీ అంటే.. గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ..’’ అని చెప్పారు. ‘మై హూ.. మోదీకా పరివార్’ అని చెప్పిన మోదీ తర్వాత ‘మై హూ..’ అంటూ ‘మోదీకా పరివార్’ అంటూ జనంతో చెప్పించారు. -
రేపు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను ఇటీవల 9 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసిన తెలిసిందే. బుధవారం నాటి భేటీలో పెండింగ్‌లోని మిగతా 8 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల బలాబలాలపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు కసరత్తు పూర్తిచేశాయి. ఈ క్రమంలోనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న, ఏకాభిప్రాయం కుదిరిన 9 మందితో తొలి జాబితాను ప్రకటించారు. టికెట్ కోసం పోటీ ఉన్న ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందనే దానిపై కసరత్తు చేశారు. పార్టీ పరంగా అంతగా బలమైన నాయకులు లేని వరంగల్, నల్లగొండ, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌లలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి నేతల చేరికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన మరో సిట్టింగ్ ఎంపీ బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ సదరు ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించేయడంతో.. ఆయనను మరోసీటు నుంచి బరిలో దిగాల్సిందిగా బీజేపీ నాయకత్వం కోరినట్టు తెలిసింది. దీనిపై సదరు ఎంపీ పెద్దగా ఉత్సాహం చూపడం లేదని సమాచారం. అయితే సీట్లపై ప్రాథమిక కసరత్తు ముగిసిన నేపథ్యంలో.. కొన్ని కొత్తపేర్లు తెరమీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
పార్టీని వీడే నేతలతో నష్టం లేదు
సాక్షి, హైదరాబాద్: పార్టీని వీడి వెళ్లే నేతలతో బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. పార్టీ ఓడిపోయిన చోట్ల కూడా నేతలు ధైర్యంగా ముందుకు వెళ్లి కేడర్‌లో ఆత్మస్థైర్యం నింపాలని పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో జరిగిన ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్ వంటి నేతకే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదని.. మనకూ తప్పవనే విషయాన్ని అర్థం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదామని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ఈ వ్యతిరేకతను బీఆర్ఎస్ సద్వినియోగం చేసుకునేలా పార్టీ నేతలు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ‘‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన పదేళ్ల పాలనలో ప్రజలకు చేయాల్సిందంతా చేశాం. దళితబంధు వంటి మంచి పథకం తెచ్చాం. ఎన్నికల్లో ఓట్లు ఆశించి అమలు చేయలేదు. రాష్ట్రంలో ప్రతి పథకాన్ని మనం ఆయా వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే అమలు చేశాం. అయినా ప్రతిపక్ష పాత్ర పోషించాలని మనకు ఓటర్లు తీర్పునిచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విలువను ప్రజలు తెలుసుకుని కచి్చతంగా ఆదరిస్తారు..’’అని పేర్కొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే గైర్హాజరు కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరుకాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన వెంకట్రావు.. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కుటుంబ సమేతంగా కలసిన విషయం తెలిసిందే. ఆయనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సన్నిహితుడిగా పేరుంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరినా.. చివరి నిమిషంలో తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీచేశారు. మరోవైపు సీఎం రేవంత్‌తో తెల్లం వెంకట్రావు భేటీ అయిన నేపథ్యంలో.. భద్రాచలానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పార్టీని వీడినా.. స్థానిక నేతలు అభద్రతా భావానికి లోనుకావొద్దని, పార్టీ వెంటే కొనసాగితే గుర్తింపునిస్తామని భరోసా ఇచ్చారు. 11న కాంగ్రెస్‌లోకి వెంకట్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ నెల 11న కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంబోత్సవం సందర్భంగా బూర్గంపాడులో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ సమక్షంలో వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్‌పై వ్యతిరేకత మొదలైంది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైందని, అడుగడుగునా కాంగ్రెస్‌ను నిలదీసే రోజులు ముందున్నాయని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నిలదీయడం బీఆర్ఎస్ పారీ్టకే సాధ్యమవుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు నామా నాగేశ్వర్రావు, మాలోత్ కవితతో పాటు ఆయా సెగ్మెంట్ల పరిధిలోని ముఖ్యనేతలతో తెలంగాణ భవన్లో హరీశ్ సోమవారం భేటీ అయ్యారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలతో చర్చించారు. కాంగ్రెస్ మోసాలను నిలదీస్తూ ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రుణమాఫీ, విద్యుత్ కోతలు, ట్యాంకర్లతో పొలాలకు నీరు, గ్యాస్ సబ్సిడీలో 70 శాతం లబ్ధి దారులకు మొండి చేయి వంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గల్లీలో కాంగ్రెస్ ఉన్నా ఢిల్లీ వేదికగా తెలంగాణ గొంతు వినిపించేందుకు బీఆర్ఎస్ ఎంపీలు అవసరమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులు పక్కా ప్రణాళికతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రజలను జాగృతం చేయాలని హరీశ్ పిలుపునిచ్చారు. -
ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ఆరోపించారు. ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్దికరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేటీఆర్ మాట్లాడారు. గతంలో ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలు, ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు.ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే ... ‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్, భట్టి విక్రమార్క సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్ను తప్పుపట్టారు. తాము అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. ప్రజల దగ్గర ఎలాంటి చార్జీలు వసూ లు చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగుతున్నారంటూ భట్టి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రిజిస్ట్రేషన్ అయిన స్థలాలకు మళ్లీ ఎందుకు డబ్బులు కట్టాలని కూడా అడిగారు. నాడు భట్టి విక్రమార్క చేసిన డిమాండ్‌నే నేను పునరుద్ఘాటిస్తున్నా. రాష్ట్ర ప్రజల జేబుల నుంచి రూ.20 వేల కోట్లు దోచుకోవడానికి కాంగ్రెస్ సర్కారు ఎల్ఆర్ఎస్ స్కీం అమలు చేస్తుంటే భట్టి ఎందుకు మాట్లాడడం లేదు? ఆగమేఘాల మీద మార్చి 31వ తేదీ లోపల ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాలని దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ఇది రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగడం కాదా? ప్రజలెవరూ ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టవద్దు. ఆ మాటలేవీ గుర్తులేవా? తమ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తే.. ‘నో ఎల్ఆర్ఎస్ – నో బీఆర్ఎస్’అన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రజలు నో కాంగ్రెస్ అంటున్నారనే విషయం తెలియడం లేదా? అప్పుడు ఉచితంగా క్రమబద్దికరిస్తామ న్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. రాష్ట్ర ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ పేరుతో సర్కారు డబ్బులు లాక్కోవడంపై స్పందించాలి. ఎల్ఆర్ఎస్ అంటే డబ్బులు దోచుకోవడానికేనని ప్రస్తుత మంత్రి సీతక్క అప్పట్లో మాట్లాడారు. మరి ఈరోజు ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఎల్ఆర్ఎస్పైన మంత్రి కోమటిరెడ్డి అప్పట్లో కోర్టులో కేసువేశారు. ఆ కేసును వెనక్కి తీసుకున్నారా? లేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి కేసు వేస్తారా?..’’అని కేటీఆర్ ప్రశ్నించారు. మార్చి 31 కల్లా డబ్బులు కట్టి తీరాలని ప్రజల మెడమీద కత్తి పెట్టారని, ప్రభుత్వ ఖజానా నింపడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 6, 7 తేదీలలో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాలని అడుగుతున్న అధికారులను నిలదీయాలన్నారు. ఎమ్మెల్సీ మనదే.. రెండు ఎంపీ సీట్లూ మనవే ‘స్థానిక’ఎమ్మెల్సీతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు లోక్‌సభ సీట్లను గెలుచుకునేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమై.. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై, మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చించారు. ఎమ్మెల్సీ, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒకట్రెండు రోజుల్లోనే ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలపైన పార్టీ అధినేత కేసీఆర్ విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీతోపాటు రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కే విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రూ.20 వేల కోట్లు దోచుకునే పన్నాగం ఎల్ఆర్ఎస్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న 25 లక్షల 44 వేలమంది లబ్ధిదారుల్లో ఒక్కొక్కరిపై కనీసం రూ.లక్ష చొప్పున భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 31వ తేదీలోగా రాష్ట్ర ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.20 వేల కోట్లు దోచుకునేలా పన్నాగం పన్నారు. ఎల్ఆర్ఎస్ను ఎలాంటి చార్జీలు తీసుకోకుండా అమలు చేయాలి. ఈ డిమాండ్‌తో ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలను చేపడతాం. 7న ప్రతి జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేస్తాం. హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతాం. – కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ -
‘ఎన్టీఆర్కే ఒడిదుడుకులు తప్పలేదు.. మనమెంత?’
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల కోసం ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. ఖమ్మం తరఫున నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత మరోసారి పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ముఖ్యనేతల భేటీ జరిగింది. ఈ భేటీలో కేసీఆర్ స్వయంగా ఈ పేర్లను ప్రకటించారు. ‘‘వచ్చే ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ మనమే గెలుస్తున్నాం. ప్రభుత్వానికి ప్రతిపక్షం రుచి చూపిస్తాం. ఎవరూ అధైర్య పడొద్దు. కేడర్ కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో పని చేయాలి.. ..దళితబంధు ఎన్నికల కోసం తేలేదు. ఒక విజన్ కోసం తెచ్చాను. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. పార్టీని వీడి వెళ్ళే నేతలతో మనకు ఏం నష్టం లేదు. ఎన్టీఆర్కే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదు. మనమెంత!. