పోలీసుస్టేషన్‌లో తండ్రిని అతని తనయుడు హత్యచేశాడు. ఈ సంఘటన తేనిలో చోటుచేసుకుంది.
చెన్నై: పోలీసుస్టేషన్‌లో తండ్రిని అతని తనయుడు హత్యచేశాడు. ఈ సంఘటన తేనిలో చోటుచేసుకుంది. తేనికి సమీపం అరణ్మణై పుదూర్‌కు చెందిన ఈశ్వరన్ (45). ఈయన వ్యవసాయం, ఫైనాన్స్ చేస్తున్నారు. ఇతని భార్య కల్పన 11 ఏళ్ల క్రితం మృతి చెందింది. వీరికి నిత్య (21), గోపినాథ్ (18), మల్లిక (15) పిల్లలు. కల్పన మృతి చెందిన వెంటనే ఆమె చెల్లెలు ఈశ్వరి (32)ని ఈశ్వరన్ రెండవ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ధనశేఖరన్ (10) అనే కుమారుడున్నాడు.
ఈ క్రమంలో ఈశ్వరన్ అదే ప్రాంతానికి చెందిన సెల్వి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని పదేళ్లుగా కుటుంబం నడుపుతున్నాడు. దీంతో ఈశ్వరి, తన కుమారుడు, సోదరి పిల్లలతో కష్టపడి కుటుంబాన్ని నడుపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో సెల్వి కుమార్తెకు పెళ్లి చేసేందుకు ఈశ్వరన్ ఇంటిని విక్రయించేం దుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. దీని గురించి తెలుసుకున్న ఈశ్వరి జూలై 24వ తేదీ తేని ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
ఈ కేసును తేని మహిళా పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. విచారణ కోసం ఈశ్వరి, అక్క కుమారుడు గోపీనాథ్, ఈశ్వరన్‌లను సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తేని మహిళా పోలీసుస్టేషన్‌కు వచ్చారు. పోలీ సుస్టేషన్ ఆవరణలో తండ్రి ఈశ్వరన్‌ను గమనించిన గోపీనాథ్ కత్తితో తండ్రిపై దాడి చేశాడు. దాడిలో గాయపడిన ఈశ్వరన్‌ను పోలీసులు ఆస్పత్రికి తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తండ్రిపై దాడి చేసిన గోపీనాథ్ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు గోపీనాథ్‌ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.