స్థానిక సంస్థల పరిపాలనలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు సంబంధించి త్వరలో కొత్త చట్టం తీసుకురావాలని భావిస్తోంది.
- స్థానిక సంస్థల పాలనలో మార్పులు
- {పత్యేక అధికారుల నియామకం
సాక్షి ప్రతినిధి, చెన్నై: స్థానిక సంస్థల పరిపాలనలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు సంబంధించి త్వరలో కొత్త చట్టం తీసుకురావాలని భావిస్తోంది. తమిళనాడులో 12 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు 12,524 పంచాయతీలు, 529 పట్టణ పంచాయతీలు, 385 పంచాయతీ యూనియన్లు 31 జిల్లా పంచాయతీ అనే స్థానిక సంస్థలు ఉన్నాయి. 2011లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్, కౌన్సిలర్ల పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఆనాటి ఎన్నికల్లో ఎన్నికైనవారు అక్టోబరులో బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఐదేళ్లకు నిర్వహిస్తుండగా, ఈ లెక్కన గత ఎన్నికల పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగుస్తుంది.
సామాజికపరమైన రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయలేదని డీఎంకే వేసిన పిటిషన్‌తో ఈనెల 17, 19 తేదీల్లో జరగాల్సిన ఎన్నికలను కోర్టు రద్దు చేస్తూ తీర్పు నిచ్చింది. ఈ ఏడాది డిసెంబరులోగా కొత్తగా నోటిఫికేషన్‌ను జారీచేసి ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈనెల 25వ తేదీలోగా రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు మేయర్లు, చైర్మన్లు, అధ్యక్షులు ఎన్నిక కాలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు నిర్వహించే వరకు స్థానిక సంస్థల్లో ప్రజలచేత ఎన్నుకోవాల్సిన పదవులు ఖాళీగానే ఉంటాయి. దీంతో స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు వచ్చే వరకు పరిపాలన సాగించేందుకు ప్రత్యేక అధికారి అవసరం ఏర్పడింది. అంటే ఈనెల 24వ తేదీలోగా ప్రత్యేక అధికారుల నియామకం పూర్తిచేయాల్సిన ఒత్తిడి ప్రభుత్వంపై పడింది. ఈ పరిస్థితిలో పురపాలనశాఖ కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. కార్పొరేషన్లలో 1996కు ముందు కమిషనర్ లేదా జిల్లా కలెక్టర్లే ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తూ కార్పొరేషన్‌ను పాలించేవారు.
20 ఏళ్ల తరువాత నేడు ప్రత్యేక అధికారిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కొత్త చట్టంతో ప్రత్యేక అధికారులను నియమించడమా లేదా కమిషనర్లకు, జిల్లా కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించడమా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. చెన్నై గ్రేటర్ కార్పొరేషన్ కావడంతో కమిషనర్ కాకుండా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మున్సిపాలిటీలు, పంచాయతీల్లో సైతం ప్రస్తుతం ఉన్న కమిషనర్లరే ప్రత్యేక అధికారులుగా నియమించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో అధికారిక పాలన ప్రారంభించేందుకు ముందుగా పన్నీర్‌సెల్వం అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. మంత్రి వర్గం తీర్మానించిన తరువాత గవర్నర్ ఆమోదానికి పంపి ఆ తరువాత అమల్లోకి తెస్తారు.