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ ఘోరంగా ఒడిపోయింది. తిరిగి మళ్లీ పుంజుకుంది. రాజకీయాల్లో ఒడిదుడుకులు వస్తాయి తట్టుకోవాలి. మనకు గ్రౌండ్ లో పరిస్థితి అనుకూలంగా ఉంది. నేతలు కలిసికట్టుగా పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావటం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది.. .. మనం ప్రజలకు చేయాల్సింది చేశాం. అయినా ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. ప్రజలకు మన విలువ తెలుస్తుంది. రాబోయే రోజులు మనవే. ప్రభుత్వానికి పై వ్యతిరేకత అంశాలు మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మనకు ఎజెండా ఇస్తుంది. వచ్చే రోజుల్లో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. కరీంనగర్ సభ తర్వాత ఖమ్మం లో మరో బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం. ఒక్కో నియోజక వర్గానికి ముగ్గురు సమన్వయకర్తలు నియమించుకుందాం’’ అని ఆ సమీక్షలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక.. ఖమ్మం,మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఇంచార్జ్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి,వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి రెడ్డిలను నియమిస్తున్నట్లు తెలిపారాయన. మొత్తం నాలుగుసార్లు ఖమ్మం ఎంపీగా పోటీ చేసిన నామా.. రెండుసార్లు నెగ్గారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి మీద గెలిచారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) తరఫున పోటీ చేసిన నామా.. మళ్లీ రేణుకా చౌదరిపైనే నెగ్గడం విశేషం. ఇదిలా ఉంటే.. సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవచ్చని.. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో నామా పేరును స్వయంగా కేసీఆర్ ప్రకటించడం గమనార్హం. అలాగే.. మహబూబాబాద్ నుంచి కూడా సిట్టింగ్ అభ్యర్థికే టికెట్ కేటాయించింది పార్టీ. మరోవైపు నిన్న కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థుల విషయంలోనూ కేసీఆర్ పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. కరీంనగర్ నుంచి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే.. అధికారికంగా వీళ్ల పేర్లను పార్టీ ప్రకటించాల్సి ఉంటుంది. -
కేసీఆర్ మీటింగ్‌కు డుమ్మా.. ఆ ఎమ్మెల్యే జంపింగ్ కన్ఫర్మ్!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్‌ల పర్వం మొదలైనట్లేననా?. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్‌కు.. ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు గైర్హాజరు కావడతో ఈ అంశం తెరపైకి వచ్చింది. విశేషం ఏంటంటే..ఆ జిల్లాలో బీఆర్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయన ఒక్కరే కావడం. సోమవారం బీఆర్ఎస్ అధికార భవనం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలపై లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. అయితే ఈ మీటింగ్‌కు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ హాజరు కాలేదని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం తరఫున బీఆర్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయనే. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌తో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లగా తెల్లం వెంకట్రావు మాత్రం వారితో వెళ్లలేదు. మరోవైపు ఇటీవలే కుటుంబంతో సహా ఆయన టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. దీంతో.. ఆయన పార్టీ మారబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది. అయితే ఈ పరిణామాలపై బీఆర్ఎస్ శ్రేణులు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గతంలోనూ ఆయన సీఎం రేవంత్‌ను కలవగా.. అప్పుడు ఇలాంటి ఊహాగానాలే వినిపించాయి. అయితే ఆ సమయంలో ఆయన ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాజా పరిణామాలతో వెంకట్రావు పార్టీ మారతారన్న అనుమానాలు బలపడుతున్నాయి. -
రేవంత్.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత సీరియస్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు. కాగా, ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీని రేవంత్ పెద్దన్న అని సంభోదించారు. దీంతో, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని అర్ధం అవుతుంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ.. ఎలా పెద్దన్న అవుతాడని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం కొత్తగా జీవో నంబర్-3ను తీసుకొచ్చింది. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. దీనికి నిరసనగా ఈనెల ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్‌లో నల్ల రిబ్బన్లతో ధర్నాలో పాల్గొంటాం. నిరసన కార్యక్రమాలు చేపడతాం. మహిళలకు, అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. 33 శాతం రావాల్సిన రిజర్వేషన్ పూర్తిగా వెనక్కి పోయింది. రోస్టర్ విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
దేశమంతా నా కుటుంబమే: ప్రధాని మోదీ
