కెప్టెనా...మజాకా! | Vijayakanth maintains suspense on tie-up for Lok Sabha polls | Sakshi
Sakshi News home page

కెప్టెనా...మజాకా!

Feb 6 2014 12:44 AM | Updated on Mar 29 2019 9:18 PM

కెప్టెనా...మజాకా! - Sakshi

కెప్టెనా...మజాకా!

డీఎండీకేను కూటమిలో చేర్చుకోవడం ద్వారా రాష్ట్రం నుంచి లోక్‌సభకు మెజార్టీ స్థానాలు సాధించవచ్చన్న ఆలోచనతో ఉన్న

 చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎండీకేను కూటమిలో చేర్చుకోవడం ద్వారా రాష్ట్రం నుంచి లోక్‌సభకు మెజార్టీ స్థానాలు సాధించవచ్చన్న ఆలోచనతో ఉన్న పార్టీలతో కెప్టెన్ ఆడుకుంటున్నారు. పొత్తు వద్దంటూనే మూడు పార్టీల నాయకులతో చర్చలు జరుపుతూ వ్యవహారా న్ని మూడు ముక్కలాటగా మార్చారు. మింగుడు పడని విజయకాంత్ వైఖరి ఆయా పార్టీ నేతలకే కాదు, డీఎండీకే శ్రేణుల్లోనూ చికాకు పుట్టిస్తోంది. భారతీయ జనతా పార్టీ, డీఎంకేలతో మాత్రమే పొత్తు చర్చలు సాగిస్తూ వచ్చిన విజయకాంత్ తాజాగా కాంగ్రెస్ నాయకులతో మొదలెట్టారు.
 
 రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ  దాదాపుగా ఏదోఒక కూటమిలో చేరిపోయాయి. వామపక్షాలు అమ్మ పంచన చేరిపోయాయి. పీఎంకే సైతం నేడో రేపో బీజేపీకి జై కొట్టేదిశగా పయనిస్తోంది. ఇక మిగిలింది డీఎండీకే మాత్రమే. గత ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపునకు డీఎంకే సాయం కోరిన కెప్టెన్ చివరకు భంగపడ్డారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో డీఎండీకే కోసం డీఎంకే పడిగాపులు కాసేలా చేసి కెప్టెన్ ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇటీవల జరిగిన డీఎండీకే మహానాడులో కెప్టెన్ సతీమణి ప్రేమలత డీఎంకేపై దుమ్మెత్తిపోశారు. అయినా ఇవేమీ పట్టించుకోని డీఎంకే అధినేత  కరుణానిధి కెప్టెన్ కోసం ఎదురు చూస్తున్నారు. పొత్తు నిర్ణయాలను ప్రకటించడమే ప్రధాన ఉద్దేశంగా పార్టీ మహానాడును నిర్వహించిన విజయకాంత్ ఆఖరు క్షణంలో వాయిదా వేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
 
 ఁపార్టీలో మెజార్టీ నేతలు, కార్యకర్తలు ఒంటరిపోటీనే కోరుకుంటున్నారు, అయితే అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నారూ. అంటూ వేదికపై నుంచి విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణులనేగాక పొత్తుకోసం ప్రయత్నిస్తున్న అన్ని పార్టీలను అయోమయంలో పడవేశాయి. పొత్తు నిర్ణయాన్ని దాటవేయడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడే ప్రధాన కారణమని రూఢీగా తెలుస్తోంది. డీఎండీకే రాష్ట్ర ఇన్‌చార్జ్, విజయకాంత్ మేనల్లుడైన సతీష్‌తో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్ తరచూ ఫోన్ ద్వారా సంభాషిస్తున్నట్లు సమాచారం.   మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత ఈవీకేఎస్ ఇళంగోవన్ డీఎండీకే పొత్తుకు ఆహ్వానం పలుకుతూ బుధవారం బహిరంగ పిలుపునిచ్చారు. ఈనెల 3వ తేదీన ఢిల్లీకి చేరుకున్న సతీష్ బీజేపీ ముఖ్యనేతలతో చర్చించినట్లు సమాచారం.
 
 డీఎండీకేతో మొదటి దశ చర్చలను పూర్తిచేసిన బీజేపీ ఈనెల 7వ తేదీలోగా పొత్తుపై ఏవిషయం చెప్పాలని విజయకాంత్‌పై వత్తిడి తెస్తోంది. అన్నిపార్టీల్లోనూ డీఎండీకేకు గిరాకీ పెరగడంతో కెప్టెన్ సరికొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. 20 లోక్‌సభ స్థానాలు, ఒక రాజ్యసభ కేటాయిస్తేనే పొత్తు కుదుర్చుకుంటామని బీజేపీకి షరతు విధించారు. ఈ డిమాండ్లతో ఖంగుతిన్న బీజేపీ 12 సీట్లు మాత్రమే కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేస్తోంది.
 
ఈనెల 8వ తేదీన చెన్నై వండలూరులో జరిగే మోడీ బహిరంగ సభా వేదికపై పొత్తు ఖరారైన ఎండీంకే అధినేత వైగో, పీఎంకే తరపున మాజీ కేంద్రమంత్రి అన్బుమణి రాందాస్‌లు ఆశీనులయ్యేలా బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే 7వ తేదీలోగా కెప్టెన్ తన నిర్ణయాన్ని ప్రకటించకుంటే వైగో, అన్బుమణిని కూర్చోబెట్టాలా వద్దా అని బీజేపీ మీమాంసలో పడిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్నా పొత్తులపై ఎటూతేల్చకుండా బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేలను కెప్టెన్ తన చుట్టూ తిప్పుకోవడం మూడుముక్కలాటను తలపిస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement