పసికందు అపహరణ కేసులో ఇద్దరి అరెస్టు | Sakshi
Sakshi News home page

పసికందు అపహరణ కేసులో ఇద్దరి అరెస్టు

Published Wed, Nov 6 2013 2:14 AM

Two men arrested in babe abduction case

 సాక్షి, ముంబై:  పుణేలో ఓ మూడు నెలల పసికందును అపహరించి రూ.90 వేలకు విక్రయించిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి... పని వెతుక్కుంటూ రాజు పారధి, రేఖ తమ మూడు నెలల కుమారుడు అమర్‌నాథ్‌తో పుణేకు వచ్చారు. వీరికి జూనా పూల్‌గేట్ ప్రాంతానికి చెందిన మనీష్ గాంధీ, పరేశా అనే దంపతులతో పరిచయమైంది. వారికి పనిప్పిస్తామని మాయమాటలు చెప్పి వారిని బస్సులో స్వార్‌గేట్‌కు తెచ్చారు. అక్కడ నుంచి పాటిల్ ప్లాజాకు తీసుకొచ్చి వారి మూడు నెలల చిన్నారిని అపహరించారు.
 
 ఈ విషయంపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగ దంపతుల ఊహా చిత్రాలను తయారు చేసి అంతటా పంపించారు. అలాగే సీసీటీవీ ఫుటేజీ ఆధారంపై కూడా దర్యాప్తు జరిపారు. సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రామ్ పఠారేకు ఎనిమిది రోజుల తర్వాత  నిందితులు మనీష్ గాంధీ, పరే శా చిక్కారు. వారు అపహరించిన చిన్నారిని రూ.90 వేలకు ధనక్‌వడిలోని బాలకృష్ణ సొసైటీలో నివసించే నవీన్ గుడికుండ్లా, సుప్రియ దంపతులకు విక్రయించినట్లు వారు విచారణలో ఒప్పుకున్నారు. తమకు మగసంతానం లేదని ఆ దంపతులు బాలుడిని కొన్నట్లు తెలిసింది. పోలీసులు నవీన్, సుప్రియలను అదుపులోకి తీసుకున్నారు. పసికందును ఆస్పత్రికి తరలించినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ రామనాథ్ పోక్లే వివరించారు.
 

Advertisement
Advertisement