సాక్షి,ఆదిలాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండూ ఒకటేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దోచుకోవడం, అబద్ధాలు చెప్పడం జూట్, లూఠ్ రెండే కుటుంబ పార్టీలకు తెలుసని ఆయన మండిపడ్డారు. సోమవారం ఆదిలాబాద్‌లో జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని తొలుత మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా షెడ్యూలే రాలేదని, ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి సభ అని చెప్పారు. సభలో మోదీ మాట్లాడుతూ ‘తెలంగాణలో టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారిన తర్వాత ఎలాంటి మార్పు రాలేదు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమీ మార్పు రాదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కుంభకోణం చేస్తే ఆ స్కామ్ ఫైళ్లను కాంగ్రెస్ తొక్కి పట్టింది. మీరు తిన్నారు. మేమూ తింటాం అని కాంగ్రెస్ అంటోంది. మోదీ గ్యారెంటీపై ప్రస్తుతం దేశంలో చర్చ జరుగుతోంది. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ. వేల కోట్ల అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. దేశంలో అభివృద్ధి ఉత్సవం జరుగుతోంది. తెలంగాణప్రజల మద్య ఈ ఉత్సవం జరుపుకోవడానికి నేను ఇక్కడికి వచ్చా. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి ఉత్సవం చేస్తోంది. ఈ పదిహేను రోజుల్లో వివిధ రాషష్టట్రాల్లో రెండు ఐఐటీలు, 3 ఐఐఎంలు, ఒక్క ఐఐఎస్, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. ఇప్పుడు చెప్పండి ఇది అభివృద్ధి ఉత్సవం అవునా కాదా.. ఎన్నికలు వచ్చినపుడు ఎన్నికల గురించి చూసుకుందాం. నిన్న మంత్రి వర్గం, అధికారులు అందరం కలిసి రోజంతా వికసిత్ భారత్ గురించి చర్చించాం. వికసిత్ భారత్‌పై 15 లక్షల మంది ప్రజలు తమ సూచనలు చేశారు. ఇప్పటికి 3 వేల సమావేశాలు పెట్టాం. 11 లక్షల మంది వికసిత్ భారత్‌లో భాగస్వాములయ్యారు. తెలంగాణలోని గ్రామగ్రామంలో యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు అందరూ కలిసి అబ్ కీ బార్.. చార్ సౌ పార్ అని నినదిస్తున్నారు. అబ్ కీ బార్ నాలుగు వందలపైన.. బీజేపీకి ఓటు వెయ్యాలి. రాంజీగోండు, కొమురం భీములు పుట్టిన భూమి ఇది. వాళ్లు స్వాతంత్రం కోసం పోరాడారు. బీజేపీ రాకపోతే ఆదివాసి మహిళ దేశానికి రాషష్ట్రపతి అయ్యేదా. భగవాన్ బిర్సాముండా పుట్టినరోజును అధికారికంగా జరుపుకునే వాళ్లమా. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ట్రైబల్ మ్యూజియమ్‌కు రాంజీ గోండు పేరు పెడుతున్నాం. కుటుంబ పార్టీలకు ఇది సహించదు. మేం జాతి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వారు అడ్డుపడుతున్నారు. బీజేపీ ఆదివాసిల కోసం పనిచేస్తోంది. ఆదివాసీల కోసం బీజేపీ పీఎంజన్మన్యోజన ప్రారంభించింది. తెలంగాణలో సమ్మక్కసారక్క ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. మోదీకి గ్యారెంటీపై దేశంలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తి అయ్యే గ్యారెంటీ. తెలంగాణ రైతుల కోసం పసుపు బోర్డు ఇచ్చాం. పసుపు రైతులకు అన్ని రకాల మద్దతు ఇస్తాం. తెలంగాణకు ఒక మెగాటెక్స్‌టైల్ పార్కు ఇచ్చాం. నా జీవితం తెరిచిన పుస్తకం. దేశమంతా నా కుటుంబమే.. నేను చిన్నప్పుడు ఒక కలతో ఇళ్లు విడిచిపెట్టా. దేశ ప్రజల కోసం జీవించాలని ఇళ్లు విడిచిపెట్టా. మీ కలల కోసమే నా సంకల్పం. నాకు ప్రత్యేక కలలు ఏమీ లేవు. ఇందుకే దేశంలోని కోట్ల మంది నన్ను వారి కుటుంబ సభ్యుడు అని అనుకుంటారు. 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులే. నా దేశం నా కుటుంబం అన్న భావనతో మీ కోసం నేను జీవిస్తున్నా. అందుకే దేశం ఈరోజు నాది మోదీ కుటుంబమే(మై హూ మోదీకా పరివార్) అని చెబుతోంది. అయోధ్య రామ మందిరంలో బంగారు దర్వాజ, మందిరంలోని బంగారు ధ్వజ స్తంభం నిర్మాణంలో తెలంగాణ పాత్ర ఉంది. రామ్‌లల్లా ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఉంటుంది. వికసిత్ తెలంగాణ లక్ష్యాన్ని మేం తప్పకుండా పూర్తిచేస్తాం. రానున్న 25 ఏళ్లలో కష్టపడి దేశాన్ని ప్రపంచంలోనే అగ్ర దేశాల్లో ఒకటిగా తయారు చేయాలి. మీ ఆశీర్వాదం నాకు కావాలి. మీ ప్రేమ కావాలి’ అని మోదీ తన ప్రసంగాన్నిముగించారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్ -
చంద్రబాబు డైరెక్షన్.. నర్రెడ్డి సునీత యాక్షన్
'మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన తీరు, ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోని వారికి, చివరికి పార్టీ ఆఫీస్ అటెండర్ స్థాయి ఉండే నేతలకు సైతం ఆమె ధన్యవాదాలు తెలియచేసిన వైనం, అలాగే ఆ మీడియా సమావేశానికి హాజరైన ప్రతినిధులు కేవలం టీడీపీకి ఉపయోగపడే ప్రశ్నలు వేసిన పద్ధతి.. ఇవన్నీ గమనిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. సునీత కేవలం తన తండ్రి హత్య కేసు గురించి కన్నా, తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడాలన్న లక్ష్యంతోనే మాట్లాడారని తేలిపోతుంది. ఈనాడు పత్రికలో సునీత మీడియా సమావేశం వార్తను ఒక పేజీన్నర ప్రచురించారు. ఆ మొత్తం చదివితే ఆమె తెలివితక్కువగా చేసిన ప్రకటనలను ఎడిట్ చేసి పాఠకులను మోసం చేశారన్న సంగతి అర్ధం చేసుకోవచ్చు.' తన తండ్రి హత్య జరిగిన తర్వాత సునీత మాట్లాడిన మాటలకు, ఇప్పుడు చెబుతున్న అంశాలకు మధ్య ఎంతో తేడాను మనం గమనించవచ్చు. సునీత ఒక రాజకీయ దురుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాట్లాడుతున్నట్టు వినగానే మనకు అర్థమవుతుంది. వివేకా హత్య కేసు ఇప్పటికే తెలంగాణలోని సీబీఐ కోర్టులో విచారణలో ఉంది. దీనిలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రితో పాటు మరికొందరు జైలులో ఉన్నారు. సీబీఐ చార్జీషీట్ కూడా దాఖలు చేసింది. ఇక జరగవలసింది కోర్టు విచారణ మాత్రమే. