కీచక కండక్టర్పై విద్యార్థినుల ఫిర్యాదు | students complaints on conductor in chirala over harassment | Sakshi
Sakshi News home page

కీచక కండక్టర్పై విద్యార్థినుల ఫిర్యాదు

Dec 17 2016 3:42 PM | Updated on Nov 9 2018 4:10 PM

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థినులతో కండక్టర్లు వ్యవహరిస్తున్న తీరు అమానవీయంగా ఉంది.

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆర్టీసీ కండక్టర్‌
ప్రశ్నించిన వారిని బస్సు నుంచి దించేసిన వైనం
నిరసనగా డిపో ఎదుట విద్యార్థినుల ధర్నా
చీరాల డిపో మేనేజర్‌కు ఫిర్యాదు

చీరాల:
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థినులతో కొందరు కండక్టర్లు వ్యవహరిస్తున్న తీరు అమానవీయంగా ఉంది. బస్సు పాసుల తనిఖీల పేరుతో విద్యార్థినుల చేతులు, బుగ్గలు పట్టుకుని వేధిస్తున్నారు. ప్రశ్నించిన విద్యార్థినులను మార్గమధ్యంలోనే బస్సు నుంచి దించేసి ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై విద్యార్థినులు ధర్నాకు దిగి కీచక కండక్టర్‌పై డిపో మేనేజర్‌ డి.శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు.  

అసలేం జరిగిందంటే..
ఈపూరుపాలెం నుంచి రోజుకు సుమారు 100 మంది విద్యార్థినులు చీరాల ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలకు ఆర్టీసీ బస్సుల్లో వస్తుంటారు. గురువారం కళాశాల అనంతరం ఇంటికి వెళ్లేందుకు చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో రేపల్లె వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఆ బస్సులో ఉన్న కండక్టర్‌ శ్రీనివాసరావు.. స్టూడెంట్‌ పాస్‌ ఉన్న విద్యార్థులు బస్సు ఎక్కొద్దంటూ హెచ్చరించాడు. తమకు పాస్‌లున్నాయని చెప్పి కొందరు బస్కెక్కారు. బస్‌ పాస్‌ల తనిఖీ పేరుతో విద్యార్థినుల చేతులు, బుగ్గలు పట్టుకుని కండక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. ఏం చదువుతున్నారు...ఏ కళాశాలలో చదువుతున్నారంటూ అనవసరంగా ప్రశ్నించి వేధించాడు. కొందరు విద్యార్థినులు తమపై చేతులు వేయవద్దంటూ కండక్టర్‌కు ఎదురుదిగారు. కోపగించుకున్న కండక్టర్‌.. స్టూడెంట్‌ పాస్‌లు ఉన్న వారు తమ బస్సులు ఎక్కొద్దని, మీ వల్ల ఆర్టీసీకి నష్టం... అంటూ విద్యార్థినులను బస్‌స్టాండ్‌లోనే దించేశాడు. విద్యార్థినులంతా తమకు ఆర్టీసీ బస్సులో జరిగిన అన్యాయాన్ని శుక్రవారం కళాశాల అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లారు.

ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేశారు. కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎం శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ విద్యార్థినులను వేధించిన కండక్టర్‌ ఏ డిపోకు చెందిన వారో తెలుసుకుని చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని విద్యార్థినులకు హామీ ఇచ్చారు. డీఎంను కలిసిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆదిత్య, అనీల్, విద్యార్థినులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement