
‘ఎర్ర’దొంగల కోసం కొత్త చట్టం
ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్ల ఆటకట్టించడానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు పటిష్టమైన చట్టానికి రూపకల్పన చేస్తున్నారు.
ఏపీలో ‘కఫిపొసా’ తరహా చట్టానికి సిద్ధమవుతున్న ప్రతిపాదనలు
స్టోరీ బోర్డు
హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్ల ఆటకట్టించడానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు పటిష్టమైన చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. అటవీ చట్టంలో ఉన్న సెక్షన్ 49 ప్రకారం పోలీసు అధికారులు ఎర్రచందనాన్ని సీజ్ చేసినా.. తమంతట తాముగా స్వాధీనం చేసుకునే అధికారం లేదు. సదరు స్మగ్లర్ అక్రమ రవాణా ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టాడని తెలిసినా వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉండట్లేదు. దీంతో ఈ పరిస్థితుల్ని మార్చి, ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు ప్రస్తుతం ఉన్న అటవీ చట్టంలోనూ సవరణలకు సన్నాహాలు చేస్తోంది.
అంతర్జాతీయ స్మగ్లింగ్‌ను నిరోధించడం కోసం కస్టమ్స్ అధికారులు ప్రయోగిస్తున్న ‘ది కన్సర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్సేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ (కఫిపొసా)-1974’ తరహాలో తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ తరహా చట్టం అమలులోకి వస్తే ఎర్రచందనం స్మగ్లర్లకు బెయిల్ కష్టతరం కావడంతో పాటు వారికి సంబంధించిన ప్రైవేట్ ఆస్తుల్ని సైతం స్వాధీనం చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్తున్నారు. అయితే అటవీ సంబంధ విషయాలు కేంద్రం-రాష్ట్రం ఉమ్మడి జాబితాలో ఉన్నవి కావడంతో వీటి అమలుకు కేంద్ర ప్రభుత్వం నుంచీ అనుమతి పొందడం అనివార్యంగా మారింది. మరో నెల రోజుల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఇలా..
వాస్తవానికి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ప్రకారం ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి నమోదు చేయడానికి ప్రత్యేక సెక్షన్లు ఏవీ లేవు. దీంతో పట్టుబడ్డ ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్లపై పోలీసులు అటవీ చట్టంలోని కొన్ని సెక్షన్లతో పాటు చోరీ (ఐపీసీ 379), అనుమతి లేకుండా ఓ ప్రాంతంలో గుమిగూడటం (ఐపీసీ 147), మారణాయుధాలతో గుమిగూడటం (ఐపీసీ 148), ఓ నేరం చేసేందుకు సమూహంగా గుమిగూడటం (ఐపీసీ 149) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సరిపెట్టాల్సి వస్తోంది. వీటిలో నిందితులకు తేలిగ్గా బెయిల్ లభించే అవకాశం ఉండటంతో స్మగ్లర్లను వీలైనంత ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు హత్యాయత్నం (ఐపీసీ 307), ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం/దాడి చేయడం (ఐపీసీ 353) వంటి సెక్షన్లు జోడిస్తున్నారు.
సదరు స్మగ్లర్లు, కూలీలను అరెస్టు చేసే సందర్భంలో ఈ పరిణామాలు ఎదురైనా, కాకున్నా అనివార్యంగా వీటిని జోడించాల్సి వస్తోంది. ఫలితంగా కేసు న్యాయస్థానంలో విచారణకు వచ్చినప్పుడు నిరూపించడం కష్టంగా మారి వీగిపోయే పరిస్థితులు ఉన్నాయి.