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమి సంబంధం ఉంది? తనవద్ద ఆధారాలు లేవంటూ చెబుతూనే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విచారణ జరపాలని కోరడం వింత విడ్డూరంగా కనిపిస్తోంది. ఎవరైనా ఒక మాట చెబితే అందులో విశ్వసనీయత ఉండాలి. ఒక చిత్తశుద్ది ఉండాలి. కానీ సునీత మాత్రం ఎందుకో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కొందరు చూపుతున్న ప్రలోభాలకు లొంగి, వారు మాట్లాడమన్నట్లు మాట్లాడుతూ, వారు చెప్పినట్లు చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఆమెకు తన తండ్రి ప్రతిష్ట కన్నా, తనకు, తన భర్తకు ఏదో రాజకీయ పదవి కోసం పాకులాడుతున్నారన్న సందేహం వస్తుంది. అంతేకాక వివేకా హత్య కేసులో రెండో కోణంగా ఉన్న ఆయన వ్యక్తిగత జీవిత రహస్యాలను బహిర్గతం అవుతున్నా ఆమె ఫీల్ అవుతున్నట్లు కనిపించడం లేదు! తన తండ్రితో ఐదేళ్లుగా అంతగా సునీతకు సత్సంబంధాలు లేవని చెబుతున్నారు. అది నిజమా? కాదా? తండ్రి మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారన్నది వాస్తవమా? కాదా? వారికి పుట్టిన బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా సునీత అడ్డుపడే యత్నం చేశారన్నది కరెక్టా? కాదా? వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా! ఆ రోజుల్లో ఏ మాత్రం ఆధారం దొరికినా ఎంపీ అవినాశ్ రెడ్డిపైన కేసు పెట్టేవారు కదా! అప్పుడు ఎందుకు అలా చేయలేకపోయారో చంద్రబాబును సునీత ఎందుకు ప్రశ్నించలేదు? ఆనాడు టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలపై ఆరోపణలు చేసిన ఆమె ఎందుకు వారితో రాజీపడిపోయారు? అసలు వివేకాను తానే హత్య చేశానని చెబుతున్న దస్తగిరిని మాత్రం సునీత ఎందుకు రక్షిస్తున్నారు? అతనికి బెయిల్ వచ్చేందుకు ఎందుకు సహకరిస్తున్నారు? వివేకాను చంపినవారినే తన వద్ద పెట్టుకుని, ఇంకెవరిపైనో ఆరోపణలు చేయడం రాజకీయం కాకుండా ఉంటుందా? ఆమె తండ్రిపట్ల ఏ మాత్రం అభిమానం ఉన్నా ఇలా చేయగలుగుతారా? తన తండ్రి హత్య జరిగి ఐదేళ్లయినా విచారణ ఎందుకు పూర్తి కాలేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలోనే ఆమె దుర్బుద్ధి కనబడుతోంది. ఆమె కేంద్రాన్ని, భారతీయ జనతా పార్టీని లేదా సీబీఐని కదా అడగాల్సింది? లేదా హత్య జరిగిన సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబును విచారణ ఎందుకు పూర్తి కాలేదని అడగాలి కదా! హంతకులు పాలకులుగా ఉండరాదని ఆమె అంటున్నారు. అది నిజమే. అందుకే చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రజలు ఓడించారని అనుకోవాలి కదా! పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ తన అన్నకు ఓటు వేయవద్దని అంటున్నారంటేనే ఆమె ఎజెండా తెలిసిపోతుంది! వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి ఆమె గానీ, ఆమె కుటుంబం కానీ ఏదో ఆశించి ఉండాలి. అది నెరవేర్చడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధపడి ఉండకపోవచ్చు. ఆ కోపంతో టీడీపీ రాజకీయ ట్రాప్‌లోకి వెళ్లి, ఆ పార్టీ వారు సమకూర్చిన లాయర్ల సహకారంతో రకరకాల పిటిషన్లు వేసి ఇన్నాళ్లు సునీత కథ నడిపించారనిపిస్తుంది. వివేకా రాసిన లేఖను సునీత, ఆమె భర్త ఎందుకు దాచి ఉంచారు? బయటపెట్టొద్దని ముందే ఎందుకు హెచ్చరించారు.? ఈ విషయాలను కూడా సునీత ఎప్పుడూ బయటపెట్టలేదు. ఈమె మాదిరే సొంత చెల్లెలు షర్మిల కుటుంబం కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి ఏదో ఆశించిందని, కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించలేదని, తత్ఫలితంగానే ఆమె కూడా ఇదే రీతిలో రోడ్డెక్కి రాజకీయం చేస్తున్నారని తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఇక్కడ ఒక విషయం అంగీకరించాలి. తన చెల్లెళ్లను వదలుకోవడానికి అయినా వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధపడ్డారు తప్ప, ప్రజా ధనాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోలేదన్న విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ప్రతినిధులు హాజరై వారికి కావాల్సిన ప్రశ్నలు వేసినట్లు ఇట్టే కనిపెట్టేయవచ్చు. వాటిలో కొన్నింటిని గమనించండి.. మీ నాన్న హత్య కేసులో నిందితులను రక్షించడానికే వైఎస్ జగన్ పరిమితం అయ్యారు. ఇందులో ఆయన పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారా? అవినాశ్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సీబీఐ సుప్రింకోర్టుకు ఎందుకు వెళ్లలేదు? హత్యకు ఏ ఆయుధం ఉపయోగించింది? జగనే ఎలా చెప్పగలిగారని అనుకుంటున్నారు? అవినాశ్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? తెలుగుదేశం ఏ ఆరోపణలు చేస్తుంటుందో వాటినే ప్రశ్నలుగా మలిచి ఈ మీడియా ప్రతినిధులు వేశారంటేనే వీరందరి రాజకీయ లక్ష్యం తెలుసుకోవచ్చు. అదే కాదు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రఘురామకృష్ణరాజుతో సహా పలువురు చోటా, మోటా టీడీపీ లీడర్లకు సైతం సునీత కృతజ్ఞతలు చెబితే, దానిని మాత్రం ఈనాడులో ఎడిట్ చేశారు. ఆ పాయింట్ వల్ల టీడీపీకి నష్టం కలుగుతుందని ఈనాడు రామోజీరావు భావించడమే అని వేరే చెప్పనవసరం లేదు. ఏతావాతా వీటన్నిటిని గమనిస్తే ఒక విషయం బోధపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన స్కీములు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయుధాలుగా మార్చుకుని ప్రజల మద్దతుతో ఎన్నికల యుద్ధంలో పాల్గొంటుంటే, చంద్రబాబు మాత్రం తన ఆయుధాలుగా పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత, రఘురామకృష్ణరాజు, లాయర్లను మార్చుకుని కోర్టుల ద్వారా యుద్ధం చేయాలని భావిస్తున్నారు. ఆ ప్రక్రియలో సునీత కూడా ఒక భాగమే అని తేలడం లేదూ!. