breaking news
The new law
-
కొత్త చట్టం
- స్థానిక సంస్థల పాలనలో మార్పులు - {పత్యేక అధికారుల నియామకం సాక్షి ప్రతినిధి, చెన్నై: స్థానిక సంస్థల పరిపాలనలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు సంబంధించి త్వరలో కొత్త చట్టం తీసుకురావాలని భావిస్తోంది. తమిళనాడులో 12 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు 12,524 పంచాయతీలు, 529 పట్టణ పంచాయతీలు, 385 పంచాయతీ యూనియన్లు 31 జిల్లా పంచాయతీ అనే స్థానిక సంస్థలు ఉన్నాయి. 2011లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్, కౌన్సిలర్ల పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఆనాటి ఎన్నికల్లో ఎన్నికైనవారు అక్టోబరులో బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఐదేళ్లకు నిర్వహిస్తుండగా, ఈ లెక్కన గత ఎన్నికల పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగుస్తుంది. సామాజికపరమైన రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయలేదని డీఎంకే వేసిన పిటిషన్‌తో ఈనెల 17, 19 తేదీల్లో జరగాల్సిన ఎన్నికలను కోర్టు రద్దు చేస్తూ తీర్పు నిచ్చింది. ఈ ఏడాది డిసెంబరులోగా కొత్తగా నోటిఫికేషన్‌ను జారీచేసి ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈనెల 25వ తేదీలోగా రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు మేయర్లు, చైర్మన్లు, అధ్యక్షులు ఎన్నిక కాలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు నిర్వహించే వరకు స్థానిక సంస్థల్లో ప్రజలచేత ఎన్నుకోవాల్సిన పదవులు ఖాళీగానే ఉంటాయి. దీంతో స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు వచ్చే వరకు పరిపాలన సాగించేందుకు ప్రత్యేక అధికారి అవసరం ఏర్పడింది. అంటే ఈనెల 24వ తేదీలోగా ప్రత్యేక అధికారుల నియామకం పూర్తిచేయాల్సిన ఒత్తిడి ప్రభుత్వంపై పడింది. ఈ పరిస్థితిలో పురపాలనశాఖ కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. కార్పొరేషన్లలో 1996కు ముందు కమిషనర్ లేదా జిల్లా కలెక్టర్లే ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తూ కార్పొరేషన్‌ను పాలించేవారు. 20 ఏళ్ల తరువాత నేడు ప్రత్యేక అధికారిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కొత్త చట్టంతో ప్రత్యేక అధికారులను నియమించడమా లేదా కమిషనర్లకు, జిల్లా కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించడమా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. చెన్నై గ్రేటర్ కార్పొరేషన్ కావడంతో కమిషనర్ కాకుండా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మున్సిపాలిటీలు, పంచాయతీల్లో సైతం ప్రస్తుతం ఉన్న కమిషనర్లరే ప్రత్యేక అధికారులుగా నియమించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో అధికారిక పాలన ప్రారంభించేందుకు ముందుగా పన్నీర్‌సెల్వం అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. మంత్రి వర్గం తీర్మానించిన తరువాత గవర్నర్ ఆమోదానికి పంపి ఆ తరువాత అమల్లోకి తెస్తారు. -
‘ఎర్ర’దొంగల కోసం కొత్త చట్టం
ఏపీలో ‘కఫిపొసా’ తరహా చట్టానికి సిద్ధమవుతున్న ప్రతిపాదనలు స్టోరీ బోర్డు హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్ల ఆటకట్టించడానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు పటిష్టమైన చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. అటవీ చట్టంలో ఉన్న సెక్షన్ 49 ప్రకారం పోలీసు అధికారులు ఎర్రచందనాన్ని సీజ్ చేసినా.. తమంతట తాముగా స్వాధీనం చేసుకునే అధికారం లేదు. సదరు స్మగ్లర్ అక్రమ రవాణా ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టాడని తెలిసినా వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉండట్లేదు. దీంతో ఈ పరిస్థితుల్ని మార్చి, ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు ప్రస్తుతం ఉన్న అటవీ చట్టంలోనూ సవరణలకు సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ స్మగ్లింగ్‌ను నిరోధించడం కోసం కస్టమ్స్ అధికారులు ప్రయోగిస్తున్న ‘ది కన్సర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్సేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ (కఫిపొసా)-1974’ తరహాలో తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ తరహా చట్టం అమలులోకి వస్తే ఎర్రచందనం స్మగ్లర్లకు బెయిల్ కష్టతరం కావడంతో పాటు వారికి సంబంధించిన ప్రైవేట్ ఆస్తుల్ని సైతం స్వాధీనం చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్తున్నారు. అయితే అటవీ సంబంధ విషయాలు కేంద్రం-రాష్ట్రం ఉమ్మడి జాబితాలో ఉన్నవి కావడంతో వీటి అమలుకు కేంద్ర ప్రభుత్వం నుంచీ అనుమతి పొందడం అనివార్యంగా మారింది. మరో నెల రోజుల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలా.. వాస్తవానికి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ప్రకారం ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి నమోదు చేయడానికి ప్రత్యేక సెక్షన్లు ఏవీ లేవు. దీంతో పట్టుబడ్డ ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్లపై పోలీసులు అటవీ చట్టంలోని కొన్ని సెక్షన్లతో పాటు చోరీ (ఐపీసీ 379), అనుమతి లేకుండా ఓ ప్రాంతంలో గుమిగూడటం (ఐపీసీ 147), మారణాయుధాలతో గుమిగూడటం (ఐపీసీ 148), ఓ నేరం చేసేందుకు సమూహంగా గుమిగూడటం (ఐపీసీ 149) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సరిపెట్టాల్సి వస్తోంది. వీటిలో నిందితులకు తేలిగ్గా బెయిల్ లభించే అవకాశం ఉండటంతో స్మగ్లర్లను వీలైనంత ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు హత్యాయత్నం (ఐపీసీ 307), ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం/దాడి చేయడం (ఐపీసీ 353) వంటి సెక్షన్లు జోడిస్తున్నారు. సదరు స్మగ్లర్లు, కూలీలను అరెస్టు చేసే సందర్భంలో ఈ పరిణామాలు ఎదురైనా, కాకున్నా అనివార్యంగా వీటిని జోడించాల్సి వస్తోంది. ఫలితంగా కేసు న్యాయస్థానంలో విచారణకు వచ్చినప్పుడు నిరూపించడం కష్టంగా మారి వీగిపోయే పరిస్థితులు ఉన్నాయి.