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘LRS’ అంశం: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎందుకు మాట నిలబెట్టుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి మాటలు వట్టి మాటలు అయ్యాయని ఎద్దేవా చేశారు. కాగా, కేటీఆర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలపై తీవ్రమైన ఆర్ధిక భారం మోపడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలు హామీలు ఇచ్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే దానిపై విషం చిమ్మింది. ఇప్పుడు అదే పథకాలను కాపీ కొడుతూ కాంగ్రెస్ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. ఎల్ఆర్ఎస్ ద్వారా లేఅవుట్లు క్రమబద్దీకరణ చేయాలని చూస్తోంది. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎల్ఆర్ఎస్ వద్దని కోర్టుకు వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి గతంలో ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ హోదాలో NO TRS NO LRS అని ప్రకటించారు. ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టోద్దు అంటూ ప్రకటన చేశారు. అప్పుడు ఎందుకు విమర్శించారు.. ఇప్పుడెందుకు అదే పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనిపై రభుత్వం సమాధానం చెప్పాలి. అప్పుడు ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కూడా ప్రజల రక్త మాంసాలు పీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా గతంలో మీరన్న మాటలే కదా?. భట్టి మాటలు వట్టి మాటలు అయ్యాయి. మధ్య తరగతి పేదల మీద 20వేల కోట్లు మోపేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు వసూలు చేసి భారం మోపుతోంది కాంగ్రెస్. ఈనెల 6న ఎల్ఆర్ఎస్ రద్దు కోసం హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తాం. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నిరసనలు చేస్తాం. ఏడో తేదీన కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నాలు చేపడుతున్నాం’ అని స్పష్టం చేశారు. -
రాజ్ భవన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
PM Modi Telangana Tour Updates.. ►రాజ్ భవన్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రాత్రికి అక్కడే బస ►మరికాసేపట్లో రాజ్ భవన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ►స్వాగతం పలుకనున్న గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్. ►నా తెలంగాణ కుటుంబ సభ్యులారా.. నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారాలు అంటూ తెలుగులో మోదీ ప్రసంగం ప్రారంభం. ►బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇది ఎన్నికల సభ కాదు.. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనే లేదు. మీరందరూ వికసిత్ భారత్ కోసం ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ►దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టాం. బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోంది. 15 రోజుల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 15 రోజుల్లో రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్ ఐటీ, ఒక ఐఐఎం, ఎయిమ్స్‌ను ప్రారంభించాం. దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టాం. తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వికసిత్ భారత్‌పై నిన్న మంత్రులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించాం. ►బీజేపీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం. కుటుంబ పార్టీలను నమ్మవద్దు. కుటుంబ పార్టీలో రెండే అంశాలు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. ఒకటి దోచుకోవడం, రెండోది అబద్ధాలు చెప్పడం. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిందేమీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగింది అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోంది?. ►నా జీవితం తెరచిన పుస్తకం. మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి. నా ఇంటిని వదిలిపెట్టి.. ఓ లక్ష్యంతో వచ్చాను. నా జీవితం దేశం కోసం అంకితం. మీ బిడ్డల కోసం నేను పరితపిస్తున్నాను. ►ఆదీవాసీ సమాజం కోసం బీజేపీ కృషి చేస్తుంది. ఆదివాసీల గౌరవాన్ని పెంచేందుకు బీజేపీ పనిచేస్తుంది. బీజేపీ రాకముందు ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా ఊహించారా?. మోదీ గ్యారంటీపై దేశవ్యాపంగా చర్చ జరుగుతుంది. మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా నెరవేరుతుంది. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లకుపైగా లోక్‌సభ స్థానాల్లో గెలుపే మా లక్ష్యం. ►రాంజీ గోండు పేరుతో హైదరాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఏడు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ, రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేశాం. ►బీజేపీ సభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లలో దేశ ముఖచిత్రాన్ని ప్రధాని మోదీ మార్చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి 17 సీట్లు రావాలి. కేసీఆర్ పార్టీ నిన్నటి పార్టీ. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేసే పరిస్థితి లేదు. కుటుంబ, అవినీతి పాలనను కేసీఆర్ తెలంగాణ ప్రజలపై రుద్దారు. ►బీజేపీ సభలో ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. గత 40 ఏళ్ల కాలంలో ప్రధాని హోదాలో ఒక్క ప్రధాని కూడా రాలేదు. ప్రధాని మోదీ మాత్రమే ఆదిలాబాద్‌కు వచ్చారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తోంది. ►ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బీజేపీ సభకు హాజరైన ప్రధాని మోదీ. ►ఆదిలాబాద్‌లో పార్టీ వేదికపైకి చేరుకున్న ప్రధాని మోడీ ►మోదీకి స్వాగతం పలికిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, సోయం బాపూరావ్, నలుగురు ఎమ్మెల్యేలు ► ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనం. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం సహకరిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు అవుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష. తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నాం. ►వికసిత్ భారత్ లక్ష్యంగా పాలన సాగిస్తున్నాం. రూ.56వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. ఎన్టీపీసీ రెండో యూనిట్‌తో తెలంగాణ అవసరాలు తీరుతాయి. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఎన్టీపీసీని జాతికి అంకితం చేశాం. ఆర్ధిక వ్యవస్థ బలపడితే రాష్ట్రాలకు లాభం కలుగుతుంది. ►ఆర్థిక వ్యవస్థ బలపడితే దేశంపై విశ్వాసం పెరుగుతుంది. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. వచ్చే పదేళ్లలో భారత్ అభివృద్ధిపరంగా మరింత ముందుకెళ్తుంది. కేంద్రం తీసుకున్న చర్యలతో దేశవ్యాప్తంగా 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ► రామగుండం ఎన్టీపీసీ స్టేజ్ వన్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ.. ములుగు, బేలాలో రెండు జాతీయ రహదారులకు వర్చువల్‌గా శంకుస్థాపన. ఆరు ప్రాజెక్ట్‌లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. ►ఇప్పటికే పూర్తి అయిన 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం. సుమారు 10,599 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ నిర్మాణం. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో సహకరిస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ప్రాజెక్ట్‌లో మిగిలిన వాటికి అన్ని విధాలుగా సహకరిస్తాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధానికి సాదర స్వాగతం. గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ ఉత్పత్తిలో వెనుకబడ్డాం. కేంద్రంతో పదేపదే ఘర్షణాత్మకమైన వైఖరితో ఉంటే రాష్ట్ర అభివృద్ధి వెనుకబడుతుంది. రాష్ట్రాభివృద్ధి కార్యాచరణతో ముందుకెళ్తాం. ►మావైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవు. గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు మీ సహకారం కావాలి. ప్రధానమంత్రి అంటే మాకు పెద్దన్నలాంటివారు. విభజన చట్టంలో నాలుగువేల మెగావాట్లకు బదులు కేవలం 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సాధించాం. దేశంలో ఐదు ట్రిలియన్ ఎకానమీ సాధనకు తెలంగాణ సహకరిస్తుంది. కంటోన్మెంట్ రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించారు. ఇది తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుంది. ఆదిలాబాద్‌కు నీళ్లు ఇవ్వాలంటే తుమ్మిడిహట్టి నిర్మించాలి. దీని కోసం భూసేకరణకు కావాల్సిన పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. ► ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ►ఆదిలాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. ►ఆదిలాబాద్ చేరుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు.. ►ఆదిలాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ►నేడు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. కాగా, మోదీ పర్యటన షెడ్యూల్లో చివరి నిమిషంలో స్వల్ప మార్పు జరిగింది. ఆయన ఈరోజు ఉదయం 11:30 గంటలకు నాగ్‌పూర్‌లో హెలిప్యాడ్ వద్దకు రానున్నారు. అంతకుముందు షెడ్యూల్(10:20 గంటలకు) కన్నా ఒక గంట ఆలస్యంగా పర్యటన ప్రారంభం కానుంది. ►ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటన కోసం నేడు తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ►ఇక, తెలంగాణలో మొత్తం రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు (4న ఆదిలాబాద్‌లో రూ.6,697 కోట్లు, 5న సంగారెడ్డిలో రూ.9,021 కోట్లు) ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ►అలాగే, రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోసం ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని సభలు పార్టీ యంత్రాగానికి మరింత ఊపు తెస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆదిలాబాద్‌లో హైఅలర్ట్ ప్రధాని మోదీ, సీఎం రేవంత్ పర్యటనల నేపథ్యంలో భారీ భద్రత ఎస్పీజీ భద్రతా వలయంలో ఏరోడ్రం, ఇందిర ప్రియదర్శిని స్డేడియం రెండువేల మంది భద్రతతో రక్షణ వలయం మోదీ పర్యటన ఇలా.. ►ప్రధాని సోమవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కేందానికి చేరుకుంటారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. కాగా మోదీ రోడ్డు మార్గంలో స్టేడియానికి చేరుకుంటారు. ►అక్కడ రెండు వేదికలు ఏర్పాటు చేయగా, అందులో మొదటి వేదిక నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పాల్గొంటారు. ►అనంతరం రెండో వేదికపైకి వెళ్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందులో కిషన్‌రెడ్డితో పాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు బండి సంజయ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొననున్నారు. ఆదిలాబాద్‌లో మోదీ సుమారు రెండు గంటల పాటు ఉండనున్నారు. ఇక్కడినుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి నాందేడ్‌కు, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లనున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ►మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో సివిల్ ఏవియేషన్ రీసెర్చి ఆర్గనైజేషన్ (సీఏఆర్ఓ)ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం సంగారెడ్డి పర్యటనలో పాల్గొంటారు. అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ►ప్రధాని పర్యటన పురస్కరించుకుని మొత్తం 2 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇలావుండగా సోమవారం ఆదిలాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తెలిపారు. -
హామీ ప్రకారం గ్యారంటీల అమలు
నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వ గృహజ్యోతి పథకం ఫేమస్ అని, కేసీఆర్ ప్రభుత్వ 24 గంటల కరెంట్ మొత్తం బోగస్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన నల్లగొండలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు. ఇ చ్చిన హామీ ప్రకారం 90 రోజుల్లోపే నాలుగు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తున్నామన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ధ్వజమెత్తారు. పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వని బీఆర్ఎస్.. నేతలు నేడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 25 వేల మంది నిరుద్యోగులకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చామని, డీఎస్సీ, గ్రూప్–1 నోటిఫికేషన్లు ఇచ్చామని వివరించారు. రాబోయే రెండేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి నల్లగొండ జిల్లాకు తాగు, సాగు నీటి కష్టాలు లేకుండా చేస్తామన్నారు. 11 నుంచి ఇందిరమ్మ ఇళ్లు.. ఈనెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని.. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వమే మామిల్లగూడెంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. రూ. వేల కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. బైక్ నడిపిన మంత్రి కోమటిరెడ్డి.. నల్లగొండలో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా బైక్ నడిపి హల్చల్ చేశారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని బైక్‌పై ఎక్కించుకుని పట్టణంలోని పలు వార్డుల్లో తిరిగారు. హైదర్‌ఖాన్‌గూడ అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ హరిచందనతో కలసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన తిప్పర్తి మండలం మర్రిగూడ, కనగల్ మండలాల్లోని పలువురు గృహజ్యోతి లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి బిల్లుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ బచ్చా.. ఆయనతో పోటీ ఏంటి! ‘కేటీఆర్ ఒక బచ్చా.. ఆయన తండ్రి చాటు కొడుకు. ఆయనతో నాకు, సీఎం రేవంత్‌కు పోటీ ఏంటి’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి నల్లగొండ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా.. కేటీఆర్‌పై పోటీ చేస్తున్నారా? అని మీడియా అడగ్గా పైవిధంగా స్పందించారు. ‘కేటీఆర్.. కేసీఆర్ సీఎం అయి, టికెట్ ఇస్తే అమెరికా నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిండు. మా లెక్క కష్టపడి రాలేదు’అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జెడ్పీటీసీగా ఇండిపెండెంట్‌గా గెలిచి అక్కడ నుంచి ఎమ్మెల్యే, ఎంఎల్సీగా, ఎంపీగా అయి, ముఖ్యమంత్రి వరకు ఎదిగారన్నారు. తాను కూడా ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్‌లో కొట్లాడి ఎమ్మెల్యే అయ్యానని, తమది వ్యవసాయ కుటుంబమని.. కేటీఆర్ తండ్రి వ్యవసాయం చేయడం లేదని స్పష్టం చేశారు. అలాంటి బచ్చాతో మాకు పోటీయా? అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. పార్లమెంట్ టికెట్ల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని, నల్లగొండ, భువనగిరిలో తమ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థులే మోదీ కంటే అత్యధిక మెజారీ్టతో విజయం సాధిస్తారని అన్నారు. -
కాంగ్రెస్ దోఖేబాజ్ పార్టీ
హుజూరాబాద్: కాంగ్రెస్ పార్టీ దోఖేబాజ్ పార్టీ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఓట్లు దండుకున్న ఆ పార్టీ.. అధికారంలోకొచ్చాక వాటికి కోతలు పెడుతూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇళ్లకోసం లక్షలాది కుటుంబాలు పదేళ్లుగా అల్లాడుతుంటే నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాహితయాత్రలో భాగంగా ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన పాదయాత్ర చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే రూ.5 లక్షల కోట్లు అవసరమని, ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ప్రతినెలా రూ.2,500, ఆసరా కింద రూ.4 వేలు, రూ.రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామంటే ప్రజలు ఓట్లేశారని, ఇప్పటివరకు ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్రంలో 90 లక్షల తెల్లరేషన్ కార్డులుంటే.. అందులో 40 లక్షల మందికి మాత్రమే రూ.500కు గ్యాస్ సిలిండర్, రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్‌ను అమలు చేస్తామంటున్నారని, మిగిలిన వారి సంగతేంటని ప్రశ్నించారు. నరేంద్రమోదీ లేని భారత్‌ను ఎవరూ ఊహించుకోవడం లేదని, మోదీని మూడోసారి ప్రధానిగా చేసేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తమకు పోటీయే కాదని, గతంలోకంటే భారీ మెజార్టీతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని బండి చెప్